500 మైక్రో శిల్పాలు చెక్కిన యువకుడు.. పద్మశ్రీకి నామినేట్

by  |
500 మైక్రో శిల్పాలు చెక్కిన యువకుడు.. పద్మశ్రీకి నామినేట్
X

దిశ, ఫీచర్స్: చిన్న వయసు నుంచే తన అభిరుచికి సానపెట్టిన ఓ యువకుడు.. అదే రంగంలో పేరు తెచ్చుకోవడమే లక్ష్యంగా పనిచేసి సూక్ష్మ శిల్పాలు చెక్కడంలో ఎక్స్‌పర్ట్‌గా మారాడు.12 ఏళ్ల వయసులో రూపొందించిన గణేష్ ప్రతిమకు పొందిన ప్రశంసలే ఈ కళను ఎంచుకునేందుకు ఇన్‌స్పైర్ చేయగా.. ఈఫిల్ టవర్, నేషనల్ ఎంబ్లమ్, వరల్డ్ కప్ ట్రోఫీ ఇంకా ఎన్నో సూక్ష్మ చిత్రాలకు రూపమిచ్చేందుకు స్ఫూర్తినిచ్చాయి. ఈ క్రమంలోనే తన మైక్రో ఆర్ట్ ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లోనూ స్థానం సంపాదించగలిగాడు.

విశాఖపట్నంకు చెందిన డాక్టర్ గట్టెం వెంకటేష్.. చిన్నతనంలోనే వివిధ రకాల ఆర్ట్ ఫామ్స్‌కు ఆకర్షితుడయ్యాడు. తన గ్రామంలో ఉన్న హస్తకళాకారుల దగ్గరికెళ్లి మెళకువలు నేర్చుకుంటూనే.. పెన్సిల్ లీడ్స్, బ్యాంగిల్స్, టూత్‌పిక్స్, చాక్ పీస్‌ తదితర వస్తువులపై సూక్ష్మ శిల్పాలను చెక్కడం ప్రారంభించాడు. అది గమనించి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడంతో లక్ష్యంపైనే ఫోకస్ చేశాడు. అలా ఇప్పటివరకు 500కు పైగా సూక్ష్మ చిత్రాలను చెక్కిన వెంకటేష్.. 100 అవార్డులు సొంతం చేసుకున్నాడు. టూత్‌పిక్‌పై 23 నిమిషాల్లో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌ను చెక్కినందుకు గాను 2017లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. 2015లో ‘భారత్ గౌరవ్’ అవార్డుతో పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఐదుసార్లు స్థానం పొందాడు.

2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కార్ అవార్డు పొందిన తర్వాతే నా కళకు గుర్తింపు లభించినట్లు అనిపించింది. గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి గ్రాడ్యుయేట్ పూర్తిచేసి, జర్మనీలోని పీస్ యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్‌లో పీహెచ్‌డీ పట్టా పొందాను. అయితే కళను ఏ రూపంలోనూ పరిమితం చేయకూడదనే లక్ష్యంతో ‘వెంకీ ఆర్ట్స్’ పేరుతో ఒక సంస్థను స్థాపించి, ఆర్టిస్ట్‌గా కెరీర్ కొనసాగించాలనుకునే విద్యార్థులకు సాయం చేస్తున్నాను. దీని ద్వారా ఇప్పటివరకు 20వేల మందికి పైగా విద్యార్థులకు ఆర్ట్ నేర్పించాను. కళ నాకు జీవితంలో ఒక లక్ష్యాన్ని నేర్పింది. భవిష్యత్తులో మరింత శ్రమ, పట్టుదలతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను.
– వెంకటేష్, మైక్రో ఆర్టిస్ట్


Next Story