14 ఏళ్ల బాలికపట్ల దారుణం.. అతికించిన ఎముకను మళ్లీ విరగ్గొట్టిన డాక్టర్

by Naga Rani Yarlagadda |

వైద్యో నారాయణో హరిః.. అంటే.. వైద్యం చేసే వ్యక్తి దేవుడితో సమానమంటారు. కానీ.. ఆ వైద్యుడే ఓ బాలికపట్ల దారుణంగా ప్రవర్తించాడు.

14 ఏళ్ల బాలికపట్ల దారుణం.. అతికించిన ఎముకను మళ్లీ విరగ్గొట్టిన డాక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: వైద్యో నారాయణో హరిః.. అంటే.. వైద్యం చేసే వ్యక్తి దేవుడితో సమానమంటారు. కానీ.. ఆ వైద్యుడే ఓ బాలికపట్ల దారుణంగా ప్రవర్తించాడు. ప్రభుత్వ వైద్యుడిగా ఉండి.. తనకు లంచం ఇవ్వలేదన్న కోపంతో ఓ బాలికకు అతికించిన ఎముకని మళ్లీ తానే విరగ్గొట్టాడు. ఈ దారుణ ఉదంతం ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్లో వెలుగుచూసింది. ఆ డాక్టర్ చేసిన పనికి మానసిక వికలాంగురాలైన బాలిక జీవితం మరింత నరకప్రాయమవ్వగా.. న్యాయం చేయాలని ఆ తల్లి కలెక్టరేట్ మెట్లెక్కింది.

లంచం ఇవ్వలేదని రాక్షసత్వం

ముజఫర్ నగర్ కు చెందిన రేష్మా భర్తను కోల్పోయింది. 14 ఏళ్ల మానసిక వికలాంగురాలైన కూతురితో జీవిస్తోంది. 45 రోజుల క్రితం బాలిక కుడికాలి ఎముక విరగడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. కాలికి ఆపరేషన్ చేయాలంటే రూ.25000 ఖర్చవుతుందని అక్కడ సిబ్బంది తెలిపారు. అంత ఖర్చు భరించలేనని ఎంత చెప్పినా వినలేదు. చివరికి జిల్లా కలెక్టర్ కు తన గోడునుమొరపెట్టుకోగా.. ఉచితవైద్యం అందించాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ను కలెక్టర్ ఆదేశించారు. అయినా అక్కడి వైద్యుడు, సిబ్బందిలో మార్పు రాలేదు. ఉచిత వైద్యం చేస్తామని చెప్పి.. రూ.8000 వసూలు చేశారు. మిగతా డబ్బు కూడా త్వరగా కట్టాలని డిమాండ్ చేశారు.

ఆపరేషన్ పూర్తయిన కొన్ని రోజుల తర్వాత.. మోకాలు ఫ్లెక్సిబిలిటీ కోసం చెకప్ కు రావాలని వైద్యులు చెప్పడంతో.. మళ్లీ ఆస్పత్రికి వెళ్లారు. పాపకు ఆపరేషన్ చేసిన డాక్టర్ చతుర్వేది.. మిగతా డబ్బుకోసం రాక్షసంగా ప్రవర్తించాడు. బాలిక కాలి మోకాళ్లను బలవంతంగా మడిచి.. అతికించిన ఎముకను మళ్లీ విరగ్గొట్టాడు. దీంతో బాలిక నొప్పితో విలవిలలాడింది. ఆ తర్వాత వారిని తరిమేశాడు. బయట ప్రైవేట్ గా ఎక్స్ రే తీయించి చూడగా.. ఆపరేషన్ చేసిన కాలి ఎముక మళ్లీ విరిగినట్లు తేలింది. దీనిపై రేష్మా ఆసుపత్రిలోని పెద్ద డాక్టర్లకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దాంతో చేసేదేమీ లేక తన వికలాంగ కూతురిని ఎత్తుకుని కలెక్టరేట్ వద్దకు వచ్చి న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ వ్యవహారంపై ముజఫర్‌నగర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎమ్‌ఓ) సునీల్ తివాతియా స్పందించారు. డాక్టర్ల వాదన వినకుండా ఇప్పుడే ఏమీ చెప్పలేమని, అయితే ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. విచారణలో ఆసుపత్రి సిబ్బంది లేదా డాక్టర్ తప్పు చేసినట్లు రుజువైతే, వారిపై కఠినమైన చట్టపరమైన, పరిపాలనాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Next Story