95% మందికి అవి లేనేలేవట.. మంత్రి ఈటల వెల్లడి

by  |
95% మందికి అవి లేనేలేవట.. మంత్రి ఈటల వెల్లడి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కర్ఫ్యూ లేదా లాక్‌డౌన్ విధించే ఉద్దేశ్యం ప్రస్తుతానికి ప్రభుత్వానికి లేదని, అలాంటి పరిస్థితులు కూడా లేవని వైద్య మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కరోనాతో ఇక ఎప్పటికీ సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. కరోనా ఒక సాధారణ రోగంగా మారిపోయిందన్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న మాట వాస్తవమేనని, నియంత్రించడానికి ప్రభుత్వం తరఫున అన్ని చర్యలూ తీసుకుంటున్నామని తెలిపారు. కరోనా తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించి కొన్ని సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

గతంలో 85% మంది ఎలాంటి లక్షణాలు లేకుండా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యేవారని, కానీ ఇప్పుడు అది 95 శాతానికి చేరుకున్నదన్నారు. ఇప్పుడు కేసుల సంఖ్య పెరుగతున్నా ఎలాంటి లక్షణాలు ఉండడంలేదని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం కూడా చాలా తక్కువ అని అన్నారు. నిజామాబాద్ జిల్లాకు మహారాష్ట్రతో సరిహద్దు ఉన్నందున అక్కడి ద్వారా రాకపోకలు సాగించే వారితో వైరస్ మన రాష్ట్రంలోకి వస్తోందని, ఎక్కడికక్కడ పరీక్షలు చేస్తున్నామని వివరించారు.

టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్ విధానం ద్వారా వైరస్ వ్యాప్తి నిరోధానికి చర్యలు తీసుకుంటున్నామని, ట్రేసింగ్ కారణంగానే చాలా మందికి ముందుగానే పరీక్షలు నిర్వహించి పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే ఐసొలేట్ చేస్తున్నామని వివరించారు. ఇండ్లల్లో ఐసొలేషన్ సాధ్యంకానివారికి ప్రభుత్వమే ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటుచేసిందన్నారు. ఒకవేళ పాజిటివ్ పేషెంట్లలో ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం పెరిగినా దానికి తగినట్లుగా బెడ్‌ల సంఖ్యను కూడా పెంచుతున్నామన్నారు. రాష్ట్రంలోని 22 ప్రధాన ఆసుపత్రుల్లో 11 వేల ఆక్సిజన్ బెడ్‌లను సమకూర్చామని, లిక్విడ్ ఆక్సిజన్ సౌకర్యం లేని ఆసుపత్రులకు సిలిండర్లను సిద్ధం చేశామన్నారు. గతంలో ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష ద్వారా ఒక రోజు తర్వాత రిజల్టు వచ్చేదని, కానీ ఇప్పుడు రాపిడ్ టెస్టు ద్వారా ముందుగానే తెలుసుకోగలుగుతున్నామని, దానికి తగిన విధంగా వెంటనే జాగ్రత్తలు తీసుకోడానికి వీలవుతోందన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో సగటున 60 వేల వరకు కరోనా నిర్ధారణ పరీక్షలను చేస్తున్నామని, త్వరలో ఆ సంఖ్యను లక్షకు పెంచుతామన్నారు. మరోవైపు వ్యాక్సిన్ డోసుల సంఖ్యను కూడా ఒకటిన్నర లక్షలకు పెంచుతామన్నారు. ఏక కాలంలో కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్, ఇతర అనారోగ్య సమస్యలకు చికిత్స లాంటివి ప్రభుత్వాసుపత్రుల్లో జరిగేలా బహుముఖ వ్యూహాన్ని రూపొందించామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్నట్లు వివరించారు. అన్ని జిల్లాల్లో తాజా కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఐసొలేషన్ కేంద్రాలను కూడా నెలకొల్పినట్లు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులు సైతం కరోనా సాకుతో ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేయకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, వ్యాపార దృక్పథం వద్దని సూచించినట్లు తెలిపారు.

పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాల్సిందేనని మంత్రి ఈటల స్పష్టం చేశారు. భయపడాల్సిన పనిలేకపోయినా జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం తప్పనిసరి అని నొక్కిచెప్పారు. అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని సూచించారు. జనం గుమికూడే ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు.


Next Story