ప్లాన్ చేంజ్ చేసిన రేవంత్.. వారితో చర్చలు షురూ!

by  |
Congress party, TPCC chief Revanth Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​ పార్టీని వీడిన నేతలకు బుజ్జగింపులు మొదలయ్యాయి. మొన్నటి వరకు పార్టీని వీడిన ఎమ్మెల్యేలపై కేసు వేద్దామని ప్రకటించిన టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి.. ముందుగా సంప్రదింపులు చేస్తున్నారు. మళ్లీ పార్టీలోకి రావాలంటూ సూచిస్తున్నారు. దీనికి తోడుగా కాంగ్రెస్​ నుంచి గెలిచి టీఆర్​ఎస్​లో చేరిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్​ను కాదంటూ వెళ్లిన సీనియర్​ నేతలకు గులాబీ పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడంతో కాంగ్రెస్​లో చేరేందుకు సైతం సిద్ధంగానే ఉంటున్నారు. ఇటీవల పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్​ను కలిసిన రేవంత్​రెడ్డి.. కాంగ్రెస్​లోకి రావాలని ఆహ్వానించారు. దీనిలో కూడా టీపీసీసీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే తనకు వ్యతిరేకంగా అసంతృప్తి నేతలు ఏఐసీసీకి ఫిర్యాదులు చేయడం, బహిరంగంగానే విమర్శలు చేస్తుండటంతో వారిని వదిలేసి పాతతరం సీనియర్లను కలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

మీరంతా రండి

కాంగ్రెస్​ నుంచి గెలిచి టీఆర్​ఎస్​లో 12 మంది చేరిన ఎమ్మెల్యేల అంశంపై రేవంత్​రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత హెచ్చరికలు జారీ చేశారు. వారందరూ రాజీనామా చేయాలన్నారు. దీనిపై న్యాయస్థానానికి వెళ్తామని ప్రకటించారు. అయితే ఏఐసీసీ నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయో, లేకుంటే పార్టీలోని సీనియర్ల సలహాలో కానీ వ్యూహం మార్చారు. ముందుగా వారందరితోనూ ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్​ నుంచి గెలిచి టీఆర్​ఎస్​లో చేరిన ఓ ఎమ్మెల్యే రేవంత్​రెడ్డితో రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఉత్తమ్‌కు సన్నిహితుడుగా పేరొందిన సదరు ఎమ్మెల్యే.. తాజా పరిణామాల నేపథ్యంలో రేవంత్​రెడ్డితో భేటీ అయినట్లు పార్టీ వర్గాల్లో చర్చ. టీఆర్​ఎస్​ పార్టీలో తగిన గుర్తింపు రాకపోవడం మాత్రమే కాకుండా ఇటీవల పార్టీ జిల్లా, మండల, గ్రామ కమిటీల్లో తాను చెప్పిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని టీఆర్​ఎస్​ సీనియర్లతో మొర పెట్టుకున్నారు. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ సెగ్మెంట్​ నుంచి గెలిచిన సదరు ఎమ్మెల్యే.. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్​ గూటికి చేరుతారనే సంకేతాలిస్తున్నారు. ఇప్పుడు టీఆర్​ఎస్​ పార్టీ పెద్దలు కూడా సదరు మాజీ మంత్రి చెప్పినట్టే చేస్తుండటమే కాకుండా సెగ్మెంట్​లో తన వర్గాన్ని పెంచుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో తన పరిస్థితి ఎలా ఉంటుందనే భయంతో ముందుగానే మళ్లీ కాంగ్రెస్​తో సన్నిహిత సంబంధాలను కొనసాగించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ కాంగ్రెస్​లో చేరుతారని ప్రచారం జరుగుతోంది.

అసంతృప్తులను వదిలేసినట్టే..!

మరోవైపు టీపీసీసీ చీఫ్​ పీఠం అంశంలో నెలకొన్న అసంతృప్తి పార్టీలో నేటికీ రగులుతూనే ఉంది. ముందుగా ప్రకటించినట్టే… ఇప్పటికీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి గాంధీభవన్​ మెట్లు ఎక్కడం లేదు. అటు రాజగోపాల్​రెడ్డి కూడా పేరుకు మాత్రమే కాంగ్రెస్​.. కానీ అన్నీ విమర్శలే. ఇటీవల జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏకంగా ఏఐసీసీ రంగంలోకి దిగింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్​ ఈ విషయంపై రాష్ట్రానికి వచ్చి పార్టీ నేతలతో సమావేశమై హెచ్చరికలు జారీ చేశారు. దీంతో జగ్గారెడ్డి వెంటనే వెనక్కి తగ్గారు. సారీ చెప్పారు. కానీ రేవంత్​ వర్గంపై ఆయనకు ఒకింత ఆగ్రహం కొనసాగుతూనే ఉంది. అటు ఎంపీ ఉత్తమ్​ కూడా పార్టీకి అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. ఇలా కొంతమంది సీనియర్లు కూడా అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో హుజురాబాద్​ ఉప ఎన్నిక అభ్యర్థి కూడా కొంత రాద్ధాంతమైంది. ఈ సమయంలోనే టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి సీనియర్లను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అసంతృప్తి నేతలను పట్టించుకోకుండా.. సీనియర్లు, కొత్తతరం నేతలను ప్రోత్సహిస్తున్నారు. డీఎస్​తో పాటుగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి కూడా కాంగ్రెస్​లోకి వస్తారనే ఊహాగానాలు ముందు నుంచే ఉన్నాయి. అంతేగాకుండా టీఆర్​ఎస్​లో ప్రాధాన్యత లేకుండా.. ఏండ్ల నుంచి పార్టీలో, ఏదైనా నామినేటేడ్​ పదవులు కోసం ఎదురుచూస్తూ భంగపడుతున్న వారిని పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.



Next Story