ట్రెండింగ్.. ప్రీ వెడ్డింగ్ షూట్స్

114

దిశ, శేరిలింగంపల్లి: ప్రీ వెడ్డింగ్ షూట్ ఇప్పుడు ట్రెండీగా మారింది. పెళ్లికి ముందు కాబోయే నవదంపతులు అపురూపంగా ఫొటోలు తీసుకొని సంబురపడిపోతున్నారు. దీని కోసం స్థానికంగా ఉండే సరస్సులు, నదులు, డ్యాములు, పచ్చదనం ఎక్కువగా ఉండే అడవి లాంటి ప్రాంతాల్లోకి వెళ్లి నచ్చిన తీరులో వీడియోలు చిత్రీకరించుకుంటున్నారు. సీటి, పల్లె అనే తేడా లేకుండా వెడ్డింగ్ కు ముందు ఫొటో, వీడియో షూట్ పై ఉత్సాహం చూపిస్తున్నారు.

అందమైన లొకేషన్స్, అంతకుమించిన మిక్సింగ్, టైమ్లీ సాంగ్స్ తో పాటలు జోడిస్తూ వావ్ అనేలా ఏవీలు రెడీ చేసుకుంటున్నారు. వీడియోలు, ఫొటోల రూపంలో జ్ఞాపకాలను పదిల పర్చుకుంటున్నారు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ లో ఒక జంటను మించి మరో జంట తమ వీడియోలు అద్భుతంగా తీయించుకోవడానికి పోటీ పడుతున్నారు. వేలు, లక్షల రూపాయల్లో ఖర్చు పెట్టేందుకు కూడా వెనకడడం లేదు. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ తో ఫొటోగ్రాఫర్లకు మంచి గిరాకీ వస్తున్నది.

కాబోయే కపుల్స్ పెళ్లినాటి మధుర స్మృతులను కలకాలం గుర్తుంచుకునేందుకు, జ్ఞాపకాలను పదికాలాల పాటు పదిలంగా దాచుకునేందుకు వెడ్డింగ్ లో ఫొటోలు దిగుతుంటారు. కానీ ఇప్పుడు పెళ్లిళ్లలోనే కాదు అంతకుముందే ఫొటోలు, వీడియోలు చిత్రీకరించుకోవడం ట్రెండ్ గా మారింది. యువజంట తమ ప్రేమని పెళ్లికి ముందే ఫొటోల్లో పదిలంగా దాచుకునే ఈ కొత్త పోకడ ఫ్యాషన్ గా మారింది. ఈ తరహా ఫొటో షూట్ లు ఇది వరకు మెట్రోపాలిటన్ సిటీలకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు సిటీలు దాటి మామూలు పల్లెలకు సైతం పాకింది.

ఒకప్పుడు సెలబ్రిటీ జంటలే ఇలా ఫొటోలకు ఫోజులిచ్చి మురిసిపోయేవి. ఇప్పుడు ధనిక, పేద హద్దులు ల్లేవు. బడ్జెట్ ను బట్టి ఫొటోగ్రాఫర్లు వెంట వచ్చి మరీ, కాబోయే వధూవరులకు నచ్చినట్టుగా ఫొటోలు తీస్తున్నారు. అయితే పెళ్లికి ముందు తీసుకునే ఈతరహా ఫొటోలు ప్రత్యేకంగా ఉండాలి. ఆ ఫొటోల్లోనే వారి ప్రేమ, ఒకరంటే ఒకరికి ఉండే అనురాగం తెలిసిపోవాలి. అలాంటి రొమాంటిక్ టచ్ ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్లు కూడా రెఢీగా ఉంటున్నారు. కొందరైతే వాళ్లే ఓ కెమెరా తీసుకుని ఫ్రెండ్స్ తో ఫొటోలు తీయించుకుంటున్నారు. ఫ్రీ వెడ్డింగ్ షూట్ అనేది ఇప్పుడు చాలా కామన్ గా మారిపోయింది. అలాంటి ఫొటోలు పర్సనల్ ఆల్బమ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

ప్రీ వెడ్డింగ్ షూట్స్.. అదిరిపోయే ఫొటోస్..

