భయానకం.. రైల్వే ట్రాక్‌పై వాహన ప్రయాణం

by  |
భయానకం.. రైల్వే ట్రాక్‌పై వాహన ప్రయాణం
X

దిశ ప్రతినిది, మహబూబ్ నగర్: గత రాత్రి కురిసిన వర్షం కారణంగా పలు చోట్ల చెరువులు నిండుకుండాలను తలపిస్తున్నాయి. ఫలితంగా చాలా గ్రామంలో అలుగులు పారడంతో వాగులు, వంకలు పారుతున్నాయి. కొన్ని చోట్ల మాత్రం గ్రామాలకు రాకపోకలు కూడా స్తంభించిపోవడం జరిగింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని వెంకటాయపల్లి గ్రామానికి చెందిన వాగులు కూడా పొంగడంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే ఇదే గ్రామం నుండి వెళ్లాల్సిన గద్దెగూడెం గ్రామానికి కూడా రాకపోకలు స్తంభించాయి. గతంలో ఉన్న రహదారిపై రైల్వే అధికారులు అండర్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టి సంవత్సరం అవుతున్నా ఇంతవరకు పనులు పూర్తి చేయకపోవడం గ్రామాల ప్రజలకు శాపంగా మారింది. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం నుండే అధికారుల దృష్టికి విషయాన్ని ప్రజలు తీసుకుపోయిన కూడా అధికారులు పట్టించుకోలేదు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ కూడా పనులు మందకొడిగా సాగించడం వల్ల కూడా ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం బ్రిడ్జి క్రింద సుమారు 10 అడుగుల మేర నీరు వచ్చి చేరడంతో పరిస్థితి దారుణంగా మారింది. అలాగే పక్కనే వేసిన ప్రత్యామ్నాయ మార్గం కూడా తేలికపాటి వర్షానికే రెండు అడుగుల మేర గుంతలు పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారుతుంది. అయితే ఈ మార్గంలో కూడా మరో రైల్వే అండర్ బ్రిడ్జి ఉన్నా అక్కడ రాత్రి కురిసిన వర్షం కారణంగా వాగు నీరు పెద్దఎత్తున పొర్లుతోంది. దీంతో ప్రస్తుతం అక్కడి నుండి కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర అవసరాలు ఉన్న కొంత మంది రైల్వే ట్రాక్ పై నుండి దేవరకద్ర వరకు కాలినడకను ఆశ్రయించాల్సి వస్తుంది. మరికొంతమంది ప్రమాదకరంగా ట్రాక్ పై వాహనాలు నడుపుతూ వెళుతూన్నారు. అదే సమయంలో ఈ బ్రిడ్జి నిర్మాణం పనుల కోసం ఎక్కడికక్కడ మట్టి పోయడంతో నీరు మొత్తం పంటపొలాల్లోకి వచ్చి చేరుతుంది. ఇప్పటికే ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్న పరిసర ప్రాంతాల రైతుల పంటపొలాలు పూర్తిగా నీటమునిగాయి. దీని వల్ల తమ పంటలు పూర్తిగా దెబ్బతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే గ్రామానికి రాకపోకలు పునరుద్ధరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Next Story

Most Viewed