జిల్లాలో ఒకే పంట.. ఫిక్స్ చేసిన కేంద్రం

97

దిశ, కరీంనగర్ సిటీ: పెరిగిన పెట్టుబడులు, తగ్గిన దిగుబడుల నేపథ్యంలో వ్యవసాయం భారంగా మారుతున్న నేటి రోజుల్లో సాగును బాగు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇష్టారీతిన పంటలు సాగు చేస్తూ నష్టపోతున్న రైతులను ఆదుకుంటూ, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. నూతన వ్యవసాయ చట్టాల్లో భాగమైన నిర్దేశిత పంటల సాగుపై, ఇకనుంచి దృష్టి సారించేలా మార్గదర్శకాలు విడుదల చేసింది.

సీడ్ క్యాలెండర్..

జిల్లాల వారీగా పంటల సాగును నిర్దేశిస్తూ, సీడ్ క్యాలెండర్ విడుదల చేసింది. దీని ప్రకారమే అగ్రి సీడ్స్ మార్కెట్లోకి విడుదల చేయనుండగా, జిల్లాల యంత్రాంగాలకు ఆయా జిల్లాల్లో సాగు చేయాల్సిన, పంటల వివరాలు క్యాలెండర్‌ను అధికారులు ఇప్పటికే చేర వేసినట్లు తెలుస్తోంది. నష్టాల భారిన పడ్డ రైతులను ఆదుకుని, వారి ఆదాయాన్ని రెట్టింపు చేసే క్రమంలో ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ స్కీమ్‌ను, రాబోయే వానకాలం నుంచి అమలు చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

జిల్లాలో ఒకే పంట..

ఒక జిల్లాలో ఒకే పంట వేసేలా రైతులను ప్రోత్సహిస్తూ, యాంత్రిక సాగు కోసం అవసరమైన వ్యవసాయ యంత్రాలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని భూముల తీరు, భూసారం, నీటి లభ్యత ఆధారంగా పండించాల్సిన నిర్దేశిత పంటల జాబితా కూడా జిల్లాలకు చేరింది. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో వరి సాగు, జగిత్యాలలో మామిడి తోటలు, సిరిసిల్లలో చేపల పెంపకం చేపట్టాలంటూ సూచించగా, వచ్చే సీజన్ నుంచి అమలు చేసేందుకు అధికారులు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు.

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు..

ఆయా జిల్లాల్లో పండించే పంటలకు అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో సాగవుతున్న వరి పంటకు అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇప్పటికే కొనసాగుతున్నాయి. సిరిసిల్ల జిల్లాలో కొత్తగా చేపట్టబోయే చేపల పెంపకానికి సంబంధించిన పరిశ్రమలు, జగిత్యాల జిల్లాలో ఉన్న మామిడి తోటలకు అనుగుణంగా, గుజ్జు తీసే పరిశ్రమలు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. జిల్లాల వారీగా పంటల సాగు చేస్తే స్థానిక మార్కెట్ల అభివృద్ధితో పాటు, స్థానికంగానే ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటై, నిరుద్యోగ యువతకు ఉపాధి లభించే అవకాశాలు ఉంటాయని అధికార యంత్రాంగం చెబుతోంది. అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పాటు కానుండగా, దూర ప్రాంతాలకు వెళ్లి తమ ఉత్పత్తులు విక్రయించేందుకు రైతులు పడుతున్న అగచాట్లు తొలగిపోతాయని, అలాగే, భారమవుతున్న పెట్టుబడులు కూడా తగ్గుతాయని వ్యవసాయ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..