- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే కుట్రలను ప్రజలే తిప్పికొట్టాలి : ఎమ్మెల్యే
ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటే పునాది అని, ప్రతి అర్హుడైన పౌరుడి ఓటు రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు.

దిశ, చందంపేట-నేరేడుగొమ్ము: ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటే పునాది అని, ప్రతి అర్హుడైన పౌరుడి ఓటు రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత మాత్రమే కాకుండా, దేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే జాతీయ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. సోమవారం చందంపేట, నేరేడుగొమ్ము మండల రైతు వేదికల్లో నిర్వహించిన ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియపై అవగాహన సమావేశాల్లో ఎమ్మెల్యే బాలు నాయక్ పాల్గొన్నారు. బీఎల్ఓలు, బీఎల్ఏలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన ఓటు హక్కును కల్పించిందని, ఆ హక్కును పరిరక్షించడం ద్వారానే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని అన్నారు. ఒకే ఒక్క ఓటు ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలదని, ప్రభుత్వాలను మార్చగలదని, ప్రజల భవిష్యత్తును నిర్ణయించే శక్తి ఓటుకు ఉందని పేర్కొన్నారు. అందువల్ల ప్రతి అర్హుడైన ఓటరు తన పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదైందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, అవసరమైతే ఎస్‌ఐఆర్ ప్రక్రియ ద్వారా సవరణలు చేయించుకోవాలని సూచించారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యనైనా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు పవిత్రమైనదని, అర్హులైన ఓటర్ల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించే ప్రయత్నాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
రాజ్యాంగ విలువలను పరిరక్షించడం కోసం..
ప్రతి అర్హుడి ఓటు నమోదై ఉండేలా కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అప్రమత్తంగా పనిచేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రాజ్యాంగబద్ధ సంస్థల స్వతంత్రత ప్రశ్నార్థకంగా మారుతోందని, ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఎమ్మెల్యే విమర్శించారు. ప్రజల ఓటు హక్కును బలహీనపరిచే లేదా ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే ఎలాంటి ప్రయత్నాన్నైనా కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం చేస్తున్న పోరాటం ప్రతి భారతీయుడి హక్కుల కోసమేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల ఓటు హక్కును కాపాడడం, రాజ్యాంగ విలువలను పరిరక్షించడం కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి గ్రామంలో అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో తుది నిర్ణయం ప్రజలదేనని, ప్రజల ఓటు కంటే గొప్ప శక్తి మరొకటి లేదని ఎమ్మెల్యే బాలు నాయక్ స్పష్టం చేశారు. ప్రజలు తమ ఓటు విలువను గుర్తించి అప్రమత్తంగా ఉంటేనే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, దేశ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని అన్నారు. ఈ సమావేశాల్లో చందంపేట, నేరేడుగొమ్ము మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, బీఎల్ఓలు, బీఎల్ఏలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






