అత్తవారింటికి వెళ్లిన ఇంటి యజమాని.. ఉదయం వచ్చి చూసే సరికి..

102

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో దొంగలు హల్ చల్ చేశారు. తాళం వేసిన ఇంట్లో భారీ చోరీకి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని శ్రీ రామ్ నగర్ కాలనీకి చెందిన దొంతుల లింగం ఇంటికి తాళం వేసి అత్తగారి ఊరైన ఉగ్రవాయికి మంగళవారం వెళ్ళారు. తిరిగి బుధవారం ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెళ్ళి చూడగా ఇంట్లోని బీరువాలో గల సామగ్రి చిందరవందరంగా ఉండటం గమనించిన లింగం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి విచారణ చేపట్టారు. బాధితుడు మాట్లాడుతూ.. మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి అత్తగారింటికి వెళ్లానని, బుధవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉందని, ఇంట్లో బీరువలో ఉన్న 13 తులాల బంగారం, 8 తులాల వెండి, మూడు వేల నగదు దొంగలు ఎత్తుకెళ్లారని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.