గజ్వేల్ గర్జనకు సిద్దమైన రేవంత్..

by  |
revanth reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : గజ్వేల్​లో లక్ష మందితో దళిత, గిరిజన దండోరా నిర్వహిస్తున్నామని, ఈ దండోరాతో కేసీఆర్​ గుండెల్లో దడ పుట్టిస్తామని టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి అన్నారు. ఏడున్నరేండ్ల కేసీఆర్​ పాలనలో దళితులు, గిరిజనులతో పాటు అన్ని వర్గాల ప్రజలు దగా పడ్డారన్నారు. ఈ నెల 17న కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్​లో దళిత, గిరిజన దండోరా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సభ సక్సెస్​లో భాగంగా సోమవారం గాంధీభవన్​లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్​లో జరిగే సభ ఆరంభం మాత్రమేనని, చట్టాలను, కేసీఆర్​ ఇచ్చిన హామీలను అమలు చేసి ఉంటే దళిత, గిరిజనులు లబ్ధిపొందేవారన్నారు. కేసీఆర్​ నిర్మించిన కొండపోచమ్మ, మల్లన్నసాగర్ జలాశయాల్లో దళిత, గిరిజనుల ఆకాంక్షలు జల సమాధి అయ్యాయని మండిపడ్డారు.

గజ్వెల్​లో సభ ఏర్పాటు చేస్తామని ప్రకటించామని, కేవంల పార్టీ తీసుకున్న నిర్ణయం కాదని.. ఇది కార్యకర్తల పిలుపు అని అన్నారు. గజ్వేల్​ వేదికగా దండోరా మోగించి, దండు కట్టి కేసీఆర్ గుండెల్లో దడ పుట్టిస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి బూత్ నుంచి తొమ్మిది మంది చొప్పున గజ్వేల్‌కు తరలిరావాలని, లక్ష మందితో గజ్వేల్‌లో దళిత దండోరా సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పార్టీలో చిచ్చు పెట్టాలని నక్కజిత్తుల కేసీఆర్ చూస్తున్నారని, కుర్చీని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ను చీల్చే కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. గజ్వేల్ కోటను కొల్లగొడితే తెలంగాణలో సోనియమ్మ రాజ్యం వస్తుందని, గజ్వేల్ నుంచే కేసీఆర్ పతనం మొదలుపెట్టాలన్నారు. గజ్వేల్‌లో దండుకట్టి కేసీఆర్ మీద దండయాత్ర ప్రారంభం కావాలన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. గజ్వేల్‌ సభలో నిర్వాసితుల ఫొటో ఎగ్జిబిషన్ పెడతామన్నారు. ఇందిరాగాంధీని గెలిపించిన గడ్డ మెదక్ అని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తే అన్ని వర్గాలు లబ్ధిపొందేవారని, ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్సీమెంట్​ అమలు చేస్తే దళిత, గిరిజనులకు ఎక్కువ లబ్ది జరిగేదన్నారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్​ 125 జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహం పెడతానని సీఎం ప్రకటించారని, కానీ ఇంతవరకు పెట్టకపోగా కాంగ్రెస సీనియర్​ నేత హనుమంతరావు పంజాగుట్టలో ఏర్పాటు చేస్తామన్న అంబెద్కర్ విగ్రహాన్ని జైల్లో పెట్టిన చరిత్ర కేసీఆర్​దేనన్నారు. వీహెచ్​ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నామని, అంబేద్కర్​ విగ్రహం ఏర్పాటు కోసం గజ్వేల్​ సభలో తీర్మానం చేస్తామని రేవంత్​రెడ్డి వెల్లడించారు.

స్వర్గీయ ఇందిరా గాంధీని మెదక్ ఎంపీగా గెలిపిస్తే దేశంలోనే అధిక పరిశ్రమలు వచ్చాయని, లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గజ్వేల్ చుట్టూ 32 మండలాలూ ఉన్నాయని, ప్రతి మండలానికి 3 వేల మంది రావాలని, రాష్ట్రంలోని 34, 707 బూత్​లు నుంచి ఈ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సభకు కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ఖర్గే వస్తారని ప్రకటించారు. గజ్వేల్​ సభను అడ్డుకునేందుకు, పార్టీ కార్యకర్తలు రాకుండా ఉండేందుకు కేసీఆర్​ కేసీఆర్ నక్కజిత్తుల రాజకీయం ఉంటుందని, ఆ మాటలు, మంత్రాలను ఎదుర్కొని పని చేయాలని, కేసీఆర్ బలవంతుడు కాదని, జిత్తులమారితనంతో వ్యవహరిస్తారని, వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని రేవంత్​రెడ్డి కోరారు.

కాంగ్రెస్​ పార్టీ ఎన్నికల నిర్వాహణ కమిటీ చైర్మన్​ దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ ఉమ్మడి మెదక్​ జిల్లా కాంగ్రెస్​ కంచుకోట అని, మల్లసాగర్​ రైతుల పక్షాన నిలబడింది కాంగ్రెస్​ పార్టీ అని అన్నారు. రైతుల తరుపున 130 కేసులు వేసి రైతుల పక్షాన అండగా నిలిచామన్నారు. గజ్వేల్​ సభను విఫలం చేయడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని, తట్టుకుని విజయవంతం చేయాలని రాజనర్సింహ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్​ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్​ మధుయాష్కీ మాట్లాడుతూ కేసీఆర్​ ఏడేండ్లుగా చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని కోరారు. నిరుద్యోగ సమస్యలపై కూడా ఉద్యమం చేయాల్సిన సమయం ఉందన్నారు.

ఎమ్మెల్యే శ్రీధర్​బాబు మాట్లాడుతూ కాంగ్రెస్​కు కార్యకర్తల బలం ఉందని, వచ్చేది కాంగ్రెస్​ ప్రభుత్వమేనన్నారు. కాగా కాంగ్రెస్​ పార్టీ నేత, కేంద్రమాజీ మంత్రి అస్కార్​ ఫెర్నండెజ్​ మృతికి సంతాపం తెలిపారు. ఈ సమావేశంలో వర్కింగ్​ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, మహేష్​ కుమార్​గౌడ్​, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్​, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, సీనియర్​ ఉపాధ్యక్షుడు మల్లు రవి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి తదితరులు హాజరయ్యారు.


Next Story

Most Viewed