- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ‘గని’ దోపిడీ.. ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో గండి!
మైనింగ్ అక్రమాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సీఐడీ విచారణకు సైతం ఆదేశించింది.

దిశ, రంగారెడ్డి బ్యూరో: మైనింగ్ అక్రమాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సీఐడీ విచారణకు సైతం ఆదేశించింది. కానీ.. రంగారెడ్డి జిల్లాలోని మైనింగ్ శాఖ అధికారులకు మాత్రం జంకు లేకుండా పోయింది. గత అక్రమాలకు కొనసాగింపుగా అన్నట్లుగా నేటికీ మైనింగ్ శాఖలో అదేతంతు నడుస్తోంది. తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత అన్నట్లుగా .. పరిమితికి మించి తవ్వకాలు జరుగుతుండగా.. కొన్ని చోట్ల లీజు గడువు ముగిసినప్పటికీ వ్యాపారులు అక్రమంగా తవ్వకాలు జరిపి కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. ఇటీవల కడ్తాల్ మండలంలో రెండు చోట్ల జరుగుతున్న క్వారీల కార్యకలాపాలపై ఫిర్యాదు అందగా.. అధికారులు తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్రానికి అత్యధిక ఆదాయాన్ని ఇస్తున్న జిల్లాలో రంగారెడ్డి జిల్లా కీలక భూమిక పోషిస్తుండగా.. అక్రమాలు సైతం అదే స్థాయిలో ఉంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అక్రమాలు కోకొల్లలు..
జిల్లా వ్యాప్తంగా 152 వరకు క్వార్జ్, గ్రానైట్, కంకర పరిశ్రమలు ఉన్నాయి. రాయి, కంకర పరిశ్రమలు 82, గ్రానైట్ పరిశ్రమలు 15, పలుగు రాయి, ప్లెడ్ స్పార్ పరిశ్రమలు 52, లాటరైట్ పరిశ్రమలు 3 ఉన్నాయి. అయితే ఇందులో ప్రస్తుతం 60 వరకు మాత్రమే ఉనికిలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లాలో నిబంధనలకు విరుద్దంగా గనుల నిర్వహణ సాగుతోంది. ఇష్టానుసారంగా జరుపుతున్న తవ్వకాలతో సహజ వనరులు కనుమరుగైపోతున్నాయి. ఇదే క్రమంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ చెల్లింపుల్లోనూ తీవ్ర అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్, మైనింగ్ శాఖల ఆధ్వర్యంలో గత యేడాది విచారణ జరిపించింది. ఈ మేరకు నిర్వహించిన డీజీపీఎస్(డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, ఈటీఎస్(ఎలక్టానిక్ టోటల్ స్టేషన్) సర్వేల్లో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగుచూశాయి. కానీ.. ఆ నివేదిక మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. తీసుకున్న చర్యలపై కూడా స్పష్టత లేదు. విజిలెన్స్, మైనింగ్ శాఖల ప్రాథమిక నివేదికల ఆధారంగా సీఐడీ ప్రస్తుతం విచారణ జరుపుతోంది. ఈ దర్యాప్తులో ఏం తేలుతుందో! అన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది.
కొరవడిన మైనింగ్ శాఖ పర్యవేక్షణ!
లీజు అనుమతులు పొందినప్పటికీ.. ఒకచోట అనుమతి తీసుకుని మరోచోట తవ్వకాలు సాగించి వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. మరికొందరు అనుమతి పొందిన ప్రాంతం హద్దులు దాటి తవ్వకాలు జరుపుతున్నారు. ఇంకొందరు నిర్దేశిత ప్రాంతంలోనే ఖనిజాలు తవ్వితీసిన లెక్కలు తక్కువ చూపిస్తున్నారు. కొందరైతే రెన్యూవల్ లేని క్వారీలను దర్జాగా నడుపుకుంటున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీలో భారీగా కోతపడుతోంది. మైనింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ అక్రమాల తంతు యథేచ్చగా నడుస్తోంది. ఎవరైనా ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ‘మామూలు’గా తీసుకుని మిన్నకుండి పోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కడ్తాల్ మండలంలోని మైసిగండి, కర్కల్ పహాడ్‌లలోని రెండు క్వారీలపై ఇటీవల మైనింగ్ అధికారులకు ఫిర్యాదు వచ్చింది.
రెన్యూవల్ లేనప్పటికీ ఆయా క్వారీలను నడుపుతున్నట్లు రెవిన్యూ, మైనింగ్ శాఖల సంయుక్త విచారణలో తేలింది. దీనిపై ఏం చర్యలు తీసుకున్నారన్న దానిపై ప్రశ్నిస్తే.. మైనింగ్ అధికారులు కొత్త భాష్యం చెబుతున్నారు. క్వారీకి అనుబంధంగా ఉన్న క్రషర్ మిల్లులకు సంబంధించిన కరెంట్ బిల్లును ప్రామాణికంగా చేసుకుని వారం రోజులకు ఒకసారి ఫైన్ కింద క్వారీ యజమానుల నుంచి వసూలు చేసి ఖజానాలో జమ చేస్తున్నట్లు మైనింగ్ అధికారులు పేర్కొంటున్నారు. దీనివల్ల రాయల్టీ పరంగా ప్రభుత్వ ఖజానాకు కలిగే నష్టం ఏమీ లేదని సెలవిస్తున్నారు. రెన్యూవల్ లేకున్నా.. భాజప్తా క్వారీలను నడుపుకోవచ్చన్నది అధికారులు చెబుతున్న మాట. ఇదిలా ఉండగా.. మైనింగ్‌లో వెలుగు జూసిన అక్రమాల మేరకు పెనాల్టీ వేస్తుండగా.. చెల్లించని క్వారీలపై కూడా అధికారులు ఉదాసీతనను ప్రదర్శిస్తుండటం విస్మయం గొలుపుతోంది.






