బర్గర్ కింగ్‌లో పనిచేసే యువకుడికి కోట్ల విరాళం.. ఒక్క వైరల్ వీడియోతో జీవితం మలుపు!

by Yella Dhawani Reddy |

గ్రాడ్యూయేషన్ డే అంటే విద్యార్థి జీవితంలో ఓ మైలురాయి! ఆనందం, అభిమానం, ఫోటోలు, ఫ్రెండ్స్‌తో సెల్ఫీలు, పార్టీలు..

బర్గర్ కింగ్‌లో పనిచేసే యువకుడికి కోట్ల విరాళం.. ఒక్క వైరల్ వీడియోతో జీవితం మలుపు!
X

దిశ, వెబ్ డెస్క్: గ్రాడ్యూయేషన్ డే (Graduation Day) అంటే విద్యార్థి జీవితంలో ఓ మైలురాయి! ఆనందం, అభిమానం, ఫొటోలు, ఫ్రెండ్స్‌తో సెల్ఫీలు, పార్టీలు.. ఆ సందడి వేరే లెవల్‌లో ఉంటుంది. పాత జ్ఞాపకాలను తలచుకుంటూ, భవిష్యత్తు కలలతో కొత్త పయనానికి తొలి అడుగులు వేయడమే ఆ రోజుని మరపురాని అనుభూతిగా మార్చుతుంది. అయితే, గ్రాడ్యూయేషన్ డే జ్ఞాపకాలు ప్రతి ఒక్కరికీ ఒకేలా ఉండవని.. అమెరికాలోని జార్జియా (Georgia) రాష్ట్రానికి చెందిన 18 ఏళ్ల మైకేల్ బేకర్‌ను చూస్తే స్పష్టమవుతుంది. ఫోటోలు తీయడం, పార్టీ చేసుకోవడం వదిలేసి.. అతను తన గ్రాడ్యూయేషన్ గౌన్, మెడల్స్‌తోనే ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ బర్గర్ కింగ్‌లో (Burger king) ఉద్యోగానికి హాజరయ్యాడు. కుటుంబానికి భారం కాకూడదనే బాధ్యతభావంతో, అతను సెలబ్రేషన్స్‌కు బదులు పని చేయడం ఎంచుకున్నాడు.

అతని ఈ వినయపూరితమైన ధోరణి, పని పట్ల ఉన్న గౌరవం అక్కడి కస్టమర్లను ఆకర్షించింది. అదే సమయంలో బర్గర్ కింగ్‌కు వచ్చిన మరియా మెండోజా అనే స్థానిక మహిళా అతడి వెనక ఉన్న కష్టాన్ని గుర్తించి సాయం చేయాలనుకుంది. వెంటనే అతడికి తెలియకుండా వీడియో తీసి సోషల్ మీడియలో షేర్ చేసింది. అలాగే, 'From Burger King to a College Dream' అనే పేరుతో 'ఎంత మంది విద్యార్థులు పార్టీల్లో ఆనందిస్తుంటే, ఈ యువకుడు మాత్రం తన గ్రాడ్యుయేషన్ గౌన్‌లోనే తన డ్యూటీకి వెళ్లాడు. ఇతరులను ఆకర్షించాలని మాత్రం కాదు' అని GoFundMe ఫండ్‌రైజర్ ప్రారంభించింది. వీడియో కాస్తా వైరల్ అవ్వటంతో భారీగా విరాళాలు వచ్చాయి. అసలు లక్ష్యం 60,000 డాలర్లు (రూ. 51 లక్షలు) మాత్రమే అయినా, నాలుగు రోజుల్లోనే దాన్ని మించి 176,000 డాలర్ల (రూ. 1.5 కోట్లు) వరకు విరాళాలు వచ్చాయి. ఇది చూసి బర్గర్ కింగ్ ఫౌండేషన్ కూడా మైకేల్‌కి 10,000 డాలర్ల స్కాలర్‌షిప్‌ను అందించింది.

ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. తన వీడియో వైరల్ అయిందనే విషయం కూడా మైకేల్‌కు తెలియదు. మరియా మళ్లీ బర్గర్ కింగ్‌కి వెళ్లి, ఈ మొత్తం ఫండ్‌ గురించి తెలియజేయగా, అతను ఆశ్చర్యంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అలాగే, ఆర్థిక ఇబ్బందుల కారణంగా గ్యాప్ ఇయర్ తీసుకోవాలని భావించిన మైకేల్, ఇప్పుడు ట్రేడ్ స్కూల్‌లో మెకానికల్ స్టడీస్ చేయాలని ఆశిస్తున్నాడు. ఈ సంఘటన మైకేల్‌కి మాత్రమే కాకుండా, సమాజం కూడా కష్టపడే యువతను ఎలా ఆదరిస్తుందో చూపిస్తుంది.

Next Story