భూమివైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. గంటకు 94 వేల కి.మీ. వేగం

by  |
asteroid
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ గ్రహశకలం భూమి సమీపానికి దూసుకొస్తున్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది. గంటకు 94 వేల కిలోమీటర్ల వేగంతో వస్తోందని తెలిపింది. ఈ గ్రహశకలం శనివారం భూమికి అత్యంత సమీపంగా వచ్చి వెళ్తుందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రస్తుతానికి దీనివల్ల ఎలాంటి హాని ఉండబోదని తెలిపింది. ఆ గ్రహశకలానికి ‘2016 ఏజే 193’ అని పేరును సూచించారు. ఈ శిల ప్రపంచంలోనే ఎత్తైన భవనం బూర్జ్ ఖలీఫా కంటే పెద్దది. తన కక్ష్యలో పరిభ్రమిస్తూ శకలం శనివారం భూమికి దగ్గరగా వచ్చి వెళ్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ సమయంలో ఆస్ట్రాయిడ్‌, భూమికి మధ్య ఉన్న దూరం.. పుడమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరంతో పోలిస్తే 9 రెట్లు ఎక్కువని అంచనా వేస్తున్నారు. 2063లో కూడా భూమికి దగ్గరగా వస్తుందని చెప్పారు.

2016 జనవరిలో హవాయ్‌లోని పాన్‌స్టార్స్‌ అబ్బర్వేటరీ సాయంతో ఈ గ్రహ శకలాన్ని తొలిసారిగా గుర్తించారు. ఈ శకలం చాలా చీకటిగా ఉందని, దీని నుంచి ఎక్కువ కాంతి పరావర్తనం చెందటం లేదని శాస్త్రవేత్తలు వివరించారు. ఇది 5.9 ఏళ్లకోసారి సూర్యుడిని చుట్టి వస్తుందని తెలిపారు. ఈ గ్రహశకలం 1.4 కిలోమీటర్ల వెడల్పున్నా గంటకు 94,208 కిలోమీటర్ల భారీ వేగంతో దూసుకొస్తుందన్నారు. దీని వల్ల మానవజాతికి ఎటువంటి ముప్పు ఉండబోదని నాసా శాస్త్రవేత్తలు భరోసా ఇచ్చారు. సౌర వ్యవస్థలోనే అత్యంత ప్రమాదకరమైన ఈ గ్రహశకలాన్ని పరిగణిస్తున్నారు. రాబోయే రెండు వందల ఏళ్లలో ఇది భూమిని తాకుతుందని అంచనా వేస్తున్నారు. ఇది ప్రతి ఆరేళ్లకు ఒకసారి భూమికి సమీపంగా వస్తుందని గుర్తించారు.


Next Story

Most Viewed