Real Estate: రియల్ ఎస్టేట్‌లో కొత్త ట్రెండ్

by S Gopi |

డెవలపర్లు పెద్ద, ప్రీమియం ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెడుతుంటే, మరోవైపు చాలామంది కొనుగోలుదారులు ఇంకా బడ్జెట్ ధరల్లో ఉండే ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు.

Real Estate: రియల్ ఎస్టేట్‌లో కొత్త ట్రెండ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్ హౌసింగ్ మార్కెట్ అమ్మకాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఒకవైపు డెవలపర్లు పెద్ద, ప్రీమియం ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెడుతుంటే, మరోవైపు చాలామంది కొనుగోలుదారులు ఇంకా బడ్జెట్ ధరల్లో ఉండే ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మ్యాజిక్‌బ్రిక్స్ ప్రాప్‌ఇండెక్స్ పేర్కొన్న ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య డేటా ప్రకారం, ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఇళ్ల సరఫరాలో 46 శాతం వాటా త్రిబుల్ బెడ్‌రూమ్ ఇళ్లదే, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వాటా 32 శాతం మాత్రమే ఉంది. హైబ్రిడ్ వర్క్, ఇంటి నుంచే పని, పిల్లల చదువు, ఉమ్మడి కుటుంబాల అవసరాల వల్ల పెద్ద ఇళ్లపై ఆసక్తి పెరుగుతోందని డెవలపర్లు భావిస్తున్నారు. అయితే కొనుగోలుదారుల డిమాండ్ మాత్రం భిన్నంగా ఉంది. మొత్తం డిమాండ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు 42 శాతం, త్రిబుల్ బెడ్‌రూమ్‌లకు 37 శాతం వాటా ఉంది. అలాగే 750 నుంచి 2,000 చదరపు అడుగుల మధ్య ఉన్న ఇళ్లే మొత్తం డిమాండ్‌లో దాదాపు 70 శాతం వాటా దక్కించుకోవడం గమనార్హం. దీనర్థం కస్టమర్లలో కొనుగోలు సామర్థ్యమే ఇప్పటికీ మార్కెట్‌ను ప్రభావితం చేస్తోందని సూచిస్తోంది.

ధరల పరంగా కూడా నగరాల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. కోల్‌కతా, అహ్మదాబాద్, పూణే, గ్రేటర్ నోయిడా వంటి నగరాల్లో రూ. 75 లక్షల లోపు ఇళ్లకే ఎక్కువ డిమాండ్ కొనసాగుతోంది. మరోవైపు బెంగళూరు, హైదరాబాద్, గురుగ్రామ్, నోయిడాల్లో రూ. 1.5 కోట్ల నుంచి రూ. 3 కోట్ల మధ్య ప్రీమియం ఇళ్లకు ఆదరణ పెరుగుతుండగా, అత్యంత విలాసవంతమైన హౌసింగ్ మార్కెట్ మాత్రం ఇంకా ముంబై, గురుగ్రామ్, న్యూఢిల్లీ చుట్టూనే ఉంది. దేశవ్యాప్తంగా ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఇళ్ల డిమాండ్ 1 శాతం తగ్గగా, కొత్త సరఫరా 1.2 శాతం పెరిగింది. సగటు ధరలు కూడా 1 శాతం పెరిగాయి. నగరాల వారీగా చూస్తే కోల్‌కతాలో డిమాండ్ 7.5 శాతం, నోయిడాలో 5.5 శాతం, గ్రేటర్ నోయిడాలో 4.1 శాతం, పూణేలో 2.1 శాతం పెరిగింది. అయితే హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లో ధరలు పెరుగుతున్నప్పటికీ కొనుగోలుదారుల ఆసక్తి కొంత తగ్గిందని నివేదిక చెబుతోంది.

Next Story