జగిత్యాల జిల్లాలో పెద్దపులి సంచారం.. టెన్షల్‌లో ప్రజలు

by  |
జగిత్యాల జిల్లాలో పెద్దపులి సంచారం.. టెన్షల్‌లో ప్రజలు
X

దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సంగేమ్ గ్రామ శివారులో బుధవారం పెద్దపులి సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులో పెద్ద పులి సంచరిస్తున్నట్లు పశువుల కాపరులు, కొందరు రైతులు.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న అటవీశాఖ అధికారులు పులి అడుగులను పరిశీలించారు.

అవి పెద్ద పులి అడుగులుగానే ఉన్నాయని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే, ఖచ్చితంగా పెద్ద పులి అడుగులేనా కాదా.? అని తేల్చేందుకు ఆ ప్రాంతంలోని అడుగులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు జగిత్యాల డీఎఫ్ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆ జంతువు ఏదో తేలే వరకు స్థానికులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కానీ, పులి సంచారంపై పశువుల కాపరులు, రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

పలు మార్లు వదంతులు..

నిత్యం రద్దీగా ఉండే జగిత్యాల జిల్లా కేంద్రంలోనూ గతంలో కొన్ని నెలల క్రితం గీతా విద్యాలయం సమీపంలోని తుమ్మ పొదల్లో పెద్ద పులి సంచారంపై పెద్ద ఎత్తున వదంతులు వ్యాప్తి చెందాయి. దీంతో అటవీ శాఖ అధికారులు పులిని పట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇదే క్రమంలో పెద్ద పులి ఒకరిపై దాడి కూడా చేసిందని ప్రచారం జరిగింది.

జనం హడావిడితో ఓ ఇంటిలో దూరి అక్కడే నక్కిందని తెలుసుకుని దాన్ని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదనే ప్రచారం సాగింది. పెద్ద పులి సంచారం తెలియకపోవడంతో అటు వైపు వెళ్లే ప్రజలు ఆ పరిసరాలు దాటే వరకు హైరానా చెందారు. కొద్ది రోజుల తరువాత మల్యాల మండలంలో రాంపూర్, రామన్నపేట పంట క్షేత్రాలలో కూడా పెద్ద పులి సంచారంపై సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో అటవీ శాఖ అధికారులు దాన్ని అడవి పిల్లిగా నిర్ధారించారు.



Next Story

Most Viewed