అభ్యర్థులు పెరిగారు.. ఓట్లను లెక్కించేది ఎలా..?

105

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటేసే విధానంపై కొంత గందరగోళం ఎదురవుతోంది. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు భారీగా బరిలోకి దిగుతున్నారు. హైదరాబాద్​–రంగారెడ్డి–మహబూబ్​నగర్​ స్థానం నుంచి 93 మంది, వరంగల్​–ఖమ్మం–నల్గొండ స్థానం నుంచి 72 మంది బరిలో ఉన్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో దాదాపు 10 లక్షల మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. వీళ్లలో సగం మందికి పైగా మొదటిసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత ప్రకారం ఓట్లు వేయాల్సి రావడంతో చాలామందిలో గందరగోళ పరిస్థితి ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా పెద్దదిగా ఉండటంతో బ్యాలెట్ పేపర్ భారీ సైజులోనే ఉండే అవకాశముంది.

సాధారణంగా ఎన్నికల్లో ఓటరుకు నచ్చిన అభ్యర్థికి మాత్రమే ఓటు వేస్తారు, కానీ మండలి ఎన్నికల్లో మాత్రం ఓటు వేసే ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. కావలసిన అభ్యర్థికి మాత్రమే కాకుండా మరొకరికి కూడా ఇంకో ఓటు వేయవచ్చు. మొదటి ప్రాధాన్యత ఓటు అంటే, మనకు నచ్చిన అభ్యర్థి 70వ నెంబర్​లో ఉన్నా ఆయనకు మొదట ఓటు వేయవచ్చు. ఆ తర్వాత ఇంకో అభ్యర్థికి కూడా ఓటు వేయవచ్చు. ఒక సెగ్మెంట్​లో 71 మంది బరిలో ఉంటే, వారందరికీ ఓటేయవచ్చు.

ఎలాగంటే..?

నచ్చిన అభ్యర్థికి మొదటి నెంబర్ ఓటు వేసి, మిగతా వారికి కూడా వరుసగా ప్రాధాన్యత క్రమంలో నెంబర్లు వేసే అవకాశం ఉంది. ఉదాహరణకు ఓటరుకు నచ్చిన అభ్యర్థి 35వ నెంబర్ లో ఉన్నాడనుకుంటే ముందుగా అతని పేరు పక్కన 1వ నెంబర్ వేయాలి. ఆ తర్వాత రెండో ప్రాధాన్యత ఇస్తున్న అభ్యర్థి 5వ నెంబర్​లో ఉంటే అతడి పేరు పక్కన రెండో నెంబర్ వేయాలి. ఇలా బ్యాలెట్ పేపర్​లో ఓటరుకు ఇష్టం వచ్చిన వారికి ప్రాధాన్యత క్రమంలో ఓటేసుకునే అవకాశం ఉంది. అందరికీ ఒకటే నెంబర్ వేయకూడదు.
సాధారణ ఎన్నికలకు తరహాలో స్వస్తిక్ మార్క్ వేయొద్దు. ప్రాధాన్యత ప్రకారం ఓటు వేసేటప్పుడు సీరియల్ నెంబర్ మిస్ చేయొద్దు. మిస్ అయితే సక్రమంగా ఉన్నంత వరకే ఓట్లను లెక్కలోకి తీసుకుంటారు. బ్యాలెట్ పేపరులో నోటా ఓటు కూడా ఉండదు.

ఇవే చెల్లుతాయి..!

ఓటరు ప్రాధాన్యతా క్రమాన్ని బట్టి 1,2,3,4,5 ఇలా అంకెల్లో మాత్రమే ఓటేయాలి. ఒక అభ్యర్థికి ఒక ప్రాధాన్యత మాత్రమే ఇవ్వాలి. రెండు నెంబర్లు వేస్తే ఓటు చెల్లదు. బ్యాలెట్ పేపర్ లో ఉన్న వాళ్లల్లో ఒక్కరికి మాత్రమే మొదటి ప్రాధాన్యత (1) ఇవ్వాలి. మరొక్కరికి అదే నెంబర్​ వేస్తే చెల్లదు. బ్యాలెట్ పేపర్లలో ఉన్న అభ్యర్థులందరికీ ఓటింగ్​ ఇవ్వాలనుకుంటే వారి పేర్ల పక్కన ప్రాధాన్యత క్రమంలో నెంబర్ వేయాలి. అభ్యర్థి పేరు, ఫొటో పక్కన ఉన్న గడి లోపలే బార్డర్ దాటకుండా అంకెను వేయాలి. 1,2,3,4,5 కాకుండా రోమన్ అంకెల్లో కూడా వేసుకోవచ్చు.