ప్రీ వెడ్డింగ్ షూట్స్ కు ఇప్పుడు ఫుల్ క్రేజ్ ఉంది. నగరంలో కుర్రకారుకు ఇదో ఫ్యాషన్ గా మారింది. పెళ్లి చేసుకునే ముందు బ్యాచిలర్ పార్టీలు ఎంత కామన్ గా ఉంటాయో.. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా అంతేకామన్ గా మారాయి. సెల్ ఫోన్ లోనే హైఫై కెమెరాలు రావడం, డిజిటల్ కెమెరాలు తక్కువ ధరలో అందుబాటులో ఉండడంతో చాలా వరకూ సొంత కెమెరాలతోనే నచ్చిన ప్రదేశంలో ఫొటో షూట్స్ కానిచ్చేస్తున్నారు. నగరంలో ఫేమస్ ప్లేస్ లు, అందమైన లోకేషన్లతో పాటు నగరం నుంచి వంద కిలోమీటర్ల లోపల ఉన్న ఔట్ డోర్ షూటింగ్స్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు వెళ్లి ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తున్నారు. పెళ్లికి ముందే కాబోయే వధూవరుల విషయంలో ఫొటో షూట్స్ కు ఇరు కుటుంబాల నుంచి ఆంక్షలు కూడా పెద్దగా లేకపోవడంతో యూత్ మరింత ఉత్సాహంగా ఫొటో షూట్స్ చేయించుకుంటున్నట్లు ఫొటో గ్రాఫర్స్ చెబుతున్నారు.

షూట్‎ను బట్టి రేట్స్..

ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే ఏదో నాలుగు ఫొటోలు దిగామా.. వాటిని పెళ్లినాడు ఫ్లెక్సీలుగా ఏర్పాటు చేశామా అని కాకుండా కలకాలం గుర్తుండిపోయేలా.. నలుగురు వావ్ అనేలా ఫొటోలు, వీడియోలు చిత్రీకరించుకుంటున్నారు. వాటిని ఎప్పుడు చూసుకున్నా వారి ప్రేమ మదిలో మెదిలేలా.. మనస్సు హత్తుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందుకోసం లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి వెనకడాడం లేదు. హైదరాబాద్ లోని రఘు స్టిల్స్ స్టూడియో ఓనర్ నెలలో 12 నుంచి 15 ఆపైనే ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తూ బిజీగా ఉంటున్నారు.

కాబోయే కపుల్స్ కు నచ్చేలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ప్లాన్ చేస్తున్నారు. వారు నచ్చిన లొకేషన్స్ లోనే కాకుండా ఫొటో గ్రాఫర్స్ కూడా బ్యూటీఫుల్ లొకేషన్స్ ఎక్కడ ఉంటాయి అనేదానిపై అవగాహన కల్పిస్తూ అందమైన ఫొటోలు తీస్తున్నారు. కొందరు ఫొటో గ్రాఫర్లు అయితే మరీ క్రియేటివిటీగా ఆలోచిస్తూ కస్టమర్ల బడ్జెట్ లోనే అందమైన ప్రీ వెడ్డింగ్ ఫొటోలు తీస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. కపుల్స్ కోరిన చోటకు వెళ్లి ఫొటో షూట్స్ చేసే వాళ్లు ఉన్నారు. వైజాగ్, అరకు, గోదావరి జిల్లాలు, తెలంగాణ గ్రామాలు, అందమైన లొకేషన్స్ ఇలా చాలా చోట్లకు వెళ్లి షూట్స్ చేస్తున్నామని చెబుతున్నారు. ఇదో వేడుకల సాగుతుందని, దాదాపు సినిమా షూటింగ్ ను తలపిస్తుందని చెబుతున్నారు. ఒక్కో షూట్ కు రెండు నుంచి వారం రోజుల టైమ్ తీసుకుని చేస్తున్న సందర్భాలు సైతం ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.

స్పెషల్ ఎఫెక్ట్స్..

లెటెస్ట్ కెమెరాలు, స్మార్ట్ సెల్ ఫోన్స్ వచ్చాక ఫొటోలకు స్పెషల్ ఎఫెక్ట్స్ అద్దుతున్నారు. సెల్ ఫోన్లు వచ్చాకా.. కొద్దిమొత్తంలో ఫొటో గ్రాఫర్లకు పని తగ్గినా.. ప్రీ వెడ్డింగ్ షూట్ వరంగా మారిందనే చెప్పాలి. అదీగాక చేసే పనిలో క్రియేటివిటీ ఉంటే ఉపాధి కరువు ఉండదంటున్నారు నేటి ఫొటో గ్రాఫర్స్. నూతనంగా వస్తున్న టెక్నాలజీని నేర్చుకుంటూ కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. కస్టమర్లకు నచ్చేలా ఫొటోలు తీస్తూ వావ్ అనిపించుకుంటున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..