వరుడి డిజిటల్ మీడియా చెక్ చేసిన వధువు.. పెళ్లి రద్దుకు కారణం!

by Yella Dhawani Reddy |

పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైనది. కేవలం రెండు మనుషుల మధ్య బంధం మాత్రమే కాదు..

వరుడి డిజిటల్ మీడియా చెక్ చేసిన వధువు.. పెళ్లి రద్దుకు కారణం!
X

దిశ, వెబ్ డెస్క్: పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైనది. కేవలం రెండు మనుషుల మధ్య బంధం మాత్రమే కాదు.. ఇది రెండు కుటుంబాల కలయిక, భావోద్వేగాల సమ్మేళనం, భవిష్యత్తుపై కలల నిర్మాణం. అందుకే గతంలో పెద్దలు 'అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలనేవారు'. అంటే.. వ్యక్తి గుణ గణాలు, కుటుంబ ఆచార వ్యవహారాలు, కుటుంబ నేపథ్యం వంటి ఎన్నో అంశాలు గమనించి పెళ్లిళ్లు కుదుర్చేవారు. కానీ, ప్రస్తుత ఆధునిక యుగంలో ఎన్నో మార్పులతో పాటు పెళ్లి కుదుర్చుకునే విషయంలో అనేక మార్పులు వచ్చాయి. 'అబ్బాయికి మంచి ఉద్యోగముంది', 'అమెరికాలో సెటిల్ అయ్యాడు', 'కుటుంబానికి ఫుల్ ఆస్తి ఉంది' అనే మాటలతోనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. కుటుంబ నేపథ్యం, వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుందనే అంశాలు లోతుగా తెలుసుకోకుండానే పెళ్లిళ్లు చేసేస్తున్నారు.

ఓ 22 ఏళ్ల యువతికి అరేంజ్‌డ్ మ్యారేజ్ (Arranged Marriage) సందర్భంలో తనకు ఎదురైన అనుభవాల్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్ వేదికగా పంచుకుంది. ఆమెకు మంచి ఉద్యోగం, ఆస్తి ఉన్న అబ్బాయితో పెళ్లి కుదిరిందని చెప్పింది. అయితే, ఆమెకు నెట్టింట ఓ యూజర్ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి డిజిటల్ మీడియాలో (Digital media) చెక్ చేయమని సలహా ఇవ్వటంతో ఆమె అతని డిజిటల్ ప్రొఫైల్‌ను పూర్తిగా పరిశీలించింది. అప్పుడే ఆమెకు తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి షాకింగ్ నిజాలు తెలిసినట్లు చెప్పింది. తెలియని అమ్మాయిలాగా అతడికి ఇన్‌స్టాగ్రామ్‌లో మేసేజ్ చేస్తే అశ్లీల చిత్రాలు పంపుతూ, పోర్న్ చూసే విషయం గురించి చర్చించాడని తెలిపింది. ఈ విషయం తమ కుటుంబసభ్యులతో చెప్పటంతో పెళ్లి రద్దు చేసినట్లు పేర్కొంది.

చివరగా, ఆ అమ్మాయి లింక్‌డిన్, ఇన్‌స్టాగ్రామ్ తప్పనిసరిగా చెక్ చేయాలని సలహా ఇచ్చింది. ఈ విషయం కేవలం అమ్మాయిలకు మాత్రమే కాదని అబ్బాయిలు కూడా తమ జీవిత భాగస్వామి గురించి పూర్తిగా తెలుసుకోవాలని సూచించింది. ఇక ఈ వార్త ప్రస్తుత నెట్టింట వైరల్‌గా మారింది. 'సోషల్ మీడియా మాత్రమే కాదు, అవసరమైతే సిక్రెట్‌గా గూఢచారిని కూడా పెట్టుకోవాలి' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Next Story