ఈ రెండు సెగ్మెంట్లు టార్గెట్.. భారీగా బదిలీలు ​

93

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని రెండు నియోజకవర్గాలు గులాబీ బాస్‌కు టార్గెట్‌గా అయినట్లుగా మారింది. కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన ఈటల రాజేందర్ సెగ్మెంట్ హుజురాబాద్ ఒకటి కాగా.. ఇప్పుడు మంథని కూడా అదే కోవలోకి చేరినట్లవుతోంది. మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధు మంథని నియోజకవర్గంగా రాజకీయాల్లో ఉన్నారు. ప్రస్తుతం మంథని నుంచి కాంగ్రెస్​ఎమ్మెల్యే శ్రీధర్​బాబు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఆయన్ను టీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు ప్లాన్ వేశారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో అధికారులను టార్గెట్​చేస్తున్నారు. ఏండ్ల నుంచి బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల విషయంలో పట్టించుకోకుండా ఉన్నా సర్కార్.. ఇప్పుడు ఈ రెండు సెగ్మెంట్లలో మాత్రం అధికారులను సాగనంపుతున్నారు.

పాత వారు ఉండవద్దంటూ..!

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అధికారుల బదిలీలు చేస్తూనే ఉన్నారు. హుజురాబాద్​ఏసీపీ శ్రీనివాస్‌తో పాటుగా జమ్మికుంట రూరల్ సీఐ విద్యాసాగర్ రావు, జమ్మికుంట సీఐ రమేశ్, హుజురాబాద్ టౌన్ సీఐ సదన్ కుమార్‌ను కరీంనగర్ డీఐజీ ఆఫీసుకు అటాచ్ చేశారు. రెవెన్యూ శాఖలో హుజురాబాద్ ఆర్డీవో బెన్ షాలోమ్‌తో పాటుగా హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్, ఇల్లంతకుంట తాసీల్దార్లు, ఎంపీడీవోలను కూడా ఇప్పటికే బదిలీ చేసింది. ఇక వైద్య శాఖలో బదిలీలు చేయడమే మిగిలి ఉందని అక్కడి నేతలు చెప్పుకుంటున్నారు.
ఈటల వ్యవహారం నడుస్తుండగానే మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు అంశం తెరకెక్కింది.

ఈటలకు పుట్టా మధుకు లింక్ పెట్టినట్లు చర్చ. ఈటలతో మధుకు సన్నిహిత సంబంధాలున్నాయని, ఈ వ్యవహారం నుంచే మధు కూడా అజ్ఞాతంలోకి వెళ్లడం, హత్య కేసుతో ఇప్పుడు ముడిపెట్టి పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఈటల అంశంలో భాగమేనని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో మంథని సీఐ మహేందర్ రెడ్డిని వరంగల్ కమిషనరేట్‌కు, ముత్తారం, మంథని, రామగిరి ఎస్ఐలను బదిలీ చేశారు.
రాష్ట్రంలో ఎక్కడా లేకున్నా కేవలం ఈ రెండు నియోజకవర్గాలే టార్గెట్‌గా అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పదోన్నతులు, బదిలీలను పూర్తి చేశారు. ఉపాధ్యాయ బదిలీలు పెండింగ్​ఉన్నాయి. కానీ ఒక జిల్లాలో.. అందులోనూ రెండు నియోజకవర్గాల్లో మాత్రమే బదిలీ చేయడం కచ్చితంగా టార్గెట్​ అని అధికారులు కూడా అంటున్నారు.

ఎప్పటికైనా అందుకేనా..?

హుజురాబాద్‌లో ఉప ఎన్నికలు వస్తాయంటూ ప్రచారం జరుగుతోంది. అయితే అటు కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం మరో ఏడాది వరకూ ఎన్నికలు, ఉప ఎన్నికలు చేపట్టమని తేల్చింది. దీంతో హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్‌కు ఇప్పుడు పదవీగండం లేనట్టే. కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమ వర్గీయులకు అండగా ఉండే విధంగా అధికారులను బదిలీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈటల వర్గానికి కూడా కొత్త వర్గానికి సహకరించేలా అధికారులు ఉండాలంటూ ముందుగానే బదిలీపై వచ్చే అధికారులకు చెప్పి పంపిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాల్లోనే కాకుండా బదిలీల్లో కూడా ఈ రెండు సెగ్మెంట్లు చర్చల్లోకెక్కుతున్నాయి.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..