పీడ కలలా సాగిన 2020

by  |
పీడ కలలా సాగిన 2020
X

రెండు నెలలు మినహా ఈ ఏడాదంతా కరోనా నామ సంవత్సరంగానే గడిచిపోయింది. ప్రజలు గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగనంతటి బాధలను చవిచూశారు. కష్టకాలంలో ప్రభుత్వం ఆదుకుంటుందని ఇంతకాలం ఉన్న భ్రమలు తొలగిపోయాయి. కరోనా అనేక కొత్త విషయాలను నేర్పింది. జీవితాలను తిరిగి కోలుకోలేనంతగా దెబ్బకొట్టింది. ప్రభుత్వం మీద, వ్యవస్థ మీద, వ్యక్తుల మీద నమ్మకం కోల్పోయేలా చేసింది. లక్షలాది మంది చిరుద్యోగులు నిరుద్యోగులయ్యారు. ఊహించని ఉత్పాతం బతుకును ఆగం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా ఒక చీడ. ఎంతకూ ఎడతెగని పీడ కల. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతమైపోయింది. స్వీయ ఆర్థిక వనరులు కుప్పకూలడంతో ప్రభుత్వం అప్పులపైనే ఆధారపడింది. రెండు నెలల క్రితం సమీక్ష చేసిన సీఎం కేసీఆర్ రూ.52 వేల కోట్ల ఆదాయం తగ్గిపోయిందని చెప్పారు. అంచనా వేసిన బడ్జెట్‌లో సుమారు 35% తలకిందులైంది. సంక్షేమ పథకాలను ఆపలేక, వాటికి నిధులు కేటాయించలేక సర్కారు సతమతవుతోంది. ఆదాయం ఆర్జించడానికి వేసిన ఎల్ఆర్ఎస్ పథకం బెడిసికొట్టింది. ఆరేళ్ల నిర్లక్ష్యం ఒక్కరోజు కురిసిన వర్షంతో బట్టబయలైంది. ప్రజల బతుకులు అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి తరహాగా మారాయి. జనం పట్టణాలు వదిలి పల్లెబాట పట్టారు. ఉపాధి హామీ శరణ్యమనుకున్నారు. ప్రైవేటు కొలువులుపోయి ఆత్మహత్యను ఎంచుకున్నారు. ధర్మాసుపత్రులపై, ప్రజారోగ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సడలిపోయింది. కార్పొరేట్ ఆసుపత్రుల అసలు రంగు తెలిసిపోయింది. విద్య, వైద్యం కల్పించాల్సిన ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకుంది.

పారాసిటమాల్‌తో మొదలు

కరోనా గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో గందరగోళాన్ని సృష్టించాయి. ‘ఒక్క పారాసిటమాల్ మాత్ర వేసుకుంటే చాలు అంతా తగ్గిపోతుంది. మాస్కు కూడా అవసరం లేదు. మేం మాస్కు పెట్టుకున్నమా? మా ఎమ్మెల్యేలే మాస్కు పెట్టుకోకుండా ముందుండి పనిచేస్తరు’ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన మెడకు చుట్టుకున్నాయి. చివరకు నిర్బంధ మాస్కు విధానాన్ని తీసుకురాక తప్పలేదు. జాగ్రత్తగా ఉండండి అంటూ రెండు చేతులెత్తి మొక్కే దాకా తీసుకెళ్లింది. కేరళ తరహాలో ఆ రోజే పకడ్బందీ చర్యలు తీసుకుని ప్రజలను అప్రమత్తం చేసి ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉండేది. ఇప్పటికీ కరోనా భూతం ప్రజలను వెంటాడుతూనే ఉంది.

కరోనా లెక్కలలో గందరగోళం

అనేక రాష్ట్రాలతో పోలిస్తే కరోనా కేసులు, మరణాలు తక్కువగా ఉన్నాయని, రికవరీ భేషుగ్గా ఉందని తెలంగాణ ప్రభుత్వం చెప్పుకుంది. దానికి తగినట్లుగా లెక్కలను చూపెడుతోంది. ఇవన్నీ కాకిలెక్కలేనని, తప్పుడు రికార్డులేనని హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఆసుపత్రుల నుంచి బయటకు వస్తున్న డెడ్‌బాడీల అంకెలకూ ప్రభుత్వం వెలువరిస్తున్న బులెటిన్ లెక్కలకూ మధ్య పొంతన లేదనే వివాదం సరేసరి. చివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ స్వయంగా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కోర్టు ధిక్కరణ నేరం కింద నోటీసులు కూడా జారీ అయ్యాయి. రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వ లెక్కల ప్రకారం రెండున్నర లక్షల మంది కరోనా బారిన పడగా 1500 మందికిపైగా చనిపోయారు.

ప్రభుత్వాసుపత్రులపై సడలిన నమ్మకం

కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయితే వ్యక్తితో పాటు కుటుంబమంతా సమాజంలో ఏదో నేరం చేసినట్లుగా దోషులుగా చూసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంటి ముందుక కంటైన్‌మెంట్, క్వారంటైన్ బోర్డులు ప్రజలను భయపెట్టాయి. ప్రభుత్వాసుపత్రులలో సౌకర్యాలు లేక నానా తిప్పలు పడ్డారు. ఆక్సిజన్ సౌకర్యం లేక కళ్ల ముందే ప్రాణాలు వదిలారు. పేషెంట్లు అరకొర సౌకర్యాలతో నరకం చూశారు. నర్సులు, డాక్టర్లు పీపీఈ కిట్లు, మాస్కుల కొరతతో యాతన అనుభవించారు. క్లిష్ట పరిస్థితులలో విధులు బహిష్కరించి రోడ్ల మీదకు వచ్చి సమ్మె చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం పట్టీపట్టనట్లుగానే వ్యవహరించింది. ప్రజలకు ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం సడలిపోయింది. వైరస్ సోకినా ప్రభుత్వానికి తెలియకుండా ఇంటిపట్టునే సొంత వైద్యం చేసుకుంటూ క్వారంటైన్‌లో ఉండిపోయారు.

