వివాదంలో పరుచూరి వెంకటేశ్వరరావు కొడుకు 

44

దిశ, వెబ్ డెస్క్: జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ఫైవ్ దుర్గ భవాని నగర్ లో మూడున్నర సంవత్సరాల బాలుడు సిద్దు మృతి చెందాడు. వారి ఇంటికి సమీపంలోని నిర్మాణంలో ఉన్న స్థలంలో నీరు నిండడంతో గుంతలో పడి ప్రాణాలు కోల్పోయాడు. కాగా ఈ స్థలం.. మాటల రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు రవీంద్రనాధ్ కు చెందినదిగా బాధితులు పేర్కొన్నారు. సదరు స్థలంలో నారాయణ అనే బిల్డర్ నిర్మాణాన్ని చేపట్టారు.

గత నాలుగు నెలల క్రితం నిర్మాణం ప్రారంభమైంది. భారీ వర్షాల కారణంగా నిర్మాణ స్థలంలో నీరు నిలిచింది. బాబు ఆడుకుంటూ వెళ్లి అందులో పడిపోయాడు. రెండు గంటల నుంచి బాలుడు కనిపించకపోవడంతో తల్లి ఆందోళనకు గురై వెతకగా కనిపించలేదు. వెంటనే విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలియజేసింది. బస్తీవాసులు నిర్మాణంలో ఉన్న గుంతలో పడి ఉండొచ్చు అని వెతకగా సిద్దు నిర్జీవంగా కనిపించాడు.

సమాచారం తెలుసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థల యజమాని, బిల్డర్ నారాయణ నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందారని బాలుని తల్లిదండ్రులు బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్దు కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మృతదేహాన్ని తరలించేది లేదని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ సత్తయ్య నేతృత్వంలోని పోలీసుల బృందం ఘటనాస్థలాన్ని పరిశీలించి, బాలుని బంధువుల నుండి వివరాలు సేకరించారు.