Viral video: స్ట్రీట్ ఫుడ్‌లో దొరికే ఆమ్లెట్‌కు రూ.3,500.. ప్రత్యేకత ఏంటంటే?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-24 05:00:42  IST  )

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల ఆహార వంటకాలు ఉన్నాయి.

Viral video: స్ట్రీట్ ఫుడ్‌లో దొరికే ఆమ్లెట్‌కు రూ.3,500.. ప్రత్యేకత ఏంటంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల ఆహార వంటకాలు ఉన్నాయి. అలాగే, ఒక్కో ప్రాంతంలో ఒక్కో వంటకానికి ప్రత్యేకస్థానం ఉంటుంది. హైదరాబాద్‌ అంటే బిర్యానీ.. నెల్లూరు అంటే చేపల పులుసు.. విజయవాడ అంటే చిట్టిపునుగులు.. రాయలసీమ సైడ్‌ నాటుకోడి, రాగిసంకటి.. ఇలా విదేశాల్లో కూడా ఆయా వంటకాలు ఫేమస్ అయి ఉంటాయి. ఇలా ఫేమస్ వంటకాల గురించి ఒకప్పుడు అంటే తెలియకపోయేది కానీ, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచంలో ఏ మూలన ఏం వంటకం రుచికరమైనది, ఏ వంటకం ఖరీదైనది ఇట్టే తెలిసిపోతున్నాయి. ఇందుకు కోసం కొంతమంది యూట్యూబర్లు దేశవిదేశాలు తిరుగుతూ అక్కడి ఫేమస్ ఆహార పదార్థాలను వాటి రుచి, ధరలను వివరిస్తూ స్పెషల్‌గా ఫుడ్ వ్లాగ్స్ కూడా చేస్తున్నారు.

ఇక ఇటీవల కాలంలో స్ట్రీట్ ఫుడ్‌ కూడా చాలా ఫేమస్ అవుతోంది. పైగా తక్కువ ఖర్చుతో రుచికరమైన ఆహారం లభిస్తుంది. ఇక్కడ ఎంత తిన్న బిల్లు రూ.500 కూడా దాటదు. కానీ, ఓ యూట్యూబర్ రోడ్‌సైడ్ స్టాల్‌లో ఒక ఆమ్లెట్ కోసం రూ.3,500 చెల్లించాడు. ఆమ్లెట్‌కు రూ.3,500 ఏంటని షాకవుతున్నారా? ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అంతేకాదు, దాని ధరపై నెటిజన్లు తీవ్రంగా చర్చించుకుంటున్నారు కూడా. మరీ ఆ విశేషాలేంటో తెలుసుకుందామా.

'DCT ఈట్స్' పేరుతో దాసరాజ్ సెంథామిల్ తరుణ్ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. ఇందులో దేశ విదేశాల్లోని ఫేమస్ వంటకాల గురించి వ్లాగ్ చేసి షేర్ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల అతడు బ్యాంకాక్‌లోని మిచెలిన్-స్టార్ రెస్టారెంట్ 'రాన్ జే ఫై'ని సందర్శించాడు. తరుణ్ అక్కడి వెళ్లేసరికి స్టాల్ ముందు ఎయిర్‌పోర్టులో చెక్‌ఇన్ తలపించేలా భారీ క్యూ ఉండటం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆర్డర్‌ను వారు ముందే తీసుకున్నారు. ఇక అతడు అక్కడ ఎంతో ఫేమస్ అయినా పీత ఆమ్లెట్‌ను ఆర్డర్ చేశాడు. దీని ధర రూ.3,500గా ఉంది.

సీటు దొరికినా అరగంటకు అతడు ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది. బంగారు రంగులో పెద్ద సైజులో ఉన్న డీప్-ఫ్రైడ్ పీతల ఆమ్లెట్ చూసి ఆశ్చర్యపోయాడు. 'ఇది ఇంత పెద్దగా, ఇంత ఖరీదుగా ఎందుకు?' అని ప్రశ్నించాడు. అయితే, ఆమ్లెట్‌ను రుచి చూడగానే అద్భుతంగా ఉందని చెప్పాడు. ఆమ్లెట్‌లో మృదువైన పీత మాంసం, సంపూర్ణంగా వండిన గుడ్లు ఉండటం వల్ల రుచి ఎంతో భాగుందని, ధర ఎక్కువైనప్పటికీ ఈ అనుభవం మరపురానిదని తరుణ్ తెలిపాడు. ఇక తరుణ్ షేర్ చేసిన ఈ వీడియో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతమైన వ్యూస్ సాధించింది. నెటిజన్లు దీని ధరపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, కొందరు రుచి కోసం ఈ ధర సమంజసమేనని, మరికొందరు ఇంత ఖరీదు అనవసరమని కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఈ ఆమ్లెట్‌ను 81 ఏళ్ల చెఫ్ జే ఫై, స్కీ గాగుల్స్ ధరించి ఒంటరిగా వండుతారు. ఇది ఈ స్టాల్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని తరుణ్ చెప్పాడు. 2018లో రాన్ జే ఫై థాయ్‌లాండ్‌లో మిచెలిన్ స్టార్ పొందిన మొట్టమొదటి స్ట్రీట్ ఫుడ్ స్టాల్‌గా నిలిచింది. 2021లో ఆసియాలోని 50 ఉత్తమ రెస్టారెంట్ల ఐకాన్ అవార్డుతో దీని ఖ్యాతి మరింత పెరిగింది.

Next Story