ఆ గ్రామాలకు హెచ్చరిక.. పులి సంచారం పై హై అలర్ట్..

by  |
ఆ గ్రామాలకు హెచ్చరిక.. పులి సంచారం పై హై అలర్ట్..
X

దిశ, ఖానాపూర్: వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం పాకాలలో పులి సంచారం ఆసక్తి రేకెత్తిస్తోంది. పాకాలలో పులి సంచరిస్తున్నదని సోమవారం చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురైన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం కొత్తగూడ మండలానికి చెందిన ఓ ఎంపీటీసీ భర్త పై దాడికి ప్రయత్నించిన నేపధ్యంలో డి.ఎఫ్.ఓ అర్పిత రంగంలోకి దిగారు. ఐదు బృందాలతో పాకాల అభయారణ్యంలో పులి ఆనవాళ్ల కోసం వెతికారు.

ప్రతీ ప్రదేశాన్ని జల్లెడ పడుతూ పులి కాలి అడుగుల ముద్ర, మల, మూత్ర విసర్జన ఆధారంగా పాకాల అభయారణ్యలో పులి ఉందని నిర్ధారించారు. జియో కోఆర్డినేట్స్ ద్వారా ఖచ్చితమైన ప్రదేశాన్ని అంచనా వేసి పాకాల ఒకటవ బీట్, అశోక్ నగర్ రెండవ బీట్ పరిధిలో పులి సంచారం ఉంది అని నిర్ధారించారు. అడవిలో నీటి మడుగులో, అలాగే సంగెం కాలువ పక్కన ఉన్న పొలాల్లో కూడా పులి తిరిగిన ఆనవాళ్లు గుర్తించారు.

ఖానాపూర్, కొత్తగూడ మండలంలో పాకాల అభయారణ్యం చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డి.ఎఫ్.ఓ అర్పణ తెలియజేశారు. పాకాల మీదుగా ప్రయాణం చేసేవారు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలన్నారు. ఇదిలా ఉండగా పులి రాత్రి వేళల్లో అరుస్తుందని దాని అరుపులు జత అయిన మరో పులి కోసమని, తన నుండి దూరమైన తోడు కోసం వెతుక్కుంటూ పులి తిరుగుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అసలు ఒక పులి ఉందా, రెండు పులులు ఉన్నాయా, రెండు ఉంటే, రెండోది ఎక్కడుంది, అనే చర్చ కూడా జనాల్లో ఆసక్తి రేపుతోంది. ఈ అన్వేషణ లో ఎఫ్.ఆర్.ఓ రమేష్, డి.ఆర్.ఓ ఇజాజ్, మోహన్ బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.


Next Story

Most Viewed