‘ఉంగరం’తో.. మానవ శరీరం నుంచి విద్యుత్

421

దిశ, ఫీచర్స్: నీరు ఎత్తు నుంచి పల్లానికి ప్రవహించినట్లే..రెండు వస్తువులు లేదా ప్రదేశాలు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నప్పుడు, ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాల నుంచి తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాలకు వేడి (heat) ప్రవహిస్తుంది. ప్రవాహం ఆగిపోయిందంటే రెండు వస్తువులు ఒకే ఉష్ణోగ్రత దగ్గర ఉన్నాయనే విషయాన్ని మనం సైన్స్ పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం. అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఉష్ణోగ్రతలో తేడాలను పెంచే సాంకేతికతపై ‘థర్మోఎలక్ట్రిక్ వ్యవస్థ’ ఆధారపడి ఉంటుందని తెలుసు. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకునే అమెరికాలోని కొలరాడో విశ్వవిద్యాలయం (యుసి) శాస్త్రవేత్తలు తాజాగా మన శరీర ఉష్ణోగ్రతను విద్యుత్తుగా మార్చే ఓ రింగ్(ఉంగరం)ను అభివృద్ధి చేశారు. మానవ శరీరం నుంచి విద్యుత్ శక్తిని పుట్టించడమే కాకుండా, ఆ రింగ్‌కు ఏదైనా డ్యామేజ్ జరిగితే, దానికదే మరమ్మతు చేసుకోగలదు.

టెక్నాలజీ పెరిగిన తర్వాత మానవుడు ఉపయోగించే వేరబుల్స్ పెరిగాయి. మనం వాడే టెక్ పరికరాలన్నింటికీ చార్జింగ్ అవసరం. ముఖ్యంగా సెల్ ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. దాన్ని చార్జ్ చేయడానికి విద్యుత్ అవసరం. కాగా, భవిష్యతుల్లో వీటిని చార్జ్ చేయడానికి అదనపు పరికరాలను వెంట తీసుకోనవసరం లేకుండా, మన శరీరంలోని ఉష్ణోగ్రతతోనే విద్యుత్ ఉత్పత్తి చేసి, చార్జింగ్ చేసుకునే సౌలభ్యం రాబోతుంది. అందుకు ‘ఈ థర్మో ఎలక్ట్రిక్ రింగ్’ నిదర్శనం. మన పరిసరాల్లోని ఉష్ణోగ్రతకు, శరీరంలోని వేడికి మధ్య ఉన్న తేడా ఆధారంగా విద్యుత్తు ఉత్పత్తి చేస్తుంది ఈ ఇన్‌స్ట్రుమెంట్. ఇది పాలిమైన్ అనే ప్రత్యేక పాలిమర్‌ను కలిగి ఉండటంతో పాటు, దీన్ని వెండి నానోపార్టికల్స్‌తో డోప్ చేశారు. అందువల్ల ఇది మన శరీరానికి, రింగ్‌కు మధ్య ఒక రసాయన బంధాన్ని సృష్టిస్తుంది. ఈ ఉంగరం పైభాగంలో చిన్న సైజు టీఈసీ(థర్మో ఎలక్ట్రిక్‌ల చిప్స్) ఉంటాయి. చర్మం ఎంత మేరకు ఈ పాలీమైన్‌ పదార్థానికి అతుక్కుని ఉందో అంత మేరకు విద్యుత్తు తయారు చేయగలదు. ఈ లెక్కన ప్రతి చదరపు సెంటీమీటర్‌కు ఒక వోల్టు విద్యుత్తు ఉత్పత్తి అవుతుండగా, వాచ్‌లు, ఫిట్‌నెస్‌ ట్రాకర్లకు ఈ విద్యుత్తు సరిపోతుందని పరిశోధకులు అంటున్నారు. రిస్ట్ బ్యాండ్ పరిమాణంలో ఇలాంటి ఓ పరికరం తయారు చేస్తే 5 వోల్టుల వరకు విద్యుదుత్పత్తి చేయొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..