వంద ఇస్తేనే వంద రోజుల పని.. ఉపాధి హామీ కులీల నుండి వసూలు

by Kodari Anjali |

కూలీలకు ఉపాధి కల్పించి ఆర్థిక భరోసా అందించాల్సిన జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలోనే అక్రమాల పరంపర కొనసాగుతోంది.

వంద ఇస్తేనే వంద రోజుల పని.. ఉపాధి హామీ కులీల నుండి వసూలు
X

దిశ, ఇనుగుర్తి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల పాటు వేతనంతో కూడిన పనిని కల్పించే చట్టబద్ధమైన సామాజిక భద్రతా పథకం. కూలీలకు ఉపాధి కల్పించి ఆర్థిక భరోసా అందించాల్సిన జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలోనే అక్రమాల పరంపర కొనసాగుతోంది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం పరిధిలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనుల నిర్వహణలో కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది కూలీల నుంచి అక్రమంగా డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మస్టర్లు వేయడానికి,పేర్లు నమోదు చేయడానికి,లేదా డబ్బులు పడటానికి,కొలతలు అంతర్జాలంలో నమోదు చేయాలంటే సాంకేతిక సహాయకులకు మామూళ్లు ఇవ్వాలంటూ కూలీల నుంచి వారానికి రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు.

డబ్బులు ఇవ్వని వారిపై వివక్ష..

కొన్నిచోట్ల ఫీల్డ్ అసిస్టెంట్లు,మరికొన్ని చోట్ల మేట్లు వసూళ్లకు పాల్పడుతున్నారు.సాంకేతిక సహాయకులు కూడా పని ప్రదేశానికి వెళ్లి కొలతలు వేయకుండా ఇష్టం వచ్చినట్లుగా రికార్డులు నమోదు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పనులు కల్పించడం,మస్టర్లు నమోదు,కొలతలు ఇలా ప్రతి దశలోనూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. వారానికి ఒక్కో కూలీ నుంచి రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారని, డబ్బులు ఇవ్వని వారిపై వివక్ష చూపుతున్నారని కూలీలు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇవ్వని వారి పనుల కొలతలు తగ్గించి నమోదు చేయడం, వేతనాల్లో కోత విధించడం, పనులు అప్పగించకపోవడం వంటి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బులు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమాలపై అధికారులకు ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. క్షేత్రస్థాయిలో పారదర్శకత లోపించడం, అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తడం పథకం ఆశయానికి గండి కొడుతోంది.

Next Story