అబ్బాయిలు ‘అంకుల్స్‌’లా కనిపిస్తున్నారు.. కూతురికి వరుడు దొరకడం లేదని తల్లి ఆవేదన

by Ramesh Naini |

ఒక తల్లి తన కుమార్తె కోసం వరుడిని వెతకడంలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.

అబ్బాయిలు ‘అంకుల్స్‌’లా కనిపిస్తున్నారు.. కూతురికి వరుడు దొరకడం లేదని తల్లి ఆవేదన
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుత కాలంలో యువతీ యువకులకు సరైన పెళ్లి సంబంధాలు దొరకడం ఒక సవాల్‌గా మారినట్లు కన్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక తల్లి తన కుమార్తె కోసం వరుడిని వెతకడంలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఆ తల్లి చేసిన వ్యాఖ్యలు నెటిజన్లలో తీవ్ర చర్చకు, ఆగ్రహానికి దారితీశాయి.

‘అంకుల్స్’లా ఉంటున్నారు..

ఆ తల్లి తన వీడియోలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆమె కుమార్తె MBBS, MD పూర్తి చేసిన ఉన్నత విద్యావంతురాలు. అయితే ఆమె స్థాయికి తగ్గ వరుడు దొరకడం లేదని ఆ తల్లి ఆవేదన చెందారు. ముఖ్యంగా 32 నుంచి 34 ఏళ్ల వయసున్న అబ్బాయిలు చూడటానికి ‘అంకుల్స్’లా కనిపిస్తున్నారని ఆమె విమర్శించారు. పెళ్లి సంబంధాలకు వెళితే కొందరికి బట్టతల ఉండటం, మరి కొందరు విపరీతమైన బరువు పెరగడం వల్ల తన కూతురికి ఈడుజోడు సరిపోవడం లేదని ఆమె వాపోయారు. ఒకవేళ అబ్బాయి అందంగా ఉన్నా, అతను తన కుమార్తె చదువుకున్న స్థాయికి (MD) సరితూగడం లేదని ఆమె తన అసహనాన్ని వ్యక్తం చేశారు.

నెటిజన్ల ‘రివర్స్’ ఎటాక్!

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా అబ్బాయిల రూపాన్ని విమర్శించడంపై ఒక నెటిజన్ చేసిన కామెంట్ విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. ‘అవ్వ కావాలి.. బువ్వ కావాలంటే కుదరదు. ఇలాగే అందం కోసం వేచి చూస్తే మీ బిడ్డ కూడా త్వరలోనే 'ఆంటీ' అయిపోతుంది. ఇష్టపడి, కష్టపడి డాక్టర్ చదివితే ఒత్తిడి వల్ల జుట్టు ఊడటం సహజం. అంతగా కావాలంటే డబ్బులు పోసి సర్టిఫికెట్లు కొనుక్కునే వారిని వెతుక్కోండి’ అంటూ సదరు నెటిజన్ ఘాటుగా బదులిచ్చారు. మరి కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ‘జీవితంలో అన్ని విషయాల్లో పర్‌ఫెక్ట్ కావాలనుకుంటే కుదరదు, కొన్నిసార్లు సర్దుకుపోవాలి’ అని హితవు పలుకుతున్నారు. ఈ వైరల్ వీడియో ప్రస్తుతం పెళ్లి సంబంధాల విషయంలో మారుతున్న ధోరణులకు అద్దం పడుతోంది.

Next Story