కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ.. ఈ సారి ఆ ఇద్దరితో పాటు..

by Prasad Jukanti |   (  Updated:2026-06-23 06:14:51  IST  )

హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ విస్తరణ ప్రాజెక్టుపై చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, అశ్వినీ వైష్ణవ్ ఇవాళ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‍తో సంయుక్తంగా భేటీ అయ్యారు.

కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ.. ఈ సారి ఆ ఇద్దరితో పాటు..
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ పర్యటన (Delhi Tour) కొనసాగుతోంది. హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ ఫేజ్ విస్తరణ, ఐఆర్ఎఫ్‍సీ రుణం విషయంలో నిన్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‍తో భేటీ అయిన రేవంత్ రెడ్డి ఇవాళ కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‍తో భేటీ అయ్యారు. నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి అశ్వినీ వైష్ణవ్‍ను కలవగా ఇవాళ కిషన్ రెడ్డితో పాటు అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి ఖట్టర్‍తో సంయుక్తంగా సమావేశం అయ్యారు. మనోహర్ లాల్ నివాసంలో జరుగుతున్న ఈ భేటీలో హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ, ఐఆర్ఎఫ్‍సీ రుణం, తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చిస్తున్నట్లు సమాచారం.

ఆసక్తికరంగా సీఎం టూర్:

మెట్రో విస్తరణ (Hyderabad Metro Phase 2) విషయంలో గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకువచ్చేలా తాజా ఢిల్లీ పర్యటన కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశం అవుతుండగా ఈ భేటీలకు కిషన్ రెడ్డి సైతం హాజరుకావడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. నిన్న కిషన్ రెడ్డితో కలిసి అశ్వినీ వైష్ణవ్‍ను కలవగా ఇవాళ ఈ ఇద్దరితో పాటు మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంలో భేటీ కావడంతో మెట్రో రైలు, రుణాల విషయంలో సంబంధింత శాఖల మంత్రులు ఒకే వేదికగా భేటీ కావడంతో ఈ సమస్యకు ఓ పరిష్కారం దొరకబోతోందనే చర్చ జరుగుతోంది. అయితే నిన్నటి సమావేశంలో చర్చలు సానుకూలంగా జరిగాయని సీఎం వెల్లడించారు. ఇవాళ ఖట్టర్‍తో చర్చల సారాంశం ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీ అనంతరం మరి కాసేపట్లో ఢిల్లీలో సీఎం మీడియాతో మాట్లాడనున్నారు. దీంతో మెట్రో విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చల సారాంశం ఏంటి? హైదరాబాద్ నగర ప్రజలు సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న మెట్రో విస్తరణ ప్రాజెక్టు ఏ మేరకు ముందుకు పడబోతోంది మరికాసేపట్లో సీఎం వెల్లడించే అవకాశం ఉంది.

Next Story