సీఈఐఆర్‌తో.. ఫోన్ల రికవరీ..

by Taduka Kalyani |

ఆదిలాబాద్ జిల్లాలో పోగొట్టుకున్న,చోరీకి గురైన 105 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు బుధవారం అందజేశారు.

సీఈఐఆర్‌తో.. ఫోన్ల రికవరీ..
X

దిశ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో పోగొట్టుకున్న,చోరీకి గురైన 105 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు బుధవారం అందజేశారు. దాదాపు రూ.12.5 లక్షల విలువ చేసే ఈ మొబైల్ ఫోన్లను ప్రత్యేక రికవరీ బృందం వివిధ రాష్ట్రాలు,జిల్లాల నుంచి గుర్తించి స్వాధీనం చేసుకుంది. స్థానిక పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ బాధితులకు మొబైల్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా మొబైల్ ఫోన్ రికవరీ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయగా, గత ఏడాది కాలంలో ఇప్పటికే 1,600 మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందజేసినట్లు తెలిపారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, రైతు బజార్, రిమ్స్, మార్కెట్ ప్రాంతాల్లో మొబైల్ చోరీలు ఎక్కువగా జరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే ముందు యజమాని వివరాలు, సంబంధిత పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని, దొంగ మొబైల్ ఫోన్ల కొనుగోలు లేదా విక్రయాల్లో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు తిరిగి అందుకోవడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ జిల్లా పోలీసులకు, ఎస్పీ అఖిల్ మహాజన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.మౌనిక,డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి,ప్రత్యేక రికవరీ బృందం సభ్యులు ఆర్ఎస్ఐ పి.గోపీకృష్ణ, మజీద్, అన్వేష్, నవనీత్, జుబేర్, ఇజాజ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story