రష్యాలో చిక్కుకున్న విద్యార్థుల రాక 

by  |

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లి కోవిడ్ కారణంగా చిక్కుకుపోయిన విద్యార్థులు ఎట్టకేలకు జిల్లాకి చేరుకున్నారు. వివరాళ్లోకి వెళితే… మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజక‌వర్గం మిడ్జిల్ మండలం ధోనూరు, జడ్చర్ల మండలం కిష్టారం, నారాయణపేట జిల్లా చిన్నజట్రంకు చెందిన ముగ్గురు విద్యార్థులు మెడిసిన్ చదవడానికి రష్యా వెళ్లారు. అయితే కరోనా వైరస్ కారణంగా వారు రష్యాలో చిక్కుకున్నారు. స్వదేశం వచ్చేందుకు వారు విశ్వ ప్రయత్నాలు చేసారు. చివరకు ఈ విషయం జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్మా రెడ్డి దృష్టికి వెళ్లగా ఆయన వెంటనే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఆ ముగ్గురు విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రయత్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ముగ్గురు విద్యార్థులను క్షేమంగా దేశానికి తెచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ ముగ్గురు విద్యార్థులు ముందుగా రాజస్థాన్ చేరుకుని 14 రోజులు క్వారంటైన్‌లో ఉన్నారు. అనంతరం వీరిని సొంత గ్రామాలకు రప్పించేందుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ద్వారా జిల్లా కలెక్టర్ రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి వారి రాకకు అవసరమైన ఏర్పాట్లను చేశారు. విద్యార్థులు జిల్లాకు చేరిన తర్వాత అవసరమైన కరోనా టెస్టులను నిర్వహించి వారిని మరో 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీ మేరకు వారిని జిల్లాకు పంపారు. జిల్లా కలెక్టర్, జడ్చర్ల ఎమ్మెల్యేల చొరవకు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


Next Story

Most Viewed