టీఆర్ఎస్‌ను గెలిపించే కుట్ర.. కాంగ్రెస్‌లో కోవర్ట్ ఆపరేషన్!

by  |
Congress coverts
X

దిశ, తెలంగాణ బ్యూరో: “కాంగ్రెస్‌పై ఆపరేషన్ కోవర్టు కొనసాగుతున్నది. మొన్నటి వరకూ పెద్ద నేతలపై కేసీఆర్ వల వేస్తే.. హుజూరాబాద్​ ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రి హరీశ్​రావు ఇప్పుడు అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.” అంటున్నారు కాంగ్రెస్ ​నేతలు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు హరీశ్​రావు ఒక వర్గాన్ని వెనుకుండి బరిలోకి దింపుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. దీనికి బలం చేకూర్చుతూ హస్తం పార్టీ నేత, ఎన్నికల కమిటీ చైర్మన్ ​దామోదర రాజనర్సింహా తాజాగా అధిష్టానానికి నివేదిక ఇచ్చారు. అభ్యర్థి ఎంపికలో కుట్ర కోణం దాగి ఉన్నట్లు లేఖలో వివరించినట్లు సమాచారం.

కోవర్ట్​ పార్ట్–2

కాంగ్రెస్‌లో కోవర్టుల కోణం మళ్లీ వివాదమవుతున్నది. దీనికి హుజురాబాద్​ ఉప ఎన్నిక వేదికగా మారుతున్నది. గతంలో టీపీసీసీ చీఫ్‌గా వ్యవహరించిన ఉత్తమ్​కుమార్ ​రెడ్డే కోవర్టు అంటూ మాజీ ఎంపీ వీహెచ్ ఆరోపించారు. చాలా మంది సీనియర్లు కేసీఆర్ కోవర్టులయ్యారని ఆయన మండిపడ్డ విషయం తెలిసిందే. పీసీసీ చీఫ్‌గా రేవంత్​రెడ్డి నియమితులయ్యాక మరోమారు కోవర్టుల అంశం తెరపైకి వచ్చింది. పార్టీ కోవర్టుల అంతు చూస్తామని, స్వచ్ఛందంగా వెళ్లి పోవాలంటూ సంకేతాలిచ్చారు. ఇదే సమయంలో ఉత్తమ్​ సమీప బంధువు కౌశిక్​రెడ్డి వ్యవహారం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్​లో ఉన్నప్పుడే టీఆర్​ఎస్​ టికెట్​ కన్ఫర్మ్​ అంటూ కౌశిక్​ చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. ఈ కారణంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. అప్పుడు కూడా ఉత్తమ్​పై ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్​లో కోవర్ట్​ పార్ట్​ –2 మొదలైందనే గుబులు పార్టీ నేతలకు పట్టుకున్నది. ఒకప్పుడు కాంగ్రెస్​ను బొందపెట్టేందుకు కేసీఆర్​ కోవర్టులను ప్రోత్సహిస్తే.. ఇప్పుడు ఆ బాధ్యతలను హరీశ్​రావు తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.

రాజనర్సింహా నివేదికలో ఏముంది..?

