1st నుంచి స్కూళ్లు షురూ.. ఫీజులన్నీ క్లియర్ చేస్తేనే పైతరగతులకు?

by  |
students
X

దిశ, తెలంగాణ బ్యూరో: “2021-22 అకడమిక్​ ఇయర్ మార్చి ఒకటో తేదీ నుంచే ప్రారంభమవుతోంది. ఈ ఏడాదికి సంబంధించిన పూర్తి ఫీజులు చెల్లించిన విద్యార్థులను మాత్రమే పైతరగతులకు అనుమతిస్తారు. కరోనా కాలంలో విద్యార్థి ఉన్న తరగతి పుస్తకాలు, యూనిఫాంలు కూడా సంబంధిత బ్రాంచిల్లోనే కొనుగోలు చేయాలి…’ ఇదేదో ప్రభుత్వ ప్రకటన అనుకుని తొందరపడకండి. హైదరాబాద్​లో కొన్ని ప్రముఖ, ప్రైవేట్ స్కూళ్ల నిర్వాకం. విద్యార్థులు నష్టపోతారంటూ తల్లిదండ్రులను బెంబేలెత్తిస్తూ డబ్బులు దండుకునే కొత్త ఎత్తుగడకు యాజమాన్యాలు శ్రీకారం చుట్టాయి.

2020-21 అకాడమిక్ ఇయర్‌ కొనసాగడమే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రశ్నార్థకంగా మారగా, పరిస్థితులతో తమకు ఎలాంటి సంబంధం లేనట్టు రాష్ట్రంలోని ప్రముఖ, ప్రైవేట్ స్కూళ్లు వ్యవహరిస్తున్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి కొత్త అకడమిక్ ఇయర్ ప్రారంభిస్తున్నట్టు తల్లిదండ్రులకు మెసేజ్‌లు పంపిస్తున్నాయి. స్కూల్, ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా 2021-22 అకాడమిక్ ఇయర్ ప్రారంభిస్తున్నట్టు, సీట్లను రిజర్వ్ చేసుకోవాలని సూచిస్తున్నాయి. ఓ వైపు కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ ఈ విద్యా సంవత్సరమే కష్టంగా మారుతున్న తరుణంలో మరుసటి సంవత్సరానికి కూడా అడ్మిషన్లు అంటూ కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతున్నాయి.

ఫీజులన్నీ క్లియర్ చేస్తేనే పైతరగతులకు..

మార్చి ఒకటి నుంచి అకడమిక్ ఇయర్‌ను ప్రారంభిస్తున్నట్టు చెబుతున్న స్కూళ్లు, ఫీజుల వసూళ్లలో మాత్రం రాజీ పడటం లేదు. 2020-21 విద్యాసంవత్సరంలో స్టూడెంట్‌ చదువుతున్న క్లాసుకు సంబంధించి మొత్తం ఫీజును చెల్లించాలని స్పష్టం చేశాయి. లాక్‌డౌన్ సమయానికి ట్యూషన్ ఫీజు మినహా ఇతర ఫీజులు వసూలు చేయొద్దని ప్రభుత్వ జీఓలు, కోర్టు తీర్పులు ఉన్నా పట్టించుకోవడం లేదు. ‘నో డ్యూస్’ ఉన్న విద్యార్థినే పైతరగతులకు ప్రమోట్ చేస్తామని ఖరాఖండిగా చెబుతున్నాయి. కొత్త అకడమిక్ ఫీజులు చెల్లిస్తామని, పాతవి మినహాయించాలని కోరుతున్న తల్లిదండ్రుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవడం లేదు. అదనంగా వచ్చే ఏడాదికి సంబంధించిన పుస్తకాలు, స్టడీ మెటీరియల్ మొత్తం ముందుగానే కొనుగోలు చేయాలని యాజమాన్యాలు చెబుతున్నాయి. కరోనా విజృంభించి స్కూళ్లు తెరుచుకోకున్నా నష్టపోకుండా యాజమాన్యాలు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నాయని హైదరాబాద్ స్కూల్ పేరేంట్స్ అసోసియేషన్ విమర్శిస్తోంది. ప్రైవేట్, ప్రముఖ విద్యా సంస్థలు 2019-20 విద్యా సంవత్సరం నుంచే ఫీజులకు సంబంధించిన ఎలాంటి జీఓలను, ప్రభుత్వ ఆదేశాలను పాటించడం లేదని, అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఉండదని అసోసియేషన్ ఆరోపించింది.

ప్రభుత్వం నిర్ణయంతో సంబంధం లేకుండా కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయి. లాక్‌డౌన్ ఆర్థిక ఇబ్బందులతో పిల్లలను చదివించేందుకు కష్టపడాల్సి వస్తోందని విద్యాశాఖకు, కోర్టులకు తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇప్పటికే ఫీజుల భారం, యాజమాన్యాల వేధింపులు భరించలేక ప్రైవేట్ ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యల బాటపట్టాల్సి వస్తుందని పేరేంట్స్ అసోసియేషన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.



Next Story

Most Viewed