పోచంపల్లి ఇక్కత్‌కు దేశవ్యాప్త గుర్తింపు

by Ratna Kumari |

పోచంపల్లి అంటేనే పట్టు చీరలు, ఇక్కత్ కళ గుర్తుకు వస్తుందని, పోచంపల్లి ఇక్కత్‌కు దేశవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు లభించిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.

పోచంపల్లి ఇక్కత్‌కు దేశవ్యాప్త గుర్తింపు
X

దిశ, భూదాన్ పోచంపల్లి : పోచంపల్లి అంటేనే పట్టు చీరలు, ఇక్కత్ కళ గుర్తుకు వస్తుందని, పోచంపల్లి ఇక్కత్‌కు దేశవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు లభించిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన పోచంపల్లి చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన భారత లవ కుమార్‌తో పాటు పాలకవర్గ సభ్యులను శాలువాలతో సన్మానించి అభినందించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోచంపల్లి చేనేత కళాకారుల నైపుణ్యం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిందన్నారు. రెండున్నరేళ్ల క్రితం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోచంపల్లి ఇక్కత్‌ను ప్రత్యేకంగా అభినందించారని, ఇక్కడి కళాకారుల ప్రతిభ దేశానికి గర్వకారణమని ప్రశంసించారని గుర్తు చేశారు. అలాగే ఇటీవల జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలతో నిర్వహించిన ఫ్యాషన్ షో రాష్ట్రానికే గర్వకారణమని పేర్కొన్నారు. పోచంపల్లి చేనేత ఉత్పత్తులకు దేశ, విదేశీ మార్కెట్లలో మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. హైదరాబాద్‌లో ప్రతి ఏడాది ప్రత్యేక చేనేత ఎగ్జిబిషన్ నిర్వహించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇటీవల హైటెక్ సిటీలో నిర్వహించిన "థ్రెడ్ పోచంపల్లి" ప్రదర్శనలో సుమారు రూ.10 కోట్ల విలువైన చేనేత వస్త్రాలు విక్రయించబడటం పోచంపల్లి ఇక్కత్‌కు ఉన్న ఆదరణకు నిదర్శనమని అన్నారు.

చేనేత సహకార సంఘాలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని, వాటి అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని స్పష్టం చేశారు. నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రుణమాఫీతో పాటు థ్రిఫ్ట్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రైతులు, నేతన్నలకు రుణమాఫీ అమలు చేసిందని గుర్తు చేశారు.

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి..

విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో కల్పనా ఫౌండేషన్, త్రివేణి సాహితీ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 32 మంది విద్యార్థులకు వెండి, కాంస్య పతకాలను అందజేసి అభినందించారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివితే ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని ఆయన సూచించారు. ప్రతిభను ప్రోత్సహిస్తూ విద్యార్థులను సన్మానించడం అభినందనీయమని నిర్వాహకులను ప్రశంసించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ కొయ్యడ రజిని శ్రీనివాస్ గౌడ్, చేనేత జౌళి శాఖ ఏడీ శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గోజ్జ సత్యం, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం అంజయ్య, గజం గోవర్ధన్, కల్పనా ఫౌండేషన్ నిర్వాహకులు, చేనేత సహకార సంఘం ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Next Story