ఇవీ చెల్లవు..

బ్యాలెట్ పేపర్​పై వేలి ముద్ర, సంతకం, పేర్లు రాస్తే చెల్లని ఓటుగానే పరిగణిస్తారు. రైట్ గుర్తు, తప్పు గుర్తు, ఇతరత్రా బొమ్మలు వేయరాదు. మొదటి ప్రాధాన్యత 1 నెంబర్ ఇవ్వకుండా ఆ తర్వాత 2,3,4 ఇలా ఎన్ని ఇచ్చినా ఆ ఓటును లెక్కలోకి తీసుకోరు. ప్రాధాన్యత క్రమాన్ని అక్షరాల్లో రాయడం, కొన్ని అంకెల్లో వేయడం, మరికొన్ని అక్షరాల్లో రాయడం లాంటి గందరగోళంగా ఓటేస్తే కూడా తిరస్కరిస్తారు. ఒకే అభ్యర్థికి ఒకటి కంటే ఎక్కువ నెంబర్లు కూడా వేయొద్దు. ఎన్నికల అధికారి ఇచ్చిన పెన్ను తప్ప ఇంకో పెన్ను, పెన్సిల్​ ఉపయోగిస్తే రిజెక్ట్​ అవుతోంది. నచ్చిన అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మిగిలిన 2, 3 ప్రాధాన్యతలను వాడుకోని పక్షంలో సదరు ఓటు వేసిన అభ్యర్థికి సరిపోయే అన్ని ఓట్లు (మొత్తం ఓట్లలో 50%) రాకుంటే అభ్యర్థి ఎలిమినేట్​ అవుతారు. అందుకే ప్రాధాన్యతా క్రమాన్ని వాడుకోవాల్సి ఉంటోంది.

50 శాతానికి పైగా ఓట్లు లభిస్తేనే విజయం

శాసనమండలికి జరిగే ఎన్నికలు పూర్తి విభిన్నం. ప్రాధాన్యత క్రమమే ప్రాతిపదికగా నిర్వహించే ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కూడా ఎలిమినేషన్‌ పద్ధతిలో ఉంటుంది. ఓట్ల లెక్కింపులో పోలైన ఓట్లలో 50 శాతానికి మించి ఏ అభ్యర్థికి ముందుగా లభిస్తాయో వారినే విజేతగా ప్రకటిస్తారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒక్కో ఓటరు ఒక్కో అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాల్సి ఉండగా, శాసనమండలి పట్టభద్రుల ని యోజకవర్గాల ఎన్నికల్లో అందుకు భిన్నంగా ఓట్లువేసే విధానం అమలులో ఉండటం గమనార్హం.

ఎలిమినేషన్‌ పద్ధతిలో ఓట్ల లెక్కింపు

శాసనమండలి నియోజకవర్గాల్లో పోలైన ఓట్లలో 50 శాతం ఓట్లు దాటిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ ఏ అభ్యర్థికీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 50 శాతం ఓట్లు రాకపోతే ఎలిమినేషన్‌ పద్ధతిలో ఓట్లు లెక్కిస్తారు. తొలుత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో అందరి కంటే తక్కువ వచ్చిన వారిని రౌండ్ల వారీగా ఎలిమినేషన్‌ చేస్తూ ఓట్ల లెక్కింపు జరుపుతారు. ఎలిమినేట్‌ అయిన అభ్యర్థుల్లో 2, 3, 4, 5, 6వ తదితర ప్రాధాన్యత ఓట్లను పరిగణలోనికి తీసుకుంటూ ఏ అభ్యర్థి ప్రప్రథమంగా 50 ఓట్లు అధిగమిస్తే విజేతగా ప్రకటిస్తారు. ఏదైనా రౌండ్‌లో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు 50 శాతానికి పైగా ఓట్లు సాధిస్తే వారిలో ఆధిక్యత ప్రాతిపదికన విజేతను నిర్ణయిస్తారు. ఎలిమినేషన్‌ పద్ధతిలో చివరివరకు ఏ అభ్యర్థి కూడా 50 శాతం ఓట్లు అధిగమించకపోతే చివరికి మిగిలిన ఇరువురు అభ్యర్థుల్లో మెజారిటీ ఓట్లు పొందిన వారిని విజేతగా ప్రకటిస్తారు.

