తెలంగాణలో ప్రముఖుల నిర్లక్ష్యం.. హద్దు దాటుతున్న మంత్రులు!

by  |
Officers vehicles
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉన్నతాధికారులు.. అమాత్యులు ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్​చేస్తున్నారు. ఇస్టానుసారంగా స్పీడ్​వెళ్లడం, ఎక్కడ పడితే అక్కడే నిలుపడం, రాంగ్​రూట్‌లో వెళ్లడం, సీటు బెల్ట్​ధరించకపోవడం వంటి నిబంధలను పాటించడం లేదు. కొన్నిచోట్ల ట్రాఫిక్​పోలీసులకు దొరికిపోతున్నారు. చాలా సందర్భాల్లో పోలీసులు కూడా తేలిగ్గా తీసుకుంటున్నారు. కానీ, కొన్ని సందర్భాల్లో మాత్రం ఫొటోలు తీసి ఫైన్​వేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​వాహనం ఓవర్​స్పీడ్‌కు రూ.3 వేల ఫైన్​విధించిన విషయం తెలిసిందే. ఇలా పలువురు ఐఏఎస్​ అధికారులు తమ వాహనాలను ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్​చేస్తూ రోడ్లపై దౌడు తీయిస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్​కారు కూడా రాంగ్​రూట్‌లో వెళ్లి పోలీసులను పరుగులు పెట్టించింది. గవర్నర్​కాన్వాయికి ఎదురుగా రాంగ్​రూట్‌లో వస్తున్న కేటీఆర్ కారును పోలీసులు నిలిపివేశారు.

దారి తప్పుతున్నారు

ఇటీవల సీఎస్​సోమేశ్​కుమార్​వాహనం టీఎస్​09 ఎఫ్​ఏ 0001పై రూ.3 వేల ఫైన్​విధించారు. పీవీ నర్సింహారావు ఎక్స్​ప్రెస్​హైవేపై అతి వేగంగా వెళ్లినందుకు జరిమానా విధించారు. అంతకు ముందు జనగామ జిల్లా కలెక్టర్‌ వాహనం (టీఎస్‌ 27ఏ 0001) పై యూజర్‌ చార్జీలు కలుపుకుని చలాన్ల కింద రూ.22,905 జరిమానా విధించారు. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకుండా కలెక్టర్‌ వాహనం 23 సార్లు ఓవర్‌ స్పీడ్‌తో వెళ్లినందుకుగాను సంబంధిత పోలీసులు ఈ జరిమానా విధించారు. ఈ చలాన్లు ఏడాదికాలంగా నమోదయ్యాయి. జీహెచ్​ఎంసీ కమిషనర్​వాడుతున్న టీఎస్​09ఎఫ్​ఏ6666పై ఇప్పటి వరకు 25 చలాన్లు పెండింగ్​ఉన్నాయి. రూ. 18,440లు జరిమానా వేశారు. ఇవన్నీ ఇంకా చెల్లించాల్సి ఉంది. ట్రాఫిక్​రూల్స్‌లో భాగంగా ఓవర్​స్పీడ్, స్టాప్​లైన్లు, జీబ్రా లైన్లు క్రాసింగ్, సీటు బెల్ట్ ధరించకపోవడం వంటి వాటిని ఉల్లంఘించినందుకు ఈ ఫైన్ వేశారు. గతంలోనూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిందంటూ సీఎం కేసీఆర్‌ వాహనానికి ట్రాఫిక్ పోలీసులు‌ చలాన్లు విధించారు. సీఎం వాహనానికి ఓవర్ స్పీడ్‌కు సంబంధించి మొత్తం నాలుగు సార్లు జరిమానా విధించారు. హైదరాబాద్‌లో రెండు, సైబరాబాద్‌లో ఒకటి, సూర్యాపేట జిల్లాలో మరో జరిమానా విధించారు. ఇటీవల చలానా మొత్తం రూ.4,140 ను సీఎంవో అధికారులు చెల్లించారు. తాజాగా కేటీఆర్ కారు కూడా గవర్నర్​ కాన్వాయ్‌కి రాంగ్ రూట్‌లో వెళ్లి కొంతసేపు హైరానా సృష్టించింది. అయితే, ఈ కారును ముందుగా అడ్డుకున్న పోలీసులు.. ఆ తర్వాత ఫైన్ వేయలేదు.

