నక్సల్స్ శాంతి చర్చల డిమాండ్ వెనుక మరో స్కెచ్

by  |
నక్సల్స్ శాంతి చర్చల డిమాండ్ వెనుక మరో స్కెచ్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: శాంతి చర్చల డిమాండ్ వెనుక ఆంతర్యం ఏంటీ? మావోయిస్టులు వెనకడుగు వేశారా? పట్టు సడలిపోతోందన్న ఆందోళన ఎందుకిలా వ్యవహరిస్తున్నారు అన్న చర్చే సాగుతోంది. క్రాంతికారి జనతాన్ సర్కార్ పేరిట సమాంతర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దశాబ్దన్నర కాలంగా అప్రతిహతంగా మావోయిస్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మింగుడు పడకుండా తయారయ్యారు. కీకారణ్యాలు, ఎత్తైన కొండల నడుమ దండకారణ్య ప్రాంతాన్ని ఏలుతున్నారు. మావోయిస్టులపై పట్టు సాధించేందుకు వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయి. వేలాది మంది బలగాలను అడవుల్లో మోహరించి మావోయిస్టుల ఏరివేత కోసం ప్రయత్నిస్తున్నాయి. అయినా మావోల ఎత్తుల ముందు బలగాలు చిత్తవుతున్నాయి. ఒక్కోసారి బలగాలు మావోయిస్టులను ఏరివేయడంలో సఫలం అయినా అంతకు రెట్టింపు నష్టాన్ని చవి చూస్తున్న సందర్భాలే ఎక్కువ. అభూజ్ మడ్ పర్వతశ్రేణి విస్తరించి ఉన్న ఆ ప్రాంతంలో పోలీసులు పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నా పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నారు.

పట్టున్నా పంథం ఎందుకో

దండకారణ్యంలో తిరుగులేని పట్టు సాధించినా మావోయిస్టులు శాంతి చర్చల అంశం తెరపైకి తీసుకరావడం ఏంటన్నదే అంతుచిక్కకుండా తయారైంది. నెల రోజుల క్రితం శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించిన మావోయిస్టులు తాజాగా విడుదల చేసిన ప్రకటన మరోసారి చర్చకు దారి తీసింది. ఏప్రిల్3న బీజాపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ ఘటన నుండి ఓ జవాన్‌ను కిడ్నాప్ చేశారు. ఈ క్రమంలో అతను తమ ఆధీనంలో క్షేమంగానే ఉన్నాడని ప్రకటించారు. శాంతి చర్చల కోసం మధ్యవర్తులను ప్రకటించాలని డిమాండ్ చేయడం గమనార్హం. అసలు మావోయిస్టులు చర్చల గురించి ఎందుకు పట్టబడుతున్నారోనన్నదే హాట్ టాపిక్‌గా మారింది.

మావోల ఆధీనంలో ఉన్న ప్రాంతంలోకి బలగాలు చొచ్చుకపోవడమే ఇందుకు కారణమంటున్నారు కొందరు. శనివారం నాటి ఎదురు కాల్పుల ఘటన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించారు. ఆయన మావోల ఇలాఖ అయిన బసగుడా సీఆర్పీఎఫ్ క్యాంప్‌ను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. మావోయిస్టులకు పట్టున్న ప్రాంతంలోకి చొచ్చుకపోతున్నాయన్నారు. అలాగే మరింత లోపలికు బలగాలు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. అంటే క్రమక్రమంగా మావోల సమాంతర ప్రభుత్వం కుంచించుకుపోతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

మరోవైపున వేసవి కాలం కావడంతో అడవుల్లో పచ్చదనం తగ్గిపోయి మైదానాలను తలపించే అవకాశం లేకపోలేదు. ఈ సమయంలో శాంతి చర్చల అంశాన్ని లేవనెత్తితే ప్రభుత్వం కూంబింగ్ ఆపరేషన్లను నిలిపివేస్తుందన్న వ్యూహాత్మక ఎత్తుగడగా కూడా భావిస్తున్నారు. తమ స్వీయ రక్షణ కోసం మావోయిస్టులు వేసిన ఈ ఎత్తుగడ లోగుట్టు అర్థం కాకుండా ఉండేందుకే జోనాగుడా వద్ద బలగాలను మట్టుబెట్టి తామేంటో నిరూపించి ప్రభుత్వానికి సవాల్ విసిరి శాంతి చర్చల అంశాన్ని తెరపైకి తీసుకవచ్చారా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

వారెలా చనిపోయారో…?

బీజాపూర్ జిల్లా జోనాగుడా వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోయినట్టు పార్టీ అధికారికంగా ప్రకటించింది. అయితే వారు ఎలా చనిపోయారు? గుట్టలపై నుండి ‘U’ ఆకారంలో అంబూష్ చేసి మరీ బలగాలను అంతమొందించారు. పకడ్బందీగా వ్యూహం అమలు చేసినా నలుగురు ఎలా చనిపోయారన్నదే మిస్టరీ. అయితే బలగాలను మట్టుబెట్టిన తర్వాత జవాన్లు అందరూ చనిపోయారన్న ధీమాతో ఆయుధాలు తీసుకెళ్లేందుకు కొంతమంది మావోయిస్టులు మృతదేహాల వద్దకు వెళ్లి ఉంటారని తెలుస్తోంది. ఈ క్రమంలో గాయపడ్డ జవాన్లు కొంతమంది ఆయుధాల కోసం వచ్చిన మావోలపై కాల్పులు జరిపి ఉంటారని, ఈ కాల్పుల్లో నలుగురు మావోలు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.


Next Story

Most Viewed