- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాణ్యత గుత్తేదారు కేరుక..!
గ్రామాల్లో కోట్లాది రూపాయల ప్రజా ధనంతో జరిగే అభివృద్ధి పనుల నాణ్యతలో డొల్లతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

దిశ, కొణిజర్ల: గ్రామాల్లో కోట్లాది రూపాయల ప్రజా ధనంతో జరిగే అభివృద్ధి పనుల నాణ్యతలో డొల్లతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మాది కాదు మా అత్తగారి సొమ్ము అన్న తీరుగా అధికార యంత్రాంగం వ్యవహరించడంతో అక్రమాలకు అడ్డు అదుపు లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పనులు జరిగే సమయంలో దగ్గరుండి పర్యవేక్షించాలని సంబధిత శాఖ ఇంజనీరింగ్ అధికారులు చుట్టపుగా ఇలా వచ్చి అలా వెళ్తుంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడంతో గుత్తేదారుల ఇష్టా రాజ్యాంగా మారింది. మండలంలో ప్రతి ఏడాది ఎన్ఆర్ ఈజీఎస్, సీడిఎఫ్, ఎస్ ఎఫ్ సీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తదితర పథకాల కింద విడుదలైన కోట్లాది రూపాయల నిధులతో గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. సిమెంట్ కాంక్రీట్ (సీసీ) రోడ్లు సైడ్ డ్రైన్స్ ప్రహరీ గోడలు బిల్డింగుల నిర్మాణం తదితర పనుల నిర్వహిస్తారు. వీటిలో అత్యధిక శాతం ఎన్ఆర్ ఈజీఎస్ ఎస్సీ ఎస్టీ సబ్ కింద సీసీ రోడ్లు గ్రామ పంచాయతీ బిల్డింగుల నిర్మాణం జరిగింది.
గోపతి గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణం..
వీటి నిర్మాణంలో నాణ్యత లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా అమలు చేయటంలో చిత్తశుద్ధి లేకపోతే ప్రయోజనం శూన్యం. ఎస్టీమేట్ ప్రకారం పనులు జరగాల్సిన ఉన్నా తుంగలో తొక్కుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. తీగల బంజరలో డ్రైన్స్ సింగరాయపాలెం గుబ్బగుర్తి కొణిజర్ల తనికెళ్ళ పెద్ద గోపతి చిన్న మునగాల పెద్ద మునగాల అమ్మపాలెం రాజ్య తండా చిన్న గోపతి గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది. పోసిన కొన్ని రోజులకే సీసీ రోడ్లు నెర్రలు బారటంతో నాణ్యత డొల్లతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అవినీతికి తోడు బాధ్యతా రహిత్యం కారణంగా కోట్లాది రూపాయలతో వేసిన సీసీ రోడ్లు వేసిన ఏడాదిలోపే శిధిలావస్థకు చేరుకుంటున్నాయి. మండలంలో వివిధ గ్రామాల అనేక చోట్ల నిర్మించిన సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత లేని సిమెంట్ ఇసుక వాడరనే ఆరోపణలు ఉన్నాయి. వాటర్ క్యూరింగ్ సక్రమంగా చేయకపోవటం వలన వేసిన కొద్ది నెలలకే రోడ్డుపై పగుళ్ళు, కంకర తేలటం గుంతలు గుంతలు ఏర్పడుతున్నాయి.
వాటర్ క్యూరింగ్ చేయకపోవటంతో...
కనీసం నెలలు గడవక ముందే రోడ్లు పగుళ్ళు రావటంతో త్వరగా పాడైపోతున్నాయని ప్రజలు తీవ్ర అసహనాన్ని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చిన్న మునగాల ఎస్సీ కాలనీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబధించి 103 లక్షల సీఆర్ఆర్ ఎస్సీపి (ఎస్సీ ప్రాంత అభివృద్ధి ప్రత్యేక నిధి) నిధులతో సీసీ రోడ్డు నిర్మించారు. నిబంధనల మేరకు తగిన మోతాదులో సిమెంట్ వాడకపోవడం సక్రమంగా వాటర్ క్యూరింగ్ చేయకపోవటంతో వేసిన కొద్ది రోజులకే రోడ్డు నెర్రలు బారింది. రోడ్డు పోసే సమయంలో కింద బ్లాక్ షీట్ వేయాల్సిన వేయలేదు. ఫలితంగా కొట్లాది రూపాయల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీర్ అయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎన్ఆర్ఈజీఎస్) పథకం కింద గద్దలగూడెం తుమ్మలపల్లి మల్లుపల్లి కొత్త కాసారం గ్రామాలలో గ్రామపంచాయతీ బిల్డింగ్ నిర్మాణం కొనసాగుతుంది.
స్లాబ్ కోసం ఏర్పాటు...
గద్దల గూడెంలో నిర్మించే బిల్డింగు పూర్తి నాసిరకంగా ఉంది. నిర్మాణ పని జరిగే సమయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో తక్కువ మోతాదులో సిమెంట్ వాడారని స్థానికుల ఆరోపించారు. ఇనుప సువ్వలు బయటకు కన్పిపించే విధంగా పిల్లర్లు నిర్మించారు. స్లాబ్ కోసం ఏర్పాటు చేసిన సెంట్రింగ్ చెక్క ఎత్తు పల్లాలుగా కొట్టారు. నాణ్యత పాటించకపోవటం వలన బిల్లింగ్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. మిగతా చోట్ల నిర్మించిన బిల్డింగ్లలో కూడా నిబంధనల మేరకు నాణ్యత ప్రమాణాలు పాటించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు విచారణ జరిపి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం: ఏఈ కిషోర్ చిన్న మునగాల రోడ్డు నెర్రలు బారిన విషయంపై పంచాయతీరాజ్ ఏఈ కిషోర్ నివారణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.






