కట్.. కట్.. సెన్సార్ అడ్డంకి దాటేదెలా?

by  |
కట్.. కట్..  సెన్సార్ అడ్డంకి దాటేదెలా?
X

దిశ, ఫీచర్స్ : ‘సినిమా’ అంటే జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ కాదు.. అంతకుమించి! సినిమా ప్రభావం కేవలం వ్యక్తుల మీదే కాదు.. సమాజంపైనా ఉంటుంది. ఆత్మకథలు, వాస్తవ సంఘటనలు, చట్టాలు, స్పోర్ట్స్ డ్రామా, పాలిటిక్స్, డ్రగ్స్, మాఫియా.. ఇలా ఏ ఇతివృత్తంతోనైనా సినిమా తీసే అవకాశం దర్శకుడికి ఉంటుంది. సినిమాల్లో చూపించిన సన్నివేశాలతో పాటు హింసాత్మక ఘటనలు, అడల్డ్ కంటెంట్ తదితర అంశాలను ప్రమాణంగా తీసుకుని, ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్‌సీ)’ ఆయా సినిమాలకు సర్టిఫికెట్ ఇస్తుంది. అయితే గతంలో సీబీఎఫ్‌సీ నిర్ణయాలు నచ్చకుంటే లేదంటే తమ సినిమాను రద్దు చేస్తే.. సదరు నిర్మాతలు ఆ ప్రకటనను చాలెంజ్ చేస్తూ ఫిల్మ్ సర్టిఫికెట్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎఫ్‌సీఏటీ)‌‌ను ఆశ్రయించేవాళ్లు. కానీ ‘ది ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ ఆర్డినెన్స్ 2021’ ప్రకారం ప్రభుత్వం తాజాగా ‘ఎఫ్‌సీఏటీ’ని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఏ సినిమాలకు ఎలాంటి సర్టిఫికెట్స్ అందిస్తారు? సినిమాపై బ్యాన్ విధిస్తే ఎవరిని ఆశ్రయించాలి? ఆ కథాకమామీషు తెలుసుకుందాం.

బంగారానికి హాల్‌మార్క్, ప్రొడక్ట్స్‌కు ‘బీఎస్ఐ’ స్టాండర్డ్ సింబల్ తప్పనిసరి. అలానే దర్శకధీరుడు రాజమౌళి చిత్రంపై ‘రాజముద్ర’ ఉన్నా గానీ ఆ చిత్రం విడుదల కావాలంటే మాత్రం సెన్సార్ సింబల్ ఉండాల్సిందే. ఆ చిత్రమనే కాదు.. భారతదేశంలో ఏ సినిమాకైనా థియేటర్లలో విడుదల కావాలన్నా, టెలివిజన్‌లో ప్రసారం చేయాలన్నా లేదా బహిరంగంగా ప్రదర్శించాలన్నా సీబీఎఫ్‌సీ(CBFC) సర్టిఫికెట్ ఉండాల్సిందే. ఉదాహరణకు ‘వకీల్ సాబ్, వైల్డ్ డాగ్’ సినిమాలకు సీబీఎఫ్‌సీ యూ/ఏ సర్టిఫికెట్ అందించింది. అయితే సెన్సార్ బోర్డు ప్రధానంగా నాలుగు భాగాలుగా సినిమాలను ధృవీకరిస్తుంది. చైర్‌పర్సన్‌తో పాటు 23 మంది సభ్యులుండే ఈ కమిటీని భారత ప్రభుత్వమే నియమిస్తుంది.

యూ : బహిరంగంగా ప్రదర్శించే అవకాశం (అన్‌రిస్ట్రిక్టెడ్ పబ్లిక్ ఎగ్జిబిషన్- సూటబుల్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్)
యూ/ఏ : 12 ఏళ్లలోపు పిల్లలకు తల్లిదండ్రుల మార్గదర్శకత్వంతో చూసే అవకాశం
ఏ : రిస్ట్రిక్టెడ్ టు అడల్డ్స్ (సూటబుల్ ఫర్ 18 ఇయర్స్ అండ్ అబౌవ్)
ఎస్ : ఇంజనీర్లు, వైద్యులు లేదా శాస్త్రవేత్తలు వంటి ప్రత్యేక వ్యక్తుల సమూహానికి పరిమితం.
సీబీఎఫ్‌సీ ఓ సినిమా ధృవీకరణను కూడా తిరస్కరించవచ్చు. అయితే గతంలో ఏదేని చిత్ర దర్శకుడు లేదా నిర్మాత సీబీఎఫ్‌సీ సర్టిఫికేషన్‌తో సంతృప్తి చెందకపోయినా లేదా తిరస్కరించాలనుకున్న సందర్భాల్లో ఎఫ్‌సీఏటీ(FCAT)కి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు CBFC నిర్ణయాన్ని FCAT పున:పరిశీలించి అనేకసార్లు తప్పుబట్టిన దాఖలాలున్నాయి.

