విద్యార్ధులపై పోలీసుల దాడి! ఎల్లుండి తెలంగాణలో విద్యాసంస్థల బంద్

by Ramesh Naini |   (  Updated:2026-07-22 11:38:01  IST  )

దేశవ్యాప్తంగా కలకలం రేపిన ‘నీట్’ పరీక్షల పేపర్ లీకేజీలు, అవకతవకలపై విద్యార్థి లోకం కన్నెర్రజేసింది.

విద్యార్ధులపై పోలీసుల దాడి! ఎల్లుండి తెలంగాణలో విద్యాసంస్థల బంద్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా కలకలం రేపిన ‘నీట్’ (NEET) పరీక్షల పేపర్ లీకేజీలు, అవకతవకలపై విద్యార్థి లోకం కన్నెర్రజేసింది. వరుస వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. జూలై 24వ తేదీన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల ఐక్యవేదిక (SFI, AISF, NSUI, PDSU, AIFDS, AISB, AIPSU) పిలుపునిచ్చింది. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు బంద్ వివరాలను వెల్లడించారు. దేశ విద్యా వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని వారు మండిపడ్డారు.

విద్యార్థి సంఘాల ప్రధాన డిమాండ్లు..

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. పరీక్షల నిర్వహణలో విఫలమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని రద్దు చేయాలి. విద్యా వ్యవస్థ స్వయంప్రతిపత్తికి భంగం కలిగించే VBSA బిల్లును వెనక్కి తీసుకోవాలి. ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై జరిగిన పోలీసు దాడులపై పారదర్శక విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ నెల 24న జరిగే బంద్‌కు విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్యాలు, తల్లిదండ్రులు, మేధావులు సంపూర్ణ మద్దతు తెలిపి విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు టి.నాగరాజు (SFI), కె.మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ (AISF), వెంకట్ స్వామి (NSUI), పల్లె మురళి (AIFDS), అశోక్ రెడ్డి, అనిల్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Next Story