కట్నంగా తాబేలు, నల్ల కుక్కను ఇవ్వలేదని పెళ్లిరద్దు.. వధువు ఏం చేసిందంటే..?

by  |
కట్నంగా తాబేలు, నల్ల కుక్కను ఇవ్వలేదని పెళ్లిరద్దు.. వధువు ఏం చేసిందంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: కట్నం అడిగిన వాడు గాడిద అయితే.. ఇలా కట్నం పేరుతో అడ్డమైన కోరికలు అడిగిన ఈ వరుడు అడ్డగాడిదతో సమానమంటున్నారు నెటిజన్లు. కట్నం తీసుకోవడమే తప్పు అయితే.. ఆ కట్నం కింద ఒక తాబేలు, ఒక నల్ల కుక్క కావాలని డిమాండ్ చేసి, వధువు తరుపువారిని బెదిరించి పెళ్లిని క్యాన్సిల్ చేసి రచ్చరచ్చ చేశాడు ఓ వరుడు. ఇక దీంతో వరుడు గోల తట్టుకోలేక వధువు తరుపువారు పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వింత ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. రామనగర్ ప్రాంతానికి చెందిన ఒక జంటకు ఈ ఏడాది ఫిబ్రవరి 10న రామనగర్ ఓ నిశ్చితార్థం జరిగింది. యువతి కుటుంబం నిశ్చితార్థానికి ముందే కట్నం కింద 2 లక్షల నగదు, 10 గ్రాముల బంగారం సమర్పించారు. అప్పటివరకు బాగానే ఉంది. ఆ తరువాత వరుడు కుటుంబం గొంతెమ్మ కోరికలు బయటపడ్డాయి. వరకట్నం ఇంకా ఎక్కువ కావాలని, అందులో భాగంగా 21 గోళ్ళతో ఒక తాబేలు, ఒక నల్ల లాబ్రడార్ కుక్క, బుద్ధ విగ్రహం, సమై లాంప్ స్టాండ్‌తో పాటు రూ .10 లక్షలు డిమాండ్ చేశారు.

ఈ వింత కోరికలను విన్న వధువు కుటుంబం షాక్ గురయ్యింది. అలాంటివి తేవడం తమ వల్లకాదని, ఇంకేమైనా కోరాలని కోరారు. అయినా వరుడు వారి మాట వినలేదు. తనకు ఇవి మాత్రమే కావాలని, ఇవి ఇస్తేనే వధువును వివాహమాడతానని తెగేసి చెప్పడమే కాకుండా వివాహం రద్దు చేసుకొని మరీ వెళ్లిపోయారు. ఇక తన కూతురు జీవితం నాశనం చేసినందుకు వరుడిపై, వధువు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో ఈ ఘటన బయటకొచ్చింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.



Next Story

Most Viewed