ఓట్ల లెక్కింపు విధానం..

శాసనమండలి నియోజకవర్గాల్లో పోలైన మొత్తం ఓట్లలో సగం కంటే ఒక్క ఓటు ఎక్కువగా వచ్చినా తొలి అభ్యర్థిని గెలుపొందినట్లుగా ప్రకటిస్తారు. ఉదాహరణకు నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గంలో ఎన్నికల్లో పోలైన వాటిలో చెల్లుబాటైనవి 7 వేల ఓట్లు ఉన్నాయనుకుంటే, వాటిలో గెలుపొందడానికి అభ్యర్థికి 3501ఓట్లు రావాల్సి వుంటుంది. సగం కంటే ఒక్క ఓటు అధికంగా వచ్చిన వారిని విజేతగా నిర్ణయిస్తారు. ఇందుకు తొలుత పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఏ ఒక్కరికి కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లలో 3501 ఓట్లు లభించకపోతే ఎలిమినేషన్‌ పద్ధతి ద్వారా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ క్రమంలో ఎలిమినేట్‌ అయ్యే అభ్యర్థికి లభించిన బ్యాలెట్‌ పత్రాల్లో ఇతర ప్రాధాన్యాలను పరిగణలోకి తీసుకుంటూ ఓట్ల లెక్కింపు జరుపుతారు. ఈ విధంగా జరిగే ఓట్ల లెక్కింపులో పోలైన ఓట్లలో సగానికి కంటే ఒక్క ఓటు అధికంగా లభించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.

ఓటేయడంలో వెనుకబాటు

ఓటు వేసే విషయంలో చదువుకున్నోళ్లు వెనుకబడుతున్నారనే ప్రచారం కూడా ఉంది. ఓటేయడంలో అన్నీ తెలుసుకుని కూడా తప్పు చేస్తున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు వేలసంఖ్యలో చెల్లని ఓట్లు వేయడం పలు సందర్భాల్లో నమోదైంది. గతంలో మెదక్ – నిజామాబాద్ – కరీంనగర్ – ఆదిలాబాద్ టీచర్ సెగ్మెంట్ లో 23, 214 ఓట్లుండగా 19,346 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 532 చెల్లని ఓట్లు పడ్డాయి. వరంగల్ – నల్గొండ – ఖమ్మం టీచర్ నియోజకవర్గంలో 20,888 ఓట్లుండగా 18,885 ఓట్లు పోలయ్యాయి. 858 చెల్లని ఓట్లు పడ్డాయి. అటు మెదక్ – నిజామాబాద్ – కరీంనగర్ – ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ సెగ్మెంట్‌లో 1,96,321 ఓట్లుండగా, 1,15,359 మంది ఓటేశారు. అత్యధికంగా 9,932 మంది ఓటు సరిగా వేయని కారణంగా వాటిని చెల్లనివిగా పరిగణించారు. ఒక్క ఓటుతో గెలుపోటములను ప్రభావితం చేసిన సందర్భాలున్నాయి. అలాంటిది వేలసంఖ్యలో ఓట్లు చెల్లుబాటు కాకపోవడం ప్రజాస్వామ్యంలో ఇబ్బందికరమైన పరిణామంగానే భావిస్తున్నారు. ఈసారి పట్టభద్రుల నియోజకవర్గాల్లో జరిగే ఓట్లు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో ప్రతి ఓటరూ జాగ్రత్తగా ఓటేయాల్సిందే.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..