హుజురాబాద్​ ఉప ఎన్నిక సందర్భంగా ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. బీజేపీ నుంచి ఈటల రాజేందర్​ ఆత్మగౌరవ నినాదం ఎత్తుకుంటే.. టీఆర్​ఎస్​ దళిత బంధు, సంక్షేమ సర్కారు నినాదం అందుకున్నది. అదే సమయంలో ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తోంది. కాంగ్రెస్​ పార్టీ ఇంకా సంప్రదింపులతోనే కాలం వెళ్లదీస్తోంది. ఇక్కడ అభ్యర్థి ఖరారు అంశాన్ని పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్​ రాజనర్సింహకు అప్పగించిన విషయం తెలిసిందే. వ్యూహం ప్రకారమే రేవంత్​రెడ్డి తప్పుకొన్నాడనే ప్రచారం కూడా జరుగుతున్నది. రెండుసార్లు హుజురాబాద్​లో పర్యటించిన రాజనర్సింహ టీం ఒక సుదీర్ఘమైన నివేదికను ఏఐసీసీ, టీపీసీసీకి అందించింది. ఈ నివేదికలో తాజా పరిణామాలన్నీ వివరించారు. ఇందులోనే ఓ కోవర్టు కుట్ర సాగుతుందని వెల్లడించినట్లు సమాచారం. హుజురాబాద్​లో కాంగ్రెస్​ తరుపున అభ్యర్థి దొరకడం లేదనే కారణంగా ఇతర ప్రాంత నేతలపై ఫోకస్​ పెట్టారు. వరంగల్​ నుంచి సురేఖ, కరీంనగర్​ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, పెద్దపల్లి నుంచి ఈర్ల కొమురయ్య వంటి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. కానీ దామోదర రాజనర్సింహ బృందం మాత్రం ఒక కుట్ర కోణాన్ని పసిగట్టినట్లు నివేదికలో పొందుపర్చింది. ఇతర ప్రాంతాలకు చెందిన నేతలను హుజురాబాద్​లో పోటీకి దింపడంపై కోవర్టు కుట్ర సాగుతున్నదని, వాళ్ల వెనక ఉన్నదెవరో ఇట్టే తెలిసిపోతుందని వివరించారు. అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు.. ఈటల ఓట్లను చీల్చడమే లక్ష్యంగా కుట్ర జరుగుతున్నదని, ఒక మంత్రి వెనకుండి దీనికి రూపకల్పన చేశారని రిపోర్టులో పేర్కొన్నట్టు గురువారం గాంధీభవన్​లో జరిగిన సమావేశంలో వాడీవేడి చర్చ జరిగింది. మంత్రి హరీశ్​రావును కాంగ్రెస్​ పార్టీ నేత ఒకరు ఇటీవలే కలిశారని కూడా వివరించారు. హుజురాబాద్​ ఉప ఎన్నికలో కోవర్టు ఆపరేషన్ ​జరుగుతుందని దామోదర రాజనర్సింహా అధిష్టానానికి పంపిన నివేదికలో స్పష్టం చేశారు.

హరీశ్​ భుజంపైనే తుపాకి

టీఆర్‌ఎస్ పార్టీ ట్రబుల్​ షూటర్ ​హరీశ్​రావుపై హుజురాబాద్ ​ఉప ఎన్నిక బాధ్యతలను పెట్టారు. ఇక్కడ గెలుపు కోసం హరీశ్ కూడా కేసీఆర్​ పంథాలోనే వెళ్తున్నట్టు తెలుస్తున్నది. ఇలాంటి ఎన్నిక సందర్భంలో ఓట్లు చీల్చితే అధికార పార్టీ అభ్యర్థికి లాభం ఉంటుందనే కోణంలో ఇతర పార్టీలు, స్వతంత్రులను రంగంలోకి దింపే విధంగా వ్యూహం వేస్తున్నారు. మంత్రి హరీశ్​ కూడా ఇప్పుడు అక్కడ అదే ప్లాన్​ను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్​ నుంచి కొంత బలమైన అభ్యర్థిని పోటీకి దింపేలా హరీశ్​రావు వేసిన ప్లాన్​లో కాంగ్రెస్​ చిక్కినట్లు భావిస్తున్నారు. కొన్ని వర్గాల ఓట్లు టార్గెట్​గా పెట్టుకుని ఈ సెగ్మెంట్​లో అలాంటి నేతను పోటికి దింపితే తమ గెలుపు ఈజీ అవుతుందని ప్లాన్​ వేసినట్లు చెప్పుకుంటున్నారు. ఎవరు హరీశ్​రావుకు కోవర్టుగా మారారనే అంశాన్ని మాత్రం తేల్చలేదు.


Next Story

Most Viewed