పెరుగు ప్యాకెట్‌లో చచ్చిన ఎలుక పిల్ల

by Malleboina Mahesh |

వరంగల్‌లో దారుణం.. 'సంగం' పెరుగు ప్యాకెట్‌లో చచ్చిన ఎలుక పిల్ల! అలర్ట్ అయిన అధికారులు, 4 ప్రాంతాల్లో ఆ బ్యాచ్ ప్యాకెట్లు సీజ్, ల్యాబ్‌కు శాంపిల్స్.

పెరుగు ప్యాకెట్‌లో చచ్చిన ఎలుక పిల్ల
X

దిశ, వెబ్ డెస్క్: ఓ కష్టమర్ కొన్న పెరుగు ప్యాకెట్ లో చచ్చిన ఎలుక పిల్ల ప్రత్యక్షమవ్వడంతో షాక్ తిన్నాడు. వివరాల్లోకి వెళితే.. వరంగల్‌ నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ తోట సమీపంలో గల ఒక కిరాణా షాపులో కొనుగోలు చేసిన 'సంగం' బ్రాండ్ పెరుగు ప్యాకెట్‌లో చనిపోయిన ఎలుక పిల్ల ప్రత్యక్షమవ్వడం తీవ్ర కలకలం రేపింది. ఒక వినియోగదారుడు పెరుగు ప్యాకెట్‌ను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లి కట్ చేయగా, అందులో చచ్చిన ఎలుక పిల్ల కనిపించడంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే సదరు వ్యక్తి కిరాణా షాపు యజమానిని నిలదీయడంతో పాటు ఈ ఆహార నాణ్యత లోపంపై ఆహార భద్రతా అధికారులకు ఫిర్యాదు చేశాడు.

ఈ ఘటనపై స్పందించిన జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి నేతృత్వంలోని అధికారులు వెంటనే సదరు కిరాణా దుకాణాన్ని పరిశీలించి, ఎలుక వచ్చిన ప్యాకెట్‌కు సంబంధించిన నిర్దిష్ట బ్యాచ్ నంబర్‌ను గుర్తించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ బ్యాచ్‌ పెరుగు ప్యాకెట్ల అమ్మకాలను తక్షణమే నిలిపివేయించారు. ఇందులో భాగంగా జనగామలో 50 ప్యాకెట్లతో పాటు కరీమాబాద్‌, లక్ష్మీపురం మార్కెట్‌ ఏరియా, హనుమకొండ భవానీనగర్‌లోని పలు షాపుల్లో ఉన్న ఆ బ్యాచ్ పెరుగు ప్యాకెట్లను అధికారులు సీజ్ చేశారు. ఈ పెరుగు శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ఫుడ్ ల్యాబ్‌కు పంపుతున్నామని, నివేదిక ఆధారంగా కఠిన చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

Next Story