విమానంలో చిన్నారి ఏడుపు.. నెట్టింట్లో వైరల్ అయిన ప్రయాణికుడి ఫిర్యాదు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-20 15:30:09  IST  )

సాధారణంగా చిన్నపిల్లలు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరు ఊహించలేరు.

విమానంలో చిన్నారి ఏడుపు.. నెట్టింట్లో వైరల్ అయిన ప్రయాణికుడి ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా చిన్నపిల్లలు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరు ఊహించలేరు.ఒక్క క్షణం మనసుని గెలిపించేలా నవ్విస్తారు, వెంటనే మరో క్షణంలోనే ఏడుపు మొదలుపెడతారు. ఆకలి, ఒత్తిడి, వేడి, అసౌకర్యం... ఏ చిన్న సమస్యకైనా వాళ్లు ఏడుపుతోనే స్పందిస్తారు. ఇక ఇలాంటి చిన్నారులతో ప్రయాణం అంటే తల్లిదండ్రులకు ఒక కొత్త సవాల్ అనే చెప్పాలి. విమానం, బస్సు, రైలు.. ఏదైనా తీసుకున్నా, కొత్త వాతావరణం, తెలియని వ్యక్తుల మధ్య ఉండటం, లాంగ్ జర్నీ వంటివన్నీ పిల్లలకు అసహనాన్ని కలిగించవచ్చు. ఇలాంటి సమయాల్లో తల్లిదండ్రులు పిల్లల ఏడుపు మానిపించేందుకు ఎంతగా శ్రమించినా, కొన్నిసార్లు అది ఫలించకపోవచ్చు. తాజాగా అమెరికాలో చోటుచేసుకున్న ఇలాంటి ఓ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.

ప్యాట్ మాకాలిఫ్ అనే ప్రయాణికుడు డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ చిన్నారి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది. విమానం ఆలస్యంగా ఉంది, పైగా ఎయిర్ కండిషనింగ్ పనిచేయకపోవడం వల్ల, పరిస్థితి ఇంకా అసహనంగా మారింది. ఈ నేపథ్యంలో మాకాలిఫ్ తన అసహనాన్ని ఓ వీడియో రూపంలో బయటపెట్టాడు. వీడియోలో 'ఆ తల్లిదండ్రులను చూస్తుంటే జాలేస్తుంది. వారు ఏదైనా కొత్తగా ప్రయత్నించాలి' అంటూ తన అసహనాన్ని ప్రదర్శిస్తూ తల్లిదండ్రులపై ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది.

ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. చాలామంది తల్లిదండ్రులు, సామాన్యులు మాకాలిఫ్ తీరును తప్పుబట్టారు. 'బిడ్డ కన్నా నీవే ఎక్కువగా ఏడుస్తున్నావు' అంటూ కొంతమంది ఘాటుగా స్పందించగా, 'ఆ తల్లిదండ్రులు నీకన్నా ఎక్కువ ఒత్తిడిలో ఉన్నారు. పెద్దవాడివి అయ్యి కాస్త మనుసు పెట్టుకో' అంటూ మరికొందరు చురకలంటించారు. అయితే, కొంతమంది మాత్రం మాకాలిఫ్ వ్యాఖ్యలకు మద్దతుగా, తల్లిదండ్రుల తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటమే ఈ పరిస్థితికి కారణమని అభిప్రాయపడ్డారు.

Next Story