వికారాబాద్ కల్తీ కల్లు వెనుక రహస్యం

by  |
వికారాబాద్ కల్తీ కల్లు వెనుక రహస్యం
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: కృత్రిమ కల్లులో నిషానిచ్చే డై క్లోరోఫామే వికారాబాద్ జిల్లాలో ఇద్దరి మృతి, 304 మంది అస్వస్థతకు కారణమైంది. అయితే ఆ పౌడర్ ఎక్కువ అయినందుకు కాదు.. తక్కువ మోతాదు కలపడంతోనే వారంతా ఆగమయ్యారు. బాధితులను వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఆరోగ్య పరీక్షలు చేయడంతో అసలు విషయం తెలిసింది. ఈ విషయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసినా.. ముమ్మాటికీ నిజమే. బాధితుల టెస్ట్ రిపోర్టును బహిర్గతం చేయకుండా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఎక్సైజ్ శాఖాధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. వ్యాపారులు ఒక రోజు డై క్లోరోఫామ్ ఎక్కువ..మరోసారి తక్కువగా వాడడం వల్లే తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

సహజంగా తాటి, ఈత చెట్లతోనే స్వచ్ఛమైన కల్లు లభిస్తుంది. తాటి, ఈత చెట్లు తగినన్నీ లేకపోవడంతో కృత్రిమ కల్లుకు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఇటీవల వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు తాగి ఇద్దరు మృతి చెందగా, 304 మంది అస్వస్థతకు గురై నారు. బాధితులను వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఆరోగ్య పరీక్షలు చే యడంతో అసలు విషయం బయటపడింది.డై క్లోరోఫాం శాతం తగ్గటమే కారణమని సమాచారం. కంపౌండు కల్లుకు అలవాటు పడిన వ్యక్తులకు నిత్యం అదే శాతం కిక్కుతో మత్తు ఉండాల్సిందే. లేకపోతే పిచ్చి పిచ్చిగా చేయడం, ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. బాధితుల ఆరో గ్య పరీక్షల రిపోర్టును బహిర్గతం చేయకుండా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఎక్సైజ్ శాఖాధికారులు దాచిపెడుతున్నట్లు సమాచారం. ఇంత మంది ప్రాణాలతో చెలగాటమాడిన కల్తీ కల్లు వ్యాపారులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం, ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

ఎక్సైజ్ శాఖాధికారుల మద్దతుతోనే…

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎన్ని ఈత, తాటి చెట్లు ఉన్నాయి. ఎంత కల్లు ఉత్పత్తి అవుతుందనే వివరా లు లేకుండానే ఎక్సైజ్ అధికారుల పని చేస్తున్నారు. కల్లు కంపౌండ్ వ్యాపారులు రోజుకు ఎంత వ్యాపా రం చేస్తున్నారనే లెక్కలు కూడా లేవు. ఉమ్మడి రం గారెడ్డి జిల్లాలో ఈత, తాటీ చెట్లు కంపౌడు నిర్వ హించే స్థాయిలో కల్లు రావడం లేదనే జగమెరిగిన సత్యం. ఇది అధికారులకు తెలుసు. అలాంటప్పుడు కల్లు కంపౌండ్లు ఎలా నడుస్తున్నాయని ఆరా తీస్తే ఎక్సైజ్ అధికారుల బాగోతం బయటపడింది. తమకే తెలియనట్లుగా ఎక్సైజ్, పోలీసులు కలిసి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మత్తు పదార్థాల సరఫరాకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ వ్యాపారులకు అధికార పార్టీ నేతలు, ఎక్సైజ్, పోలీస్ అధికారులకు మామూళ్లు ఇస్తూ తమ పనులను చక్కబెట్టుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలో జరిగే కల్లు కంపౌండ్లు పక్క రాష్ట్రానికి చెందిన ప్రముఖ నాయకుడి దగ్గర మనిషి ఒకరు, అదేవిధంగా తెలంగాణలోని అధికార పార్టీకి చెందిన అనుచరుడు సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తిగా ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. ఈ కల్తీ కల్లు తయారీకి వీరే అసలు కారకులైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కల్తీ కల్లు దుకాణాలు పెద్ద పెద్ద నాయకులవి కావడంతోనే ఎక్సైజ్ అధికారులు చూసిచూడనట్లు వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. జరిగిన సంఘటనల గురించి అధికారులను తెలుసుకునే ప్రయత్నం చేసిన అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.

నిబంధనలకు విరుద్ధంగా లైసెన్స్..

ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం కల్లుగీత కార్మికులకు లైసెన్స్ ఇవ్వాలి. అయితే కొంత మంది పలుకుబడిని ఉపయోగించి లైసెన్స్ తీసుకోని ఇతరులకు అమ్మకుంటున్నారు. దీంతో ఆ వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారు. ఓ కల్లు దుకాణం లైసెన్స్ దా రులందరూ కలిసి ఏర్పాటు చేసుకుంటారు. వారు తాటి, ఈత చెట్ల ద్వారా తెచ్చే స్వచ్ఛ మైన కల్లును విక్రయించాలి. కానీ వీరంతా ఓ గుత్తేదారుడిని ఎన్నుకొని, అతని వద్ద ఇంతో అంతా తీసుకొని ఆ దుకాణం వదిలేస్తారు. అప్పుడు ఆ వ్యాపారికి మద్యం ప్రియులకు అవసరమైన కల్లు లేకపోవడంతో కల్తీకి అలవాటు చేస్తున్నారు. ఒక గ్రామానికి లైసెన్సు తీసుకుని నాలుగైదు కల్లుదుకాణాలు నిర్వహిస్తున్నారు. కానీ.. ఒక దుకాణానికి మాత్రమే ఫీజులు చెల్లిస్తారు.

కిక్కు కోసం అల్ప్రజోం ..

కొందరు నిషేధిత డైజోఫాం, అల్ఫజోలం వంటి మత్తు పదార్థాలు కలుపుతూ ప్రజలకు కిక్కు పెంచి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కరోజు తాగకపోయినా వారు పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తుంటారు. ఇటీవల జరిగిన సంఘటన కూడా అదేనని తెలుస్తోంది. రోజు తాగే కల్లులో ఉండే మత్తు పదార్థాల శాతం తగ్గడంతోనే ఆస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.


Next Story