- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీస్ స్టేషన్‌గా మారిన హిట్లర్ పుట్టిన ఇల్లు.. నియో-నాజీల రాకను అడ్డుకునేందుకే ఆస్ట్రియా నిర్ణయం
నియంత అడాల్ఫ్ హిట్లర్ జన్మించిన భవనం రూపురేఖలు మారిపోయాయి. ఇకపై పోలీస్ స్టేషన్‌గా ఈ భవనం సేవలు అందించనుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: నియంత అడాల్ఫ్ హిట్లర్ (Adolf Hitler) జన్మించిన భవనం రూపురేఖలు మారిపోయాయి. జర్మనీ-ఆస్ట్రియా సరిహద్దులోని బ్రౌనౌ ఆమ్ ఇన్ (Braunau am Inn) పట్టణంలో ఉన్న ఈ చారిత్రక భవనం ఇకపై పోలీస్ స్టేషన్‌గా సేవలు అందించనుంది. ఈ భవనం నియో-నాజీలకు (హిట్లర్ మద్దతుదారులకు) పవిత్ర యాత్రా స్థలంగా మారకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఆస్ట్రియా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ ఆధీనంలోకి..
అంతర్జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. గతంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న ఈ పెద్ద భవనంలో కొంతకాలం వికలాంగుల కోసం ఒక స్వచ్ఛంద సంస్థ నడిచింది. సుదీర్ఘ చర్చల అనంతరం 2017లో ఆస్ట్రియా ప్రభుత్వం దీనిని కొనుగోలు చేసి, 2019లో పోలీస్ స్టేషన్‌గా మారుస్తున్నట్లు ప్రకటించింది. 1889లో హిట్లర్ పుట్టిన తర్వాత కొన్ని వారాలు మాత్రమే అతని కుటుంబం ఇక్కడ నివసించింది. నాజీల కాలంలో దీనిని ఆర్ట్ మ్యూజియంగా మార్చారు. ఇప్పుడు ఈ భవనానికి ఉన్న ఆ ‘నాజీ’ గుర్తింపును పూర్తిగా తుడిచిపెట్టేయాలన్నదే తమ లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.
‘పోలీస్’ బోర్డు మాత్రమే..
ప్రస్తుతం ఈ భవనానికి తెల్లటి రంగు వేసి కేవలం ‘పోలీస్’ అనే బోర్డును మాత్రమే ఏర్పాటు చేశారు. భవనం ముందు మౌతౌసెన్ కాన్సంట్రేషన్ క్యాంపు నుంచి తెచ్చిన ఒక రాయిపై ‘ఫాసిజం మళ్లీ వద్దు’ (Never again fascism) అని రాసి ఉంటుంది. అక్కడ హిట్లర్ పేరు ఎక్కడా కనిపించదు.
ప్రజల స్పందన, అభ్యంతరాలు
ఈ మార్పును స్థానిక ప్రజలు, మేయర్ స్వాగతిస్తున్నారు. నియో-నాజీల అవాంఛిత సందర్శనలకు దీంతో చెక్ పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ ప్రాజెక్టుపై కొన్ని వ్యతిరేకతలు కూడా ఉన్నాయి. ఆస్ట్రియాకు చెందిన ప్రధాన హాలోకాస్ట్ బాధితుల సంఘం (మౌతౌసెన్ కమిటీ) ఈ నిర్ణయాన్ని తప్పుబట్టింది. హిట్లర్ జన్మస్థలాన్ని పోలీస్ స్టేషన్‌గా మార్చడం ద్వారా అతని నేరాలను, చరిత్రను త్వరగా మర్చిపోవాలని ప్రభుత్వం చూస్తోందని వారు విమర్శించారు. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన హంతకుడు పుట్టిన స్థలాన్ని ప్రపంచం ఎప్పటికీ మర్చిపోకూడదని వారు వాదిస్తున్నారు.