కీ డెసిషన్స్ :
లిప్‌స్టిక్ అండర్ మై బుర్కా(2016) :
ఇది ‘లేడీ-ఓరియెంటెడ్’ మూవీ అనే కారణంతో.. 2017లో సీబీఎఫ్‌సీ ఈ సినిమాకు సర్టిఫికేషన్ ఇవ్వడానికి నిరాకరించింది. ఆ సమయంలో కమిటీ చైర్‌పర్సన్‌గా పహ్లాజ్ నిహలానీ ఉండగా, దర్శకురాలు అలంకృత శ్రీవాస్తవ ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎఫ్‌సీఏటీకి విజ్ఞప్తి చేసింది. దీంతో అన్ని అంశాలను పరిశీలించిన ఎఫ్‌సీఏటీ.. కొన్ని సన్నివేశాలను కత్తిరించి ‘ఎ’ సర్టిఫికెట్‌తో చిత్రాన్ని విడుదల చేసేందుకు అనుమతించింది.

ద మెసెంజర్ ఆఫ్ గాడ్ :
ఎమ్‌ఎస్‌జీ చిత్రంలో డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ నటించారు. ఈ మూవీకి సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్ నిరాకరించగా, ఎఫ్‌సీఏటీ చిత్ర విడుదలకు అనుమతిచ్చింది. మెసెంజర్ ఆఫ్ గాడ్ చిత్రానికి క్లియరెన్స్ ఇచ్చే విషయంలో కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ, సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు(సీఎఫ్‌బీసీ) మధ్య వివాదం తలెత్తగా, సెన్సార్ బోర్డ్ చైర్‌పర్సన్ లీలా శ్యామ్‌సన్‌తో పాటు సెన్సార్ బోర్డులోని 9మంది రాజీనామా చేయడం గమనార్హం.

ఇక 2015లో వచ్చిన ‘హారామ్‌కోర్’, 2018లోని ‘కాలాకండి’, 2016లో ఉడ్తా పంజాబ్’ చిత్రాల విషయంలోనూ సెన్సార్ బోర్డ్ నిర్ణయాలను తోసిపుచ్చిన ఎఫ్‌సీఏటీ.. ఆయా సినిమాల రిలీజ్‌‌కు పర్మిషన్ ఇచ్చింది. ఇలా చిత్ర నిర్మాతలకు, సెన్సార్‌కు మధ్య తలెత్తిన వివాదాలను ట్రిబ్యునల్ పరిష్కరిస్తూ వస్తోంది. తాజాగా ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేయడంతో.. ఇకపై నిర్మాతలు సెన్సార్ నిర్ణయాన్ని సవాల్ చేయాలంటే.. నేరుగా ‘హైకోర్టు’లోనే అప్పీల్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం ట్రిబ్యునల్ రద్దు చేయడం పట్ల ఫిల్మ్ మేకర్స్, ప్రొడ్యూసర్స్ ఖండిస్తున్నారు. ‘ఇది చాలా విచారకరమైన రోజు’ అని చిత్ర నిర్మాత విశాల్ భరద్వాజ్ ట్వీట్ చేయగా.. ‘ఫిల్మ్ సర్టిఫికేషన్ గ్రీవెన్సెస్ పరిష్కరించడానికి హైకోర్టులకు చాలినంత సమయం ఉందా? ఎంతమంది సినీ నిర్మాతలు కోర్టులను ఆశ్రయించగలరు? FCAT నిలిపివేత ఏకపక్షంగా అనిపిస్తోంది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాలి? ఇది చాలా దురదృష్టకర నిర్ణయం’ అంటూ డైరెక్టర్ హన్సల్ మెహతా ట్వీట్ చేశాడు.

ద ట్రిబ్యునల్ :
సినిమాటోగ్రాఫ్ చట్టం – 1952లోని సెక్షన్ 5డీ కింద 1983లో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక చట్టబద్ధమైన సంస్థ ‘ఎఫ్‌సీఏటీ’. సినిమాటోగ్రాఫ్ చట్టం సెక్షన్ 5సీ కింద దాఖలు చేసిన అప్పీళ్లను పరిశీలించడం ఈ ట్రిబ్యునల్ ప్రధాన పని. ఈ ట్రిబ్యునల్‌కు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. భారత ప్రభుత్వం నియమించిన కార్యదర్శితో సహా మరో నలుగురు సభ్యులుండే ట్రిబ్యునల్ ప్రధాన కార్యాలయం న్యూ ఢిల్లీలో ఉంది.

ఇప్పటికీ విడుదలకాని సినిమాలు :
స్ట్రాంగ్ బోల్డ్ లాంగ్వేజ్, వల్గర్ సీన్స్, జెండర్ టాబూస్, కాశ్మీర్ సమస్యలు, మతం వంటి అంశాల ఇతివృత్తంగా రూపొందిన కొన్ని చిత్రాలు ఇంతవరకు థియేటర్‌లో విడుదల కాలేదు. సెన్సార్ బోర్డు ఆయా సినిమాలపై పూర్తిస్థాయి నిషేధం విధించింది. ఆ జాబితాలో.. ‘బండిట్ క్వీన్, ఫైర్, కామసూత్ర, యూఆర్‌ఎఫ్ ప్రొఫెసర్, ద పింక్ మిర్రర్, పాంచ్, బ్లాక్ ఫ్రైడే, పర్జానియా, సిన్స్, వాటర్, ఫిరాఖ్, గాండూ, ఇన్షా అల్లాహ్ ఫుట్‌బాల్, డేజెడ్ ఇన్ డూన్, అన్‌ఫ్రీడమ్’ చిత్రాలున్నాయి.


Next Story

Most Viewed