ముందుకు 'సాగు'తోన్నది

by  |
ముందుకు సాగుతోన్నది
X

దిశ, నల్లగొండ: వానాకాలం పంటల సాగుకు వ్యవసాయ శాఖ సర్వం సిద్ధం చేస్తోన్నది. ఏటా కోటి ఆశలతో పంటలను సాగు చేసే రైతాంగానికి ఈ యేడైనా కలిసి వస్తుందో లేదో చూడాలి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18.61 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గతేడాది వానాకాలం సీజనులో వరుణుడు సకాలంలో కరుణించడం చెరువులు, కుంటలు ఆశించిన మేర నిండటంతో రైతులకు కాస్తంత ఉపశమనం లభించింది. పంటల సాగు ఆశించిన మేర ఉన్నా పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతుల శ్రమంతా వృథానే అయ్యింది. అయితే, ఈసారి సీఎం కేసీఆర్ ప్రభుత్వం చెప్పిన పంటలను సాగు చేస్తేనే సంక్షేమ పథకాలు వర్తిస్తాయంటూ షరతు పెట్టడం రైతులను కలవరపరుస్తోన్నది. రైతన్నకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తోన్నది.

సూర్యాపేట జిల్లాలో..

సూర్యాపేట జిల్లాలో 6,48,125 ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గతేడాది వానాకాలం సీజనులో 4.5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఈ సీజన్‌లో జిల్లాలో 3,82,500 ఎకరాల్లో వరి పంట అధికంగా సాగవుతుందని అధికారులు చెబుతున్నారు. పత్తి విషయానికొస్తే.. 1,62,500 ఎకరాలతో రెండో స్థానంలో నిలవనుంది. వానాకాలం సీజనులో కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలు కృష్ణపట్టే ప్రాంతం కావడంతో వరిపంట భారీగా సాగు చేశారు. జిల్లాలో 6.48 లక్షల ఎకరాల్లో సాగయ్యే పంటల కోసం 13,872 టన్నుల యూరియా, 8397 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 1280 టన్నుల డీఏపీ బఫర్ స్టాక్ అందుబాటులో ఉంచారు. వీటికి తోడు 2,184 క్వింటాళ్ల జిగురు విత్తనాలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో అందుబాటులో ఉంచారు. సూర్యాపేట జిల్లాలో మిర్చి 15 వేల ఎకరాల్లో పండించనున్నారని అంచనా.

యాదాద్రి జిల్లాలో..

యాదాద్రి-భువనగిరి జిల్లాలో వానాకాలం 3.54 లక్షల ఎకరాల్లో పంటల సాగు అవుతుందని అంచనా. ఇందులో 1,91,425 ఎకరాల్లో పత్తి, వరి 1,36,980 ఎకరాల్లో, మొక్కజొన్న 3,320 ఎకరాలు, 1,660 ఎకరాల్లో జొన్న, 29,085 ఎకరాల్లో పప్పుదినుసులు, నూనె గింజలు 401 ఎకరాలు, తృణ ధాన్యాలు 600 ఎకరాల్లో సాగవుతుందని అధికారుల అంచనా. పత్తిపంటకు 3,82,850 విత్తన ప్యాకెట్లు, వరి, మొక్కజొన్న, జొన్న 38,210 క్వింటాళ్లు, వరి 34,245 క్వింటాళ్లు, జొన్న 100 క్వింటాళ్లు, మొక్కజొన్న 640 క్వింటాళ్లు, పప్పు దినుసులు 1,725 క్వింటాళ్లు, ఇతర పంటలకు 1,500 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పంటల సాగుకు 53,233 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరంగా భావించారు. ప్రస్తుత జిల్లాలో 10,331 మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయి.

నల్లగొండ జిల్లాలో..

నల్లగొండ జిల్లాలో 11.25 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా. ఇందులో 6,97,500 ఎకరాల్లో పత్తి, 3.30 లక్షల ఎకరాల్లో వరి, 20 వేల ఎకరాల్లో కంది, పెసర పంటలు, మరో 3 వేల ఎకరాల్లో నూనె ఉత్పత్తుల పంటలు సాగు కానున్నాయి. అందుకు సంబంధించి విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. డీఏపీ 36,126 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 65,594 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 28,385 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 14,455 మెట్రిక్ టన్నుల ఎరువులు కావాల్సి ఉంది. కాగా ఇప్పటివరకు అన్ని ఎరువులు కలిపి 27,046 మెట్రిక్ టన్నులు మాత్రమే సిద్ధంగా ఉన్నాయి. విత్తనాల విషయానికొస్తే.. 13.90 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు, 85 వేల క్వింటాళ్ల వరి అందుబాటులో ఉంచనున్నారు.


Next Story

Most Viewed