కేంద్రమంత్రి జేపీ నడ్డాతో సీజేపీ నేతల భేటీ.. 10 నిమిషాల పాటు చర్చ

by Gantepaka Srikanth |

నీట్-యూజీ (NEET-UG) ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం దేశరాజధాని ఢిల్లీలో తీవ్ర కలకలం రేపుతోంది.

కేంద్రమంత్రి జేపీ నడ్డాతో సీజేపీ నేతల భేటీ.. 10 నిమిషాల పాటు చర్చ
X

దిశ, వెబ్‌డెస్క్: నీట్-యూజీ (NEET-UG) ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం దేశరాజధాని ఢిల్లీలో తీవ్ర కలకలం రేపుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) చేపట్టిన పార్లమెంట్ ముట్టడి ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఆందోళనకారులతో చర్చలు జరిపింది.

కేంద్రమంత్రి నడ్డాతో 10 నిమిషాల భేటీ..

ఢిల్లీలోని సెంట్రల్ ప్రాంతంలో నిరసనలు ఉధృతమవ్వడంతో సీజేపీ ప్రతినిధులు సౌరభ్ దాస్, అశుతోష్ రాంకాలు కేంద్రమంత్రి జేపీ నడ్డాతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. సుమారు 10 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి సమర్పించారు. ఈ భేటీ అనంతరం సీజేపీ ప్రతినిధి సౌరభ్ దాస్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు మా డిమాండ్లను రాతపూర్వకంగా అందించాం. ఈ అంశంపై ప్రభుత్వం అంతర్గతంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆయన మాకు హామీ ఇచ్చారు’’ అని పేర్కొన్నారు.

అంతకుముందు, హై-సెక్యూరిటీ జోన్ అయిన సెంట్రల్ ఢిల్లీకి వందలాది మంది నిరసనకారులు చేరుకుని పార్లమెంట్ భవనం వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. ఢిల్లీలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు కంటిన్యూస్ అడ్డుకుని, గుంపును చెదరగొట్టేందుకు తీవ్రంగా యత్నించారు. ఈ ఆందోళనల్లో సమాజ్ వాది పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ కూడా పాల్గొనగా, ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎస్పీ వర్గాలు ఆరోపించాయి. ప్రస్తుతం ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Next Story