సోషల్ మీడియాలో సరికొత్త పోరు: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ Vs ‘హిట్ జనతా పార్టీ’!

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-22 06:14:11  IST  )

నెట్టింట వైరల్ అవుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP)కి కౌంటర్‌గా ‘హిట్ జనతా పార్టీ’ తెరపైకి వచ్చింది.

సోషల్ మీడియాలో సరికొత్త పోరు: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ Vs ‘హిట్ జనతా పార్టీ’!
X

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగ యువతను ఉద్దేశించి ఇటీవల సుప్రీంకోర్టు (Supreme Court) చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) మిలియన్ల కొద్దీ ఫాలోవర్లతో ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తోంది. అయితే, ఇప్పుడు ఆ ‘కాక్రోచ్’ పార్టీని అణిచివేసేందుకు నెటిజన్లు ‘హిట్ జనతా పార్టీ’ పేరుతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపైకి మరో సరికొత్త అస్త్రాన్ని తెచ్చారు. బొద్దింకలను చంపే ప్రసిద్ధ బ్రాండ్ ‘హిట్’ (HIT) స్ప్రేని ఆధారంగా చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఈ పోస్టర్‌లో హిట్ స్ప్రే బాటిల్ నుంచి వస్తున్న కెమికల్ దాటికి ఒక బొద్దింక గిలగిలా కొట్టుకుని చచ్చి పడిపోయినట్లుగా చూపించారు. దానికి ‘హిట్ జనతా పార్టీ’ అని పేరు పెట్టి, కింద త్రివర్ణ పతాక రంగుల సర్కిల్‌లో ‘స్వచ్ఛ్ ఘర్, సురక్షిత భారత్’ అనే నినాదాన్ని సైతం జోడించారు.

అసలు ఏంటీ ‘జనతా పార్టీల’ గోల..

ఇటీవల సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా నిరుద్యోగ యువతపై చీఫ్ జస్టిస్ చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట తీవ్ర దుమారం రేపాయి. యువతను ‘బొద్దింకలు’, ‘పరాన్నజీవులు’ అని సంబోధించడాన్ని నిరసిస్తూ.. అభిజీత్ డిప్కే అనే యువకుడు సరదాగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అనే డిజిటల్ ప్యారడీ పార్టీని స్థాపించాడు. చూస్తుండగానే దీనికి ఇన్‌స్టాగ్రామ్‌లో అధికార పార్టీ కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు వచ్చారు. ప్రతిపక్ష నేతలు కూడా ఈ ట్రెండ్‌లో భాగమయ్యారు. అయితే, ఈ ‘కాక్రోచ్’ హవాకు చెక్ పెట్టడానికి, అలాగే ఈ మీమ్స్ ట్రెండ్‌ను మరింత హాస్యాస్పదంగా మార్చడానికి నెటిజన్లు ఇప్పుడు ఈ ‘హిట్ జనతా పార్టీ’ని రంగంలోకి దించారు. అది చూసిన నెటిజన్లు ‘బొద్దింకల పార్టీని తుడిచిపెట్టేందుకే ఈ హిట్ పార్టీ వచ్చింది’ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Next Story