చిరుతను చంపిన కేసులో ముగ్గురు నిందితులు అరెస్టు

by  |
tiger
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అడవుల్లో చిరుత పులిని కాల్చిన నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టామని అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ ఫీల్ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం సాయంత్రం అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూరులో గల అటవీ శాఖ విజ్ఞాన కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బుధవారం తెల్లవారుజామున 6 గంటలకు అటవీశాఖ అధికారులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మండల పరిధిలోని కుడి చింతలబైలు గ్రామానికి చెందిన లాలు, కుక్కల కృష్ణయ్య అలాగే బియ్యాన్ని వెంకటేష్‌లను ఓ ప్రాంతంలో గుర్తించి, మా సిబ్బంది చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారని ఆయన తెలిపారు.

వారిని విచారించగా కుక్కల కృష్ణయ్య తనకు ఉన్న పోడు వ్యవసాయ పొలంలో పంట రక్షణ కోసం వేసుకున్న ఉచ్చులలో నవంబర్ 20న చిరుతపులి పడి మరణించిందని, మరుసటి రోజున తన మిత్రులతో కలిసి ఆ పులిని అడవి లోపలికి తీసుకెళ్లి దహనం చేశారని తెలిపారు. ఈ క్రమంలో చిరుత పులికి చెందిన 18 గోర్లు నాలుగు దంతాలు నిందితుల వద్ద దొరికాయని వివరించారు.

చట్టం ప్రకారం ఆ ముగ్గురు నిందితులు చిరుత ఉచ్చులో పడి మరణిస్తే అటవీ శాఖ అధికారులకు తెలుపకపోవటం, సాక్ష్యాలు బయటపడకుండా చేయడం, కాల్చివేయడం అలాగే అక్రమంగా సంపాదించేందుకు గోళ్ళను, దంతాలను స్వీకరించడం ఇలాంటి నాలుగు తప్పిదాలు చేసినందుకు వారిపై కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. అంతేకాకుండా పూర్తిస్థాయి విచారణ అనంతరం అటవీ హక్కుల చట్టం ప్రకారం కేసులు బనాయిస్తూ కోర్టుకు హాజరు పరుస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్, అమ్రాబాద్ డివిజనల్ అధికారి రోహిత్ గోపి డి, రేంజ్ అధికారులు రవి మోహన్ బట్, ఈశ్వర్, డిఆర్ఓ రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed