పరారైన బాలల్లో ముగ్గురు సేఫ్.. మరొకరు మిస్సింగ్

by  |
పరారైన బాలల్లో ముగ్గురు సేఫ్.. మరొకరు మిస్సింగ్
X

దిశ, పాలేరు : కూసుమంచి మండల కేంద్రంలోని క్రైస్తవ జిప్సీ హాస్టల్లో ఆశ్రయం పొందుతున్న నలుగురు బాలురు కలిసి పరారైన ఘటన సోమవారం వెలుగుచూసింది. ఎస్సై నందీప్ వెంటనే అప్రమత్తంగా వ్యవహరించడంతో బాలుర ఆచూకీ లభ్యమైంది. సీఐ కొప్పుల సతీష్ పర్యవేక్షణలో బాలుర ఆచూకీ కనుగొన్నట్టు పోలీసులు తెలిపారు. వివరాల్లోకివెళితే.. బిహార్‌కు చెందిన రషద్(14), తోపిక్(13), తన్వీర్(13), అస్సాంకు చెందిన పింటు(16)లు గత కొద్ది నెలల కిందట వారి రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌‌లోని మదర్సాకు ఉర్దూ నేర్చుకునేందుకు వచ్చారు.

మదర్సా నుంచి పారిపోయి రైల్లో ప్రయాణిస్తూ ఖమ్మం చేరుకోగానే రైల్వే పోలీసులు పట్టుకుని చైల్డ్ వెల్ఫేర్ (సీడబ్య్లూసీ) అధికారికి అప్పగించారు. అయితే, పిల్లలు వివరాలు చెప్పకపోవడంతో ఆమె కూసుమంచిలోని జిప్సీ హాస్టల్‌కు పంపించగా వారం రోజుల నుంచి హాస్టల్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం 11గంటలకు హాస్టల్ నుంచి ఈ నలుగురు బాలురు పారిపోయారని హాస్టల్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన కూసుమంచి ఎస్సై నందీప్ సోషల్ మీడియాలో సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.

దీనితో కూసుమంచి శివారు నర్సరీ సమీపంలోని రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న ఆ నలుగురిని కూసుమంచి హైస్కూల్ ఉపాధ్యాయుడు శోభన్ గుర్తించి వారిని ఆపే ప్రయత్నం చేయగా మళ్లీ తప్పించుకున్నారు. వెంటనే ఆయన ఎస్ఐకు సమాచారమిచ్చారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న హాస్టల్ వార్డెన్ ముగ్గురిని అదుపులోకి తీసుకోగా.. ఎస్సై చుట్టుపక్కల గ్రామాల్లో పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి అలర్ట్ చేశారు. అస్సాంకు చెందిన పింటు(16) పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం ముగ్గురు పిల్లలు పోలీసులు సమక్షంలో ఉన్నారు. త్వరలోనే వారిని స్వస్థలాలకు పంపించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.


Next Story

Most Viewed