ప్రయాణికుల కోసం మినీ లైబ్రరీ.. మైసూర్ ఆటో డ్రైవర్ వినూత్న ప్రయత్నం

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-25 08:41:13  IST  )

కర్ణాటకకు చెందిన ఒక ఆటో డ్రైవర్ తన వాహనాన్ని ఏకంగా మినీ లైబ్రరీగా మార్చాడు.

ప్రయాణికుల కోసం మినీ లైబ్రరీ.. మైసూర్ ఆటో డ్రైవర్ వినూత్న ప్రయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఆటో (Auto) ప్రయాణం అంటే ట్రాఫిక్ గొడవలు, చికాకులు గుర్తుకు వస్తాయి. కానీ, కర్ణాటకలోని మైసూరు (Mysore)కు చెందిన ఓ ఆటో డ్రైవర్ తన ప్రయాణికులకు ఒక మధురమైన అనుభూతిని అందిస్తున్నారు. తన ఆటోను ఒక చిన్నపాటి గ్రంథాలయం (Library)గా మార్చి, ప్రయాణికులు తమ ప్రయాణ సమయంలో పుస్తకాలు చదువుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆటో డ్రైవర్ తన సీటు వెనుక భాగంలో ఒక ప్రత్యేకమైన రాక్‌ను ఏర్పాటు చేసి, అందులో వివిధ రకాల పుస్తకాలను అమర్చారు. ప్రయాణికులు తమ ప్రయాణ సమయంలో వీటిని ఉచితంగా చదువుకోవచ్చు.

చిన్నపాటి కానుకలు..

కేవలం పుస్తకాలే కాకుండా, చదువుతున్న పేజీ గుర్తుండటానికి చేతితో తయారు చేసిన అందమైన ‘బుక్‌మార్క్‌లు’ (Bookmarks), ప్రయాణికుల కోసం చాక్లెట్లను కూడా అందుబాటులో ఉంచాడు. అయితే, ‘వర్ష’ అనే ప్రయాణికురాలు ఈ ఆటోలో ప్రయాణించినప్పుడు తీసిన వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లో వైరల్‌గా మారింది. ‘ఇది నేను చూసిన అత్యంత అందమైన, ఆహ్లాదకరమైన ప్రయాణం’ అంటూ ఆమె ప్రశంసలు కురిపించారు. మరోవైపు ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆటో డ్రైవర్ ఆలోచనను కొనియాడుతున్నారు. ‘ఈ ఆటో కేవలం ఇంధనంతో కాదు, విజ్ఞానంతో నడుస్తోంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మైసూరులోని ఓ ఆసుపత్రి సమీపంలో తిరిగే ఈ ఆటో, ప్రస్తుతం నగరం మొత్తానికి ఓ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది.

Next Story