కనీస వేతనాలు పట్టవా !

by  |
కనీస వేతనాలు పట్టవా !
X

దిశ, ఏపీ బ్యూరో : ఓ ప్రైవేటు కంపెనీ కనీస వేతనాలు ఇవ్వకుంటే కార్మిక శాఖకు ఫిర్యాదు చేస్తాం. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి సంస్థ దగ్గరుండి ఇలా మానవ వనరులను నిలువు దోపిడీ చేయిస్తుంటే మరెవరికి చెప్పుకోవాలి ! నిత్యం పెరుగుతున్న ధరలతో సగటు పౌరుడు బతకాలంటే ఎంత ఖర్చువుతుందో ప్రభుత్వ పెద్దలకు తెలియదా ! తెలిసే ఇలా కార్పొరేట్​కంపెనీలకు యువశక్తిని ధారాదత్తం చేస్తున్నారా ! కార్పొరేట్​కంపెనీల లాభాల కోసం చౌకగా మానవ వనరులను దోచి పెట్టడానికి కావాలనే నిరుద్యోగాన్ని పెంచుతున్నార అన్నట్లు కనిపిస్తోంది. ఇదే రాష్ట్రంలోని యువతను నిరాశ నిస్పృహల్లోకి నెడుతోంది.

ఇటీవల తిరుపతిలోని వాల్​మార్ట్​సంస్థలో పనిచేసేందుకు ఏటా రూ.1.21 లక్షల ప్యాకేజీతో ఇంటర్​నుంచి డిగ్రీ చదివిన యువకులు కావాలని ప్రకటన ఇచ్చింది. అది కూడా ఏపీఎస్​ఎస్​డీసీ ద్వారానే. ఒంగోలులోని మోర్​రిటైల్​చైన్ షాపుల్లో పనిచేసేందుకు టెన్త్​నుంచి డిగ్రీ చదివిన యువత కావాలని ఏపీఎస్​ఎస్​డీసీ మరో ప్రకటన ఇచ్చింది. ఇక్కడ కూడా నెల వేతనం రూ.11,541. కనీస వేతన చట్టం ప్రకారం అన్​స్కిల్డ్​వర్కర్స్​కు నెలకు రూ.6,700తోపాటు డీఏ ఇవ్వాలి. మొత్తం కలుపుకుంటే ప్రస్తుతం ఈ కంపెనీలు ప్రకటించిన వేతనాలకు సరిపోతుంది.

వాస్తవానికి ఈ చట్టం ఉమ్మడి రాష్ర్టంలో కిరణ్​కుమార్​రెడ్డి హయాంలో తీసుకొచ్చారు. అంటే దాదాపు తొమ్మిదేళ్లవుతుంది. దీనికొక కమిటీ వేయాలి. ప్రతీ రెండేళ్లకోసారి సమీక్షించాలి. పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో పోల్చి వేతనాల పెంపునకు కమిటీ సిఫారసు చేయాలి. ఆ ప్రక్రియ ఇంతవరకు నోచుకోలేదు. గత ప్రభుత్వ హయాంలో టీఎన్​టీయూసీకి చెందిన రామ్మోహనరావు కమిటీని ఎన్నికలకు ముందు హడావుడిగా వేశారు. ఆయన కమిటీ ఒక్క సిఫారసు చేయలేదు. ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చి 21 నెలలవుతోంది. కనీసం ఈ ప్రభుత్వం కూడా కనీస వేతనాల గురించి పట్టించుకోలేదు.



Next Story

Most Viewed