హద్దు దాటేస్తున్నారు

‘ప్రభుత్వ వాహనం’ అనే ధైర్యంతో ఉన్నతాధికారులు రూల్స్​బ్రేక్ చేస్తున్నారు. ఉన్నతాధికారులనే ధీమాతో వాహనాలను ఇస్టానుసారంగా వెళ్లనిస్తున్నారు. ఓవర్​ స్పీడ్‌తో వాహనాలు పరుగులు తీస్తున్నాయి. కొన్నిచోట్ల పోలీసులు కూడా వాటికి సైడ్​ ఇప్పిస్తున్నారు. కానీ, ప్రతిసారి అదే తీరుతో వెళ్తుండటంతో ఫైన్ వేయాల్సి వస్తోంది. జిల్లాల్లోని కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్ల వాహనాలు ఎలా ఉన్నా.. హైదరాబాద్‌లో కీలకస్థాయిలో ఉన్న ఉన్నతాధికారులు కూడా ట్రాఫిక్​రూల్స్ పాటించడం లేదని స్పష్టమవుతోంది.

తప్పుడు నెంబర్లు కూడా..!

సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లోని వాహనాల నెంబర్లు ప్రైవేట్ వ్యక్తులు వాడుతుండటం గతంలో రాష్ట్రంలో సంచలనంగా మారింది. సీఎం భద్రత దృష్ట్యా కాన్వాయ్‌లోని వాహనాలన్నింటికీ ‘TS 09 K 6666’ అనే నెంబర్ ఉంటుంది. భద్రత కోసం అలా ఒకే నెంబర్‌తో కూడిన వాహనాలను వాడుతుంటారు. ఏ కారులో కేసీఆర్ ఉన్నారన్న విషయాన్ని తెలియకుండా చూసేందుకే ఇలా చేస్తారు. ఆయన కాన్వాయ్‌లో రెండు టోయోటా ప్రాడో, నాలుగు ఫార్చ్యూనర్ వాహనాలు ఉంటాయి. అయితే ఎవరు వాడుతున్నారో ఏమోగానీ, ‘TS 09 K 6666’ నంబర్ తో హైదరాబాద్ పరిధిలో ఎన్నో వాహనాలు తిరుగుతున్నట్లు పోలీసులు కూడా గుర్తించారు. అవన్నీ బెంజ్, ఫార్చ్యూనర్, వోల్వో, వోక్స్ వాగన్ వంటి ఖరీదైన కారులు.

ఇవేవీ కేసీఆర్ అధికారిక వాహనాలు కాదు. గతంలో ‘TS 09 K 6666’ నంబర్ గల వాహనం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్టు చెబుతూ, మోటార్ వాహనాల చట్టం ప్రకారం, రూ. 7845 చెల్లించాలంటూ ఆన్ లైన్లో చలానాలు కనిపిస్తుండటంతో రవాణా శాఖ అధికారులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్లు కూడా ఒకే రకంగా లేకపోవడంతో కేసీఆర్ కాన్వాయ్ వాహనాల నంబర్ ను చాలా మంది అడ్డగోలుగా వాడేస్తున్నారని తేలింది. అసలు కాన్వాయ్ లో మెర్సిడిస్ బెంజ్ వాహనమే లేకపోగా, ఓ బెంజ్ కారుకు అదే నంబర్ తగిలించుకుని తిరుగుతూ, మితిమీరిన వేగంతో వెళ్లిన ఆరోపణలపై చలాన్ నమోదైంది. కొందరు ప్రజా ప్రతినిధులే నిబంధనలకు విరుద్ధంగా ఇలా నకిలీ నంబర్ ప్లేట్లు తయారు చేయించుకుని పెట్టుకుని తిరుగుతున్నట్టు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed