- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ రంగానికి రూ.56 కోట్ల అభివృద్ధి వరాలు
రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను విస్తరిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను విస్తరిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హనుమకొండలో రూ.56 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు విద్యుత్ అభివృద్ధి పనులకు బుధవారం ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్.నాగరాజు, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యతో కలిసి నక్కలగుట్టలోని టీజీఎన్‌పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం విద్యుత్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాజ్‌పేయి కాలనీ, ఆర్ అండ్ బీ క్వార్టర్స్, విద్యుత్ నగర్, వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ ప్రాంతాల్లో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలు, హనుమకొండ నూతన సర్కిల్ కార్యాలయ భవనం, టీజీఎన్‌పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఐదో అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ ఉపకేంద్రాన్ని, కార్పొరేట్ కార్యాలయంలో అత్యాధునిక సమావేశ మందిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణను విద్యుత్ రంగంలో దేశానికి ఆదర్శరాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందన్నారు. విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థలను ఆధునికీకరిస్తూ ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. పరిశ్రమలు, వాణిజ్య రంగం, గృహ వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అనంతరం టీజీఎన్‌పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి విద్యుత్ సరఫరా, సబ్‌స్టేషన్ల నిర్మాణం, మౌలిక వసతుల విస్తరణ, వినియోగదారుల సేవల మెరుగుదల పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడంతో పాటు విద్యుత్ రంగాన్ని మరింత ఆధునికీకరించే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న, జిల్లా అటవీ అధికారి నిఖిల, టీజీఎన్‌పీడీసీఎల్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






