రూ.1.8 కోట్ల లగ్జరీయస్ కారును ట్యాక్సీగా మార్చిన యువకుడు.. ఒక్క ట్రిప్పుకు ఎంతంటే?

by Yella Dhawani Reddy |

మనలో చాలా మంది లగ్జరీ కార్లలో (Luxury cars) తిరగాలని, వాటి అత్యాధునిక సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అనుభవించాలని ఆశపడుతుంటారు.

రూ.1.8 కోట్ల లగ్జరీయస్ కారును ట్యాక్సీగా మార్చిన యువకుడు.. ఒక్క ట్రిప్పుకు ఎంతంటే?
X

దిశ, వెబ్ డెస్క్: మనలో చాలా మంది లగ్జరీ కార్లలో (Luxury cars) తిరగాలని, వాటి అత్యాధునిక సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అనుభవించాలని ఆశపడుతుంటారు. కానీ, కోట్లు ఖర్చు పెట్టి వాటిని కొనే స్థోమత లేక నిరాశపడుతుంటారు. కానీ, చైనాకు (China) చెందిన ఓ వ్యక్తి రూ.1.8 కోట్లు విలువైన విలాసవంతమైన కారును ఏకంగా ట్యాక్సీగా మార్చేశాడు. సాధారణంగా రోడ్డుపై ఇలాంటి కార్లను చూస్తే ఒక్కసారి ఆగి ఆసక్తిగా చూసే ప్రజలు.. దాన్ని ట్యాక్సీగా వాడడాన్ని చూసి ఇంకా ఎక్కువగా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. మరీ వైరల్ వార్త పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఉత్తర చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన యువాన్ అనే 30 ఏళ్ల వ్యక్తి సుమారు రూ.1.8 కోట్లు (210,000 డాలర్లు) వెచ్చించి గత ఏడాది నవంబరులో మెర్సిడెస్ మేబాక్ (Mercedes Maybach) కారును కొనుగోలు చేశాడు. దానిని రైడ్-హైలింగ్ ట్యాక్సీగా మార్చి బీజింగ్‌, షాంగైలలో ట్యాక్సీ సేవలు అందిస్తున్నాడు. అంతేకాదు, తన సర్వీసు గురించి తెలియజేసేందుకు 'ఓల్డ్ యువాన్ డ్రైవ్స్ ఎ మేబాక్ ఫర్ రైడ్-హెయిలింగ్ (Old Yuan Drives a Maybach for Ride-Hailing)' అనే సోషల్ మీడియా ఖాతాను కూడా ప్రారంభించాడు. ఒక్కో ట్రిప్పు ద్వారా దాదాపు రూ. 46,000 (550 డాలర్లు) వరకు సంపాదిస్తున్నట్లు ఇందులో తెలిపాడు. అయితే, ఈ సేవలు కాస్త ఖరీదైనవే అయినప్పటికీ లగ్జరీ కారులో ప్రయాణించాలనే కోరిక తీర్చుకునే అవకాశం కలుగుతుందని యువాన్ చెబుతున్నాడు.

ఇక ఈ ట్యాక్సీయే తన జీవనాధారం అని యువాన్ చెబుతున్నాడు. నెలకు సగటున 40 ఆర్డర్లు పూర్తి చేస్తూ.. నెలవారీ ఖర్చులు పోగా దాదాపు 10,000 యువాన్లు (సుమారు రూ. 1.1 లక్షలు) ఆదాయం సంపాదిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ కారును కూడా ఆరు సంవత్సరాలుగా సేవ్ చేసిన డబ్బులతో కొనుగోలు చేసినట్లు చెప్పాడు. రూ. 79.7 లక్షల డౌన్ పేమెంట్ కట్టడగా.. మిగతా మొత్తం కోసం ఐదేళ్ల లోన్ తీసుకున్నట్టు, ప్రతి నెలా రూ.1.7 లక్షలు EMIగా చెల్లిస్తున్నట్టు వెల్లడించారు.

Next Story