ప్రజారోగ్య వ్యవస్థపై నిర్లక్ష్యం

ఇటు రాష్ట్ర ప్రభుత్వానికీ, అటు కేంద్ర ప్రభుత్వానికీ ప్రజారోగ్య వ్యవస్థపై నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో కరోనా సమయంలో కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆసుపత్రులలో బెడ్‌ల సంఖ్యకు అనుగుణంగా డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్, వైద్య సిబ్బంది లేకపోవడంతో వైద్య సేవలకు అంతరాయం కలిగింది. ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వానికి తెలిసొచ్చింది. తగినంత సంఖ్యలో నర్సులు లేకపోవడంతో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు విధానాలే శరణ్యమయ్యాయి. జీతాలు సకాలంలో లేకపోవడంతో వారు కూడా రోడ్డెక్కారు. బడ్జెట్ కేటాయింపుల్లో వైద్యారోగ్య రంగానికి రూ. 7890 కోట్లుగా పేర్కొన్నా ,అందులో 70% మాత్రమే విడుదల చేసింది. నర్సింగ్ స్కూళ్లకు అనుమతులు లేకపోవడం, నర్సుల రిక్రూట్‌మెంట్ లేకపోవడంతో ప్రజారోగ్య వ్యవస్థ ప్రజావసరాలను తీర్చలేకపోయింది.

కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ

కరోనాను అడ్డుపెట్టుకుని కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి తెరతీశాయి. లక్షలాది రూపాయలు ఆర్జించాయి. డెడ్‌బాడీని ఇవ్వడానికీ లక్షలాది రూపాయలను డిమాండ్ చేశాయి. కార్పొరేట్ ఆసుపత్రుల అసలు రంగు బయటపడింది. చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. వందల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినా మొక్కుబడిగా రెండు ఆసుపత్రులపై తూతూమంత్రంగా చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంది. ప్రజల జీవితాలను కరోనా కోలుకోలేనంతగా దెబ్బతీస్తే కార్పొరేట్ ఆసుపత్రులకు మాత్రం కాసులు కురిపించింది.

ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం

పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, ఐటీ రంగం, వాణిజ్యం, మద్యం అమ్మకాలు, చిరు వ్యాపారాలు దెబ్బతినడంతో ప్రజల జీవితాలు అయోమయంగా మారాయి. లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు వీధిన పడ్డారు. ప్రైవేటు ఉద్యోగులు పల్లెబాట పట్టి పొలం పనులలో, ఉపాధి హామీ కూలీ పనులలో చేరిపోయారు. స్వయం ఉపాధి రంగం విచ్ఛిన్నమైపోయింది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. బ్యాంకుల నుంచి, ప్రైవేటు ఫైనాన్షియర్ల నుంచి రుణాలు పుట్టడం గగనమైపోయింది. ఆదాయం పడిపోవడంతో సంక్షేమ పథకాలను అమలుచేయడం ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారింది. ఉద్యోగులు, పింఛనర్ల వేతనాలకు కోత తప్పలేదు. ప్రభుత్వానికి మరో మార్గం లేకుండాపోయింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఆదాయానికి సమంగా అప్పులు చేయాల్సి వచ్చింది. కరోనాతో దెబ్బతిన్న ప్రజలకు తగిన ప్రత్యామ్నాయాన్ని ప్రభుత్వం చూపలేకపోయింది. ప్రైవేటు టీచర్లు, రైతులు, నిరుద్యోగ యువత ఆర్థిక ఇబ్బందుల కారణంగా పదుల సంఖ్యలో అర్ధంతరంగా తనువు చాలించారు.

నిర్ణయాలన్నీ వివాదాస్పదమే

ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదార్లకు కోత పెట్టడం మొదలు రిజిస్ట్రేషన్లు ఆపేయడం, ధరణి లాంటి కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టడం… ఇలా ఏ నిర్ణయం తీసుకున్నా వివాదాస్పదమై చివరకు కోర్టు దాకా వెళ్లాల్సివచ్చింది. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. సచివాలయాన్ని కూల్చివేసి కొత్త భవనం నిర్మాణానికి వందలాది కోట్ల రూపాయలను కేటాయించడం విమర్శలకు కారణమైంది. నగరంలో కురిసిన వర్షాలు, వరదలకు ప్రభుత్వం ప్రకటించిన పది వేల రూపాయల వరదసాయం వ్రతం చెడ్డా ఫలం దక్కలే అనే చందంగా ముగిసింది. ‘నేనూ పెదకాపునే. రైతుబిడ్డనే. ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నా’ అని గొప్పగా చెప్పుకునే సీఎం కేసీఆర్ నియంత్రిత సాగును ప్రవేశపెట్టారు. మద్దతు ధర నిర్ణయించకపోవడంతో రైతన్నలు నిలువునా మునిగిపోయారు. రూ. 150 ఎక్కువ ఇస్తామని సీఎం స్వయంగా చెప్పినా అది ఆచరణలోకి రాలేదు. కనీస మద్దతు ధర లేనప్పుడు రైతుబంధు సాయం దేనికి పనికొస్తుందని నిలదీశారు.